HomeNewsAndhra pradeshతెలంగాణకు కొత్త గవర్నర్‌?

తెలంగాణకు కొత్త గవర్నర్‌?

పార్లమెంటు సమావేశాల తర్వాత నియమించే అవకాశం
హోంశాఖ వర్గాల సమాచారం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌
ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా అనసూయ ఊకే
హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ను నియమించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కూడా గవర్నర్‌ ను నియమించే అవకాశముందని కేంద్ర హోం శాఖ వర్గాలు ద్వారా తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాల తర్వాత రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్ల నియమాకం జరిగే అవకాశం ఉన్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాగా ఎపికి గవర్నర్‌ను నియమించారు. విభజన చట్టం ప్రకారం పదేళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ఇన్నాళ్లు ఒకే గవర్నర్లు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగుతూ వస్తున్నారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో 2009 నుంచి కూడా ఆయనే ఉన్నారు. రెండు రాష్ట్రాలు పూర్తిగా వాటి భూభాగాల నుంచి పరిపాలన సాగిస్తుండటం, హైకోర్టు కూడా వేరుపడిన నేపథ్యంలో గవర్నర్లను కూడా వేరుగా నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చిన కేం ద్రం, ఎపికి గవర్నర్‌ను నియమించింది. ప్రస్తుత గవర్నర్‌ పదేళ్లకు పైగా కొనసాగుతున్నారని, ఇంకా కొనసాగించడం బాగుండదన్న ఉద్దేశంతో హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచా రం. ఎపికి కొత్త గవర్నర్‌ను నియమించిన నేపథ్యంలో ఇక తెలంగాణ గవర్నర్‌పై కూడా దృష్టి సారించిందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ను ఇక్కడి నుంచి బదిలీ చేయడమో, జమ్మూకశ్మీర్‌ వ్యవహారాల సలహాదారుగా ఉపయోగించుకోవడమో జరగొచ్చని హోంశాఖ వర్గాల సమాచారం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రెండవసారి కొలువుదీరిన వెంటనే ప్రస్తుత గవర్నర్‌ మార్పునకు ప్రయత్నిస్తామని గతంలో బిజెపి రాష్ట్ర తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నేతలు రెండు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లను నియమించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు గత కొంత కాలంగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే కొత్త గవర్నర్ల నియామకం జరగొచ్చని హోంశాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న గవర్నర్‌ నరసింహన్‌ సిఎం కెసిఆర్‌తో సన్నిహితంగా ఉండడంతో రాష్ట్రంలోని పలు అంశాల విషయలో పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బిజెపి నేతలు బాహటంగానే చెబుతున్నారు. ఇంటర్‌ ఘటన నుంచి మొదలు అనేక అంశాలలో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని అందుకే తెలంగాణకు ఇతర గవర్నర్‌ను నియమించాలని ఇక్కడి ముఖ్యనేతలు పలు సందర్భాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కోరినట్లు ఒక నేత పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణకు కొత్త గవర్నర్‌ నియామకం జరుగుతుందని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌గా..
ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌గా బిజెపి సీనియర్‌ నేత బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ఛత్తీస్‌గఢ్‌ కొత్త గవర్నర్‌గా బిజెపి నేత అనుసూయ ఉయికే నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ ఇక నుంచి తెలంగాణకు మాత్ర మే పరిమితం కానున్నారు. నరసింహన్‌ దశాబ్ది కాలంగా ఎపికి గవర్నర్‌గా ఉన్నారు. ఒడిశాకు చెందిన విశ్వ భూషణ్‌ హరిచందన్‌ ఐదు సార్లు ఎంఎల్‌ఎగా గెలిచారు. మూడు సార్లు బిజెపి నుంచి గెలవగా జన తా, జనతాదళ్‌ పార్టీల నుంచి మరో రెండు సార్లు గెలిచారు. భువనేశ్వర్‌ నుంచి మూడు సార్లు గెలిచిన ఆయన సిలికా నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజ యం సాధించారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌ నియామకంపై ఊహాగానాలు నెలకొన్నాయి. ఒకానొక సందర్భంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ను నియమించనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. 1971లో జనసంఘ్‌తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1977లో బిజెపిలో చేరారు. న్యాయవాద విద్యను అభ్యసించిన బిశ్వభూషణ్‌ ఒడిశా రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఒరియాలో అనేక పుస్తకాలు రచించారు. మారుబటాస్‌, రాణా ప్రతాప్‌, శేషజలక్‌, అస్తశిఖ, మానసి గ్రంథాలను రాయన రాశారు. సుదీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో కొనసాగిన ఆయన ప్రస్తుత వయసు 85 ఏళ్లు. ఒడిశా బిజెపి ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు. 1980 నుంచి 1988 వరకు ఒడిశా బిజెపి అధ్యక్షుడిగా పనిచేశారు. ఛత్తీస్‌గఢ్‌ నూతనగవర్నర్‌గా మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన బిజెపి నాయకురాలు అనసూయ ఉయికే నియమితులయ్యారు. ఆమె రాజ్యసభ సభ్యత్వం 2022తో ముగియనుంది. మహిళలకు న్యాయం చేయడం, ముఖ్యంగా గిరిజన మహిళల సమస్యలకు పరిష్కారం వెతకడంలో ఆమె విశేష సేవలందించారు. గిరిజన మహిళల సాధికారత చైతన్యం కోసం కూడా ఆమె పాటుపడ్డారు. మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ అయిన ఆనందీబెన్‌ పటేల్‌ ఛత్తీస్‌గఢ్‌కు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నది ఇక్కడ గమనార్హం. బలరామ్‌ దాస్‌ టండన్‌ కన్నుమూశాక గత ఆగస్టు నుంచి ఆనందీబెన్‌ ఛత్తీస్‌గఢ్‌ అదనపు గవర్నర్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హరిచందన్‌, అనసూయ గవర్నర్ల నియామక అధికార ఉత్తర్వులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్‌కు బిజెపి నాయకుడు కల్‌రాజ్‌ మిశ్రా నియమితులు కాగా, హిమాచల్‌ ప్రదేశ్‌కు గవర్నర్‌గా పనిచేసిన ఆచార్య దేవ్రత్‌ను గుజరాత్‌ గవర్నర్‌గా నియమించారు. ఆయన సోమవారం పదవీ విరమణ చేయనున్న ఒపి కోహ్లి స్థానంలో పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments