60 ఏళ్లలో కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చింది
నిత్యావసర ధరలను పెంచింది కేంద్రం కాదా..
మంత్రి కెటి. రామారావు వ్యాఖ్యలు
నిరూపిస్తే ఎంపిగా రాజీనామా చేయాలని బండి సంజయ్‌కి సవాల్
మంత్రి పర్యటనకు నిరసన సెగ
ప్రజాపక్షం / వనపర్తి బ్యూరో/మహబూబ్‌నగర్ బ్యూరో
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రాంతాన్ని ఏడారిగా మార్చిందని రాష్ట్ర పురపాలక శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కేటాయించారో, ఎంత అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు రావాలని రాష్ట్ర బిజెపి నేతలకు మంత్రి కెటిఆర్ సవాలు విసిరారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మంగళవారం జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అలంపూర్ చౌరస్తాలో 100 పడకల ఆసుపత్రి, జూరాల ప్రాజెక్టు వద్ద బృందావన్ గార్డెన్ నిర్మాణానికి శంకుస్థాపన, సంగాల చెరువు వద్ద సంగాల పార్కు ఏర్పాటు, గద్వాల మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం గద్వాల మార్కెట్ యార్డులో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడారు. “నిత్యావసర ధరలను పెంచింది కేంద్రం కాదా… వాటన్నింటినీ నిరూపిస్తాం.. ఎంపిగా రాజీనామా చేస్తావా అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి సంజయ్ కుమార్‌కు మంత్రి సవాల్ చేశారు. పెట్రోల్, గ్యాస్ ధరలతో పాటు, నిత్యావసర ధరలను పెంచి ఏటా రూ.2.72 లక్షల కోట్లను పన్నుల రూపంలో తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తే మన రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ.1.40 లక్షల కోట్లు మాత్రమేనని మంత్రి కెటిఆర్ అన్నారు. రాష్ట్రంలో పాదయాత్ర మొదలుపెట్టిన బండి సంజయ్‌కు మన ప్రజలు చెల్లిస్తున్న పన్నులు తెలియదా అని ప్రశ్నించారు. పాదయాత్ర చేసే ముందు బిజెపి పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని ఇక్కడి తెలంగాణ ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి నాయకులు పదవుల కోసమే పెదవులు మూసుకుని ఉన్నారని మంత్రి విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన రాష్ట్రంలోని బిజెపి నాయకులకు సూచించారు. కొత్త బిచ్చగాళ్ల లాగా కాంగ్రెస్ పార్టీ పదవులు తెచ్చుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కెటిఆర్ విమర్శించారు. ఓటుకు నోటు కేసులో బహిరంగంగా పట్టుబడిన వ్యక్తులే నోటికి వచ్చినట్లు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టామని, భవిష్యత్తులో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పరచడానికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని, త్వరలోనే గద్వాల జిల్లాలో మెడికల్ కళాశాలను మంజూరు చేయనున్నామని మంత్రి వెల్లడించారు. ఈ పాలమూరు ప్రాంతంలో అధికంగా ఉన్న బోయలను ఎస్‌టి జాబితాలో చేర్పించడానికి చెన్నప్ప కమిషన్ వేశామని, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపామని మంత్రి గుర్తు చేశారు. ఇదే ప్రాంతం నుంచి బిజెపి జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్న డి.కె.అరుణ కేంద్రంతో మాట్లాడి ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ సభలో రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, పి.సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపి రాములు, ఎంఎల్‌ఎలు కృష్ణ మోహన్‌రెడ్డి, డాక్టర్ అబ్రహం, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జెడ్‌పి చైర్‌పర్సన్‌లు సరిత తిరుపతయ్య, స్వర్ణ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అరెస్టు , నిరసనలతో అట్టుడికిన గద్వాల…
రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు పర్యటన సందర్భంగా గద్వాల జిల్లా అరెస్టులు, నిరసనలతో అట్టుడికింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో జిల్లా కేంద్రం హోరెత్తింది. హైదరాబాద్ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరిన ఆయన ముందుగా అలంపూర్ పట్టణంలోని చౌరస్తా వద్ద వంద పడకల ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. మంత్రి కెటిఆర్ పర్యటనలో ఆందోళనలు జరుగుతాయని ముందే పసిగట్టిన పోలీసులు అఖిలపక్షం నాయకులను అరెస్టు చేశారు. సిపిఐ, టిడిపి, బిజెపితో పాటు, పలు రైతు సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులపై రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, కల్తీ విత్తనాల మాఫియా, రేషన్ బియ్యం మాఫియాకు అండగా ఉన్నామని చెప్పడానికి కెటిఆర్ జిల్లాకు వచ్చాడా అని ప్రతిపక్ష నాయకులు ఈ సందర్భంగా ప్రశ్నించారు. మరో నాలుగు జిల్లాలకు మెడికల్ కళాశాలలు ప్రకటించి జోగులాంబ గద్వాల జిల్లాకు ప్రకటించడకపోవడంలో అంతర్యమేమిటని, మెడికల్ కళాశాల కోసం కెటిఆర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి అఖిలపక్ష నాయకులకు అనుమతి ఇచ్చి రాత్రికి రాత్రి అరెస్టులు చేయించడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. అలంపూర్‌లోనే వంద పడకల ఆసుపత్రిని నిర్మించాలని కెటిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అలంపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ మనోరమ, వైస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి సైతం మంత్రి కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. పండ్ల ప్రారంభోత్సవానికి వెళ్తుండగా గద్వాల జిల్లా గోస్పాడు రైతులు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ప్యాకేజీ 98కాలువ పనులు పూర్తి కాకుండా మీరు శంకుస్థాపన ఎలా చేస్తారని నిలదీశారు. ఈ ప్రశ్నలకు జిల్లా అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్ చేశారు.
తెలంగాణకు..కేంద్రం తీవ్ర అన్యాయం
RELATED ARTICLES