లేనట్లయితే దేశ భద్రతలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయ్
మణిపూర్ సమస్యపై కేంద్రానికి ‘ఇండియా’ ఎంపిల హెచ్చరిక
క్షేత్రస్థాయి పరిస్థితులపై గవర్నర్ యూకీకి మెమోరాండం సమర్పణ
ఇంఫాల్ : మణిపూర్‌లో దాదాపు మూడు నెలల నుంచి కొనసాగుతున్న తెగల మధ్య ఘర్షణలకు సత్వరమే తెర దించకపోతే, దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపిలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 21 ఎంపిలతో కూడిన ప్రతినిధి బృందం శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పర్యటించి, ఘర్షణల బాధితులను కలుసుకొని, తెలుసుకొన్న విషయాలను గవర్నర్ అనుసూయియా యూకీకి వివరించింది. ఈ ఎంపిలు గవర్నర్‌ను కలుసుకున్న తర్వాత రాజ్‌భవన్ వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపి అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, ఘర్షణలకు సత్వరమే తెర దించకపోతే, దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు. శని, ఆదివారాల్లో తాము రాష్ట్రంలో పర్యటించామని, తాము అనేక అంశాల గురించి తెలుసుకున్నామని చెప్పారు. ఈ వివరాలను తాము గవర్నర్ వద్ద ప్రస్తావించామని తెలిపారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన 21 మంది ఎంపీలు సంయుక్తంగా గవర్నర్‌కు వినపతిపత్రాన్ని ఇచ్చినట్లు తెలిపారు. గవర్నర్ స్పందిస్తూ, రాష్ట్రంలోని పరిస్థితులపై తన బాధను, ఆవేదనను వ్యక్తం చేశారన్నారు. తాము చెప్పిన మాటలతో గవర్నర్ ఏకీభవించారని తెలిపారు. అన్ని తెగలవారితోనూ సమావేశాలను ఏర్పాటు చేసి, సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలని ఆమె చెప్పారన్నారు. అధికార, ప్రతిపక్షాలు కలిసి రాష్ట్రానికి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపించాలని సలహా ఇచ్చారని చెప్పారు. ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని పారదోలడానికి, సమస్యను పరిష్కరించడానికి అన్ని తెగల ప్రతినిధులతోనూ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పారన్నారు. ఈ సలహాకు తాము కూడా అంగీకారం తెలిపామని చెప్పారు. మణిపూర్ పర్యటనలో తాము తెలుసుకున్న అంశాలను పార్లమెంటులో కూడా చెప్పేందుకు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితి రోజు రోజుకూ క్షీణిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల జరిగిన లోపాలను పార్లమెంటులో ప్రస్తావిస్తామన్నారు. దీనిపై పార్లమెంటులో చర్చించాలని పట్టుబడతామన్నారు. లోయలో నివసిస్తున్న మెయిటీలు రాష్ట్రంలోని కుకీలు నివసిస్తున్న కొండ ప్రాంతాల్లోకి వెళ్లలేకపోతున్నారని, అదేవిధంగా కుకీలు లోయ ప్రాంతంలోకి రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ సరుకులు, పశువుల దాణా, పాలు, చిన్న పిల్లల ఆహారం వంటి నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోందన్నారు. ఈ సమస్యలన్నిటినీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ సమస్యలను కలిసికట్టుగా పరిష్కరించాలని గవర్నర్ చెప్పారన్నారు. మణిపూర్ పర్యటనలో పాల్గొన్న ఎంపిల్లో కాంగ్రెస్‌కు చెందిన అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్‌తోపాటు సుస్మిత దేవ్ (టిఎంసి), మహువ మజి (జెఎంఎం), కనిమొళి (డిఎంకె), మహమ్మద్ ఫైజల్ (ఎన్‌సిపి), చౌదరి జయంత్ సింగ్ (ఆర్‌ఎల్‌డి), మనోజ్ ఝా (ఆర్‌జెడి), ఎన్‌కె ప్రేమ చంద్రన్ (ఆర్‌ఎస్‌పి), టి తిరుమవలవన్ (విసికె), రాజీవ్ రంజన్ లలన్ సింగ్ (జెడియు), అనిల్ ప్రసాద్ హెగ్డే (జెడియు), సందోష్ కుమార్ (సిపిఐ), ఎఎ రహీం (సిపిఐ(ఎం)), జావేద్ అలీ ఖాన్ (ఎస్‌పి), ఇటి మహమ్మద్ బషీర్ (ఐయుఎంఎల్), సుశీల్ గుప్తా (ఆప్), డి. రవి కుమార్ (విసికె), అరవింద్ సావంత్ (శివసేన- ఉన్నారు. కాగా, ఈ బృందం ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి తిరుగు పయనమైంది. ఇదిలా ఉండగా, మూడు నెలల నుంచి జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి చెందిన 21 మంది ఎంపిలుగల ప్రతినిధి బృందం శనివారం ఉదయం మణిపూర్ చేరుకుంది. మొదటి రోజు ఇంఫాల్‌లోని అనేక పునరావాస శిబిరాలను సందర్శించింది. తెగల మధ్య ఘర్షణల్లో బాధితులైన పలువురితో భేటీ అయింది. మే 3 నుంచి మెయితీ, కుకీ తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో సుమారు 160 మంది మరణించారు. దాదాపు 50 వేల మంది నిరాశ్రయులయ్యారు.
తెగల మధ్య ఘర్షణలకుసత్వరమే తెరదించాలి
RELATED ARTICLES