ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఐదు ముంపు గ్రామాలను ప్రజల ఆందోళన
అడుగడుగునా అడ్డగింతలు
ఇరు రాష్ట్రాల సరిహద్దు రణరంగం
పంచాయతీల విలీన ఉద్యమానికి సిపిఐ, కాంగ్రెస్, బిజెపి, సిపిఐ(ఎం) సంఘీభావం
ప్రజాపక్షం/ భద్రాచలం ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక, పిచుకలపాడు, కన్నాయిగూడెం ప్రజలు చేపట్టిన శాంతియుత ఆందోళన కార్యక్రమం సరిహద్దుల్లో రణరంగంగా మారింది. ముందురోజే కార్యక్రమం వివరాలు వెల్లడికావడంతో ఇటు తెలంగాణ పోలీసులు, అటు ఆంధ్రా పోలీసులు అప్రమత్తమయ్యారు. వాస్తవానికి పిచ్చులకపాడు ప్రధాన రహదారిపై కార్యక్రమాన్ని చేయాలని యోచించినప్పటికీ పోలీసుల తీరుతో సాధ్యపడలేదు. దీంతో భద్రాచలం సరిహద్దు రాజుపేట శివారులో ఆందోళన నిర్వహించారు. కార్యక్రమానికి ఎపి గ్రామ పంచాయతీల నుండి వచ్చే ప్రజల ను ఆ రాష్ట్ర పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నా రు. ప్రజలను తరలిస్తున్న ఆటోలను ఆపి ఎటపాక పోలీస్టేషన్‌కు తరలించారు. ముందు రోజు నుంచే కొందరిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ వైపు నుండి పిచ్చుకలపాడుకు బయలు దేరిన ఇక్కడి నాయకులను సైతం తెలంగాణ పోలీసులు అడ్డగించారు. రాజుపేటశివారులో తెలంగాణ సరిహద్దు నుండి ముందుకు కదలనివ్వలేదు. దీంతో చేసిది లేక అక్కడే బైఠాయించాల్సి వచ్చింది. విషయాన్ని తెలుసుకున్న విలీన మండలాల ప్రజలు, పలు రాజకీయ పార్టీల నాయకులు, మద్దతుదారులులతో పాటు విలీన పంచాయతీల ప్రజలు వేలాదిగా అక్కడికి చేరుకున్నారు. దీంతో ఒకనొక దశలో తెలంగాణ పోలీసులు ప్రజలను అదుపుచేసే పరిస్థితి చేజారింది. ఈ సందర్భంగా సుమారు మూడు గంటల పాటు ఇరువైపులా వాహనలు నిలిచిపోవడంతో రాకపోకలు సాగలేదు. ఆందోళన చేస్తున్న వారికి సిపిఐ, కాంగ్రెస్, బిజెపి, సిపిఐ(ఎం), బిఎస్‌పితో పాటు పలు సంఘాల నాయకులు సైతం సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాల తీరపై మండిపడ్డారు. ఆ ఐదు పంచాయతీలను గౌరప్రదంగా తెలంగాణకు తిరిగిస్తే మంచిదని, భద్రాచలం అభివృద్ధి చెందాలంటే ఇది జరిగి తీరాలన్నారు. ఇందుకోసం తెలంగాణ-, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంప్రదింపులు జరుపుకుని ఓ నిర్ణయానికి వచ్చి, ఆ నిర్ణయాన్ని కేంద్రానికి పంపించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఇక్కడి ప్రజాభిష్టం మేరకు తెలంగాణలో కలపాలన్నారు. తాజాగా గోదావరి వరదలు వచ్చినప్పుడు ఈ పంచాయతీల ప్రజలకు ఆపన్నహస్తం అందక అల్లాడిపోయారని, ఎపి ప్రభుత్వం కనీసం పట్టించుకోక పోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మానవతా కోణంలో ప్రాణాలు కాపాడిందని, వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన తప్పిదం వల్ల ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా రాముడిపై ఏ మాత్రం బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా ఆ ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఇది ఇప్పటికిప్పుడు పుట్టిన ఉద్యమం కాదని, ఎనమిదేళ్ళుగా ప్రజలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారని, రాజకీయాల కోసమే ఇప్పుడు మాట్లాడుతున్నారని కొందరు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ పంచాయతీలను విలీనం చేస్తేనే భద్రాచలానికి మనుగడ ఉంటుందని, దక్షిణ అయోధ్యను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ప్రజల తరుపున పోరాడే కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుంటే ఇది పెద్ద సమస్యే కాదని, సరిహద్దుల సమస్యల కారణంగా ప్రజలు నలిగిపోతున్నారని చెప్పారు. ఆ ఐదు పంచాయతీలకు చెందిన ప్రజలకు ప్రభుత్వ పరమైన మేలు ఏమీ జరగడం లేదని, అధికారులు కూడా సరిగా అందుబాటులో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చేస్తున్న ఆందోళన సహేతుకమైందని, కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రజల గోడు ఇక్కడి పాలకులకు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస జ్ఞానం లేకుండా రాష్ట్ర సరిహద్దులు ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజల ఆవేదనను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవాలన్నారు. ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలంటూ ఏళ్ల తరబడి పెద్దఎత్తున పోరాటం సాగిందని, సిపిఐ ఆధ్వర్యంలో గత కొన్ని రోజుల క్రితం ఉద్యమాన్ని నిర్వహించామని గుర్తు చేశారు. పేద ప్రజల కోసం పాటుపడే సిపిఐగా ఈ ప్రజా మనుగడ పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఇవసరమైతే ఢిల్లీ వీధుల్లో సైతం పంచాయతీల సాధన కోసం పోరాటాన్ని సాగిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ప్రాంతం కనుమరుగుయ్యే పరిస్థితి ఉందని, ఎప్పటికీ 43 అడుగుల గోదావరి ప్రవహిస్తుందని నీటి పారుదల నిపుణులు చెబుతున్నారని అన్నారు. ఇలాంటి క్రమంలో పోలవరం ఎత్తు తగ్గించడం తప్ప వేరే మార్గం లేదని, భద్రాచలం వద్ద కరకట్టను పటిష్టం చేసి ఎత్తు పెంచాలని, కరకట్టను పొడిగించాలని, వరదల పట్ల ప్రజలకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రావులపల్లి రవికుమార్, తమ్మళ్ల వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు బుడగం శ్రీనివాస్, సరెళ్ల నరేష్, బోగాల శ్రీనివాసరెడ్డి, బిజెపి నాయకులు కుంజా ధర్మారావు, రామ్మోహన్ రావు, నాగబాబు, సిపిఐ(ఎం) నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, గడ్డం స్వామి, బిఎస్‌పి నాయకులు గడ్డం సుధాకర్, టిఎన్‌జిఓస్ నాయకులు చల్లగుళ్ల నాగేశ్వరరావు, ఎంపి కాంగ్రెస్ నాయకులు నక్సా వెంకన్న, ఎపి సిపిఐ నాయకుల పాటు తో పలు సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
తెలంగాణలోనే ఉంటాం
RELATED ARTICLES