అది నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీరు
మేడిగడ్డ వద్ద అదనపు టిఎంసి ఖర్చు ఆదా
పాత డిమాండ్‌ను తెరపైకి తీసుకువస్తున్న కాంగ్రెస్
ఈ నెల 26న కాంగ్రెస్ నేతల తుమ్మిడిహెట్టి పర్యటన
హైదరాబాద్ : ప్రాణహిత నదిపైన తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలనే డిమాండ్‌ను కాంగ్రెస్ మరోసారి తెరపైకి తీసుకువస్తోం ది. అక్కడ బ్యారేజీ నిర్మించి గ్రావిటీ ద్వారా ఎల్లంపలి ప్రాజెక్టుకు కనీసం 120 టిఎంసి నీటిని తరలించ్చవచ్చని, తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అదనపు టిఎంసి కోసం ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చెబుతోంది. ఈ విషయాన్ని ప్రచారం చేయడంతో పాటు ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి చేయాలని, అందులో భాగంగా ఈనెల 26న (సోమవారం) కాంగ్రెస్ పార్టీ అతున్నత స్థాయి బృందం తుమ్మిడిహెట్టి పర్యటన చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంఎల్‌సి టి. జీవన్‌రెడ్డి నేతృత్వం వహిస్తుండగా, టిపిసిసి కార్య నిర్వాహక అధ్యక్షులు కుసుమ కుమార్ సమన్వయం చేస్తున్నారు. ఈవిషయమై శనివారం జీవన్ రెడ్డి తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజీకి సంబంధించి సమగ్ర వివరాలతో శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
పాత ప్రతిపాదనే
“గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత నది నీటితో తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేయాలని 2008లోనే ప్రణాళిక చేసింది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరుతో తెలంగాణలోని 7 జిల్లాలలో 16.4 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని, అలాగే హైదరాబాద్ జంట నగరాలకు, గ్రామాలకు తాగునీరు, పరిశ్రమలకు నీరు అందించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. కేంద్ర పరిశీలన సంస్థ వ్యాప్కోస్ ఇక్కడ నీటిని పరిశీలించి 152 మీటర్ల ఎత్తులో ప్రాణహిత నది పైన తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే 160 టిఎంసి నీటిని వినియోగించుకోవచ్చని పేర్కొంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం 38.5 వేల కోట్లతో ప్రాణహిత పేరుతో ఈ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేపట్టింద’ని జీవన్‌రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టులో తుమ్మిడిహెట్టి నుంచి మైలారం వరకు 70 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా నీటిని తరలించి అక్కడ నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేస్తే తక్కువ ఖర్చుతో ప్రాణహిత నీరు తరలించ వచ్చునని ఆయన తెలిపారు.
తక్కువ ఖర్చుతో అదనపు టిఎంసి
తుమ్మడిహెట్టి వద్ద నీరు తక్కువగా అందుబాటులో ఉందని, అందువల్ల మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టి అధికంగా నీటిని తరలిస్తున్నట్టు సిఎం కెసిఆర్ చెప్పారని జీవన్‌రెడ్డి తెలిపారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయినట్టు అదనంగా ఇంకో టిఎంసి నీటిని తరలించేందుకు ప్రస్తుతం పని చేస్తున్న అదే కాంట్రాక్టు సంస్థకు నామినేషన్ పద్ధతిపైన పనులు అప్పగించనున్నట్టు ఇటీవల కెసిఆర్ ప్రకటించారని తెలిపారు. ఇందుకు దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు అవుతాయని ఆయన పేర్కొన్నారని, ఇప్పటికైనా సిఎం కెసిఆర్ తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చెప్పినట్టు 148 మీటర్ల వద్ద బ్యారేజ్ కట్టినా 120 టిఎంసి నీటిని తరలించవచున్నని అన్నారు. ఇప్పటికే సుందిళ్ళ వద్ద బ్యారేజ్ పూర్తి చేయడం వల్ల తుమ్మిడిహెట్టి నుంచి మైలారం వరకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించి అక్కడ నుంచి జైపూర్ వాగు ద్వారా ప్రాణహిత నీటిని ఎలాంటి ఎత్తిపోతల పథకం లేకుండా సుందిళ్లకు తరలించవచున్నని, అక్కడ నుంచి ఎలాగూ లిఫ్ట్ ఏర్పాటు చేసి ఉంది కాబట్టి ఎల్లంపల్లి నీటి తరలింపు సులువుగా ఉంటుందని జీవన్ రెడ్డి వివరించారు. గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని తరలించకుండా కేవలం లిఫ్ట్ లకే ప్రాధాన్యత ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఏ విషయంపైన ప్రభుత్వంపైన వత్తిడి తెచ్చి తెలంగాణ రైతాంగానికి న్యాయం చేసేందుకు ఈ పోరాటం అని ఆయన అన్నారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీతో తెలంగాణకు మేలు
RELATED ARTICLES