హైదరాబాద్: లక్షద్వీప్ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ’తౌక్టే’ కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపుల కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమలలో ఈదురు గాలులు, తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. విదర్భ, పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం బలహీన పడడంతో. దీనివల్ల తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను రాష్ట్రంపై రెండు రోజుల పాటు ప్రభావం చూపవచ్చు. తొలుత దక్షిణ, నైరుతి జిల్లాలపై , ఆ తర్వాత పశ్చిమ జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వివరించారు. ఇలావుంటే, ఈసారి నైరుతీ రుతుపవనాలు ఒక రోజు ముందుగానే కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) తెలిపింది. ఈనెల 22న దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతానికి రుతుపనాలు చేరనున్నాయని ప్రకటించింది. ఫలితంగా ఈనెల 31వ తేదీన రుతుపనాలు కేరళను తాకుతాయని అంచనా వేసింది.