సిపిఐ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని
ప్రజాపక్షం / హైదరాబాద్ తెలంగాణ పట్ల కడుపు నిండా ద్వేషం, హృదయం నిండా ద్రోహం ఉన్న ప్రధా ని నరేంద్రమోడీకి మునుగోడు ఉప ఎన్నికలో ఓట్లు అడిగే హక్కు లేదని సిపిఐ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తలుపు, కిటికీలు మూసివేసి, పెప్పర్ స్ప్రేతో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని పాస్ చేశారని, తల్లీబిడ్డలను విడదీశారని అవహేళన చేసే పద్ధతిలో నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పట్ల ఆయనకున్న ద్వేషానికి అద్దం పడుతున్నాయన్నారు. తెలంగాణ పట్ల ఉన్న వివక్ష వల్లే విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, అలాంటి బిజెపి నేడు మునుగోడులో ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతదని కూనంనేని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పలేమని తెలంగాణ బిడ్డయిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎలాంటి సంప్రదింపులు లేకుండా చెప్పారని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు ప్రాజెక్టు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు కేంద్రం నుండి ఎలాంటి సహాయం అందించని బిజెపి… ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నదని ఎద్దేవా చేశారు.
కాంట్రాక్టుకు అమ్ముడు పోయిన రాజగోపాల్‌రెడ్డి… మాటలు అదుపులో పెట్టుకోవాలి
మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, కమ్యూనిస్టుల చరిత్ర ఆయనకు తెలియదని కూనంనేని సాంబశివరావు అగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి వంటి దొరలను తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి వున్నదని, కమ్యూనిస్టుల ఓట్లతో గెలిచినప్పుడు కమ్యూనిస్టులు దేవుళ్ళని, ఇప్పుడు ఎలా దెయ్యాలు అయ్యారని ప్రశ్నించారు. రూ.24 వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడు పోయిన రాజగోపాల్‌రెడ్డికి సిగ్గు లేకుండా కమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. డబ్బు, అధికారం కోసం రోజుకొక పార్టీ మార్చే ఆయన వంటి వారు అధికారం, పదవులు వున్నా లేకున్నా అంకితభావంతో పనిచేసే కమ్యూనిస్టుపార్టీని విమర్శించే నైతికత లేదన్నారు. నల్లగొండ జిల్లా కాదు, ఎర్రకొండ అని, కమ్యూనిస్టులతో పెట్టుకున్నవారు ఎవరూ మిగలరని, మాటలు అదుపులో పెట్టుకోవాలని కూనంనేని హెచ్చరించారు.
యుటిఎఫ్ నేత మృతి పట్ల సంతాపం
యుటిఎఫ్ నాయకులు నాగటి నారాయణ మతి పట్ల సిపిఐ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన మృతి వామపక్ష పార్టీలకు లోటు అని వారన్నారు. నారాయణకు సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
తెలంగాణపై విషం చిమ్మే బిజెపికి ఓట్లడిగే హక్కు లేదు
RELATED ARTICLES