వచ్చే ఏడాదిలో చంద్రయాన్- 3 : ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడి
న్యూఢిల్లీ : గగన్‌యాన్ డిజైన్ తుది దశలో ఉందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ కె. శివన్ అన్నారు. చంద్రయాన్- ప్రయోగం వచ్చే ఏడాది నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యుపిఇఎస్) విద్యార్థులు, ఫ్యాకల్టీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చంద్రయాన్- 2లో లోపాలను అర్థం చేసుకున్నామని, దిద్దుబాటు చర్యలు చేపట్టామని చెప్పారు. ఇస్రో భావి ప్రణాళికలను వివరిస్తూ, చంద్రయాన్ గగన్‌యాన్ ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్నట్టు చెప్పారు. రాబోయే దశాబ్దంలో అనేక ఆధునిక సాంకేతికతను, శాస్త్రపరమైన సామర్థ్యాలను సొంతం చేసుకోవడానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌కు 16 టన్నుల వరకు పెలోడ్స్‌ను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికిల్‌ను తయారు చేసే అంశం కూడా భవిష్యత్ ప్రణాళికలో ఉన్నట్టు శివన్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న జిఎస్ఎల్వి ఎంకె 3 లిఫ్ట్‌తో పోలి స్తే, నాలుగు రెట్లు ఎక్కువ సామర్థ్యం గల ఈ వెహికిల్‌ను తయారు చేయడమే ఇస్రో లక్ష్యమని పేర్కొన్నారు. వాయేజర్ తరహాలో పునర్ వినియోగానికి అవకాశమున్న వాహనాల తయారీ అంశం కూడా పరిశీలనలో ఉన్నట్టు ఆయన వివరించారు. చంద్రయాన్ సందర్భంగా తలెత్తిన లోపాలను గుర్తించామని అన్నారు. వాటిని పరిశీలించి, విశ్లేషించి, అర్థం చేసుకున్నామని శివన్ అన్నారు. కాబట్టి, తదుపరి చంద్రయాన్ కార్యక్రమాల్లో పొరపాట్లు చోటు చేసుకోకుండా ప్రణాళికలను సిద్ధం చేసుకునే వీలుందని తెలిపారు. లోపాలను సరిదిద్దుకొని, వచ్చే ఏడాది జూన్ నాటికి చంద్రయాన్ 3 ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతున్నదని అన్నారు. అదే విధంగా గగన్‌యాన్ డిజైన్‌పై కసరత్తు దాదాపుగా పూర్తయిందని, దీని డిజైన్ తుది దశకు చేరిందని శివన్ వివరించారు. ఈ ఏడాది చివరి నాటికి మానవ రహిత మిషన్ కోసం ఇస్రో కృషి చేస్తున్నదని, ఇప్పటి వరకూ ఈ తమ ద్వారా ఈ ప్రయోగం జరగలేదని పేర్కొన్నారు. భవిష్యత్ కార్యక్రమాల్లో భాగంగానే జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (జిటిఒ) పేలోడ్ కేపబిలిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం పెలోడ్ కెపాసిటీ 4 టన్నులుగా ఉండగా, దీనిని 5 టన్నులకు పెంచే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. రాకెట్ గ్రేడ్ కిరోసిన్, లిక్విడ్ ఆక్సిజన్లను సెమీ క్రయోజనిక్ ఇంజిన్లు మండిస్తాయని, ఇవి చాలా శక్తిమంతమైనవని శివన్ అన్నారు. ఇలాంటి సెమీ క్రయోజనిక్ ఇంజన్‌ను ఉపయోగించడం ద్వారా ఈ పెలోడ్ సామర్థ్యాన్ని పెంచుతామని ఆయన వివరించారు. అదే విధంగా, పర్యావరణానికి ఎలాంటి హాని లేని లిక్విడ్ ఆక్సిజన్ మిథేన్ వంటి ప్రొపెలెంట్స్పై పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు. మిథేన్ ఎలాంటి అవశేషాలు లేకుండా పూర్తిగా మండడం వల్ల పర్యావరణ కాలుష్యానికి తావులేదన్నారు. కిరోసిన్‌లో ఆ గుణం లేదని, కాబట్టి ఇకపై మిథేన్ వినియోగానికి ప్రాధాన్యం ఇస్తామని శివన్ తెలిపారు. అంతేగాక, ఇలాంటి ఇంజన్లను చాలా పర్యాయాలు వినియోగించే వీలు కూడా ఉంటుందన్నారు. అంతరిక్ష వాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన రంగాల్లో భారత్ ముందంజ వేస్తున్నదని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
తుది దశలో గగన్‌యాన్ డిజైన్
RELATED ARTICLES