గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రమాదమే
నాలుగైదు వారాలు క్లిష్ట పరిస్థితే అంటున్న వైద్యాధికారులు
నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణానికే ప్రమాదం
సెప్టెంబర్ మొదటి వారం వరకు డేంజరే
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దిశగా పయనిస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న మొన్నటి వరకు సింహభాగం పాజిటివ్ కేసులు కేవలం హైదరాబాద్ మహానగరానికే పరిమితమైనప్పటికీ, తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నప్పటికీ సామాజిక వ్యాప్తి చెందితే నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నట్టు వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న నాలుగైదు వారాలు మరింత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొవాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారం వరకు అంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ప్రమాదకరమని హెచ్చరికలు జారీ చేస్తోంది. కరోనా లక్షణాలు కనిపించినా తక్షణమే స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని, హైదరాబాద్‌కు రావాల్సిన అవసం లేదని స్పష్టం చేసింది. కాగా సామాజిక వ్యాప్తి చెందినట్లు వైద్యాధికారులు అధికారికంగా ధ్రువీకరించకపోయినప్పటికీ ఆ ప్రమాద ఘంటికలు మాత్రం ఉన్నట్టు సూచనప్రాయంగా చెబుతోంది. కాగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని అధికారులు చెబుతున్నారు. సామాజిక వ్యాప్తి చెందినా, చెందకపోయినా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉన్నదని, కరోనా పరీక్ష కేంద్రాలను వికేంద్రీకరణ చేశామని, ఎక్కడికక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాస్‌రావు మీడియాకు వివరించారు. గతంతో పొలిస్తే హైదరాబాద్‌లో కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ జిల్లాలో మాత్రం పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా పట్ల ప్రజల్లో భయందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు ఆక్సిజన్ కొరత, సౌకర్యాలలేమీతో ఇబ్బంది పడుతున్నామని బాధితులు వీడియోలు విడుదల చేయడం వైద్య ఆరోగ్య శాఖ పని తీరుకు అద్దం పడుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం రోగుల బాధలను ఏమాత్రం పట్టించుకోకపోగా వారు ఫోన్లు ఉపయోగించడాన్ని తప్పుపడుతోంది. జిల్లాల్లో కూడా కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా జిల్లా మండల, గ్రామస్థాయిలో వైద్య సదుపాయాన్ని కల్పించాలని, ఎక్కడికక్కడ పరీక్షలను నిర్వహించి, పాజిటివ్ కేసులను గుర్తించి వెంటనే చికిత్స చేపట్టాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, తదితర సౌకర్యాలను ఏర్పాటుచేయాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, కరోనా బాధితులు, ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
రానున్న నాలుగైదు వారాలు చాలా క్లిష్టపరిస్థితులే డాక్టర్ శ్రీనివాస్‌రావు
‘బాధాతత్వ హృదయంతో అభ్యర్థిస్తున్నాం. వచ్చే నాలుగైదు వారాలు రాష్ట్రంలో చాలా క్లిష్టపరిస్థితులు ఉండబోతున్నాయి’ అని వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాస్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని కంట్రోల్‌రూమ్ కేంద్రంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ దిగువ శ్రేణి నగరాలు, జిల్లా హెడ్ కార్వర్టర్స్‌లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా, కొవిడ్ లక్షణాలు కనిపించినా వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. జర్వం, దగ్గు అని ముసుగేసుకోవద్దని సూచించారు. ప్రజలు సకాలంలో స్పందిచకపోతే ప్రాణాలను కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటామని, అలాంటి పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని శ్రీనివాస్‌రావు సూచించారు. కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి జరిగినా, జరగకపోయినా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగానే ఉన్నదని, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రస్తుతం ప్రతి రోజూ 15 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో 20 నుంచి 25 వేల వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పరీక్షలను వికేంద్రీకరణ చేశామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా నిర్వహిస్తున్నామన్నారు.