HomeNewsBreaking Newsతిరోగమన విధానాలపై తిరుగుబాటు బావుటా

తిరోగమన విధానాలపై తిరుగుబాటు బావుటా

ఆదర్శంగా నిలుస్తున్న మహారాష్ట్ర గ్రామం ‘హెర్వాడ్‌’
ముంబయి : మహారాష్ట్ర కొల్హాపూర్‌ జిల్లాలోని ఓ గ్రామం హెర్వాడ్‌. అన్ని గ్రామాలుగానే సాదాసీదాగా ఉంటే మిగతా అన్ని ఊర్ల మాదిరిగానే అనామకంగా నిలిచిపోయేది. కానీ, హెర్వాడ్‌ పేరు యావత్‌ దేశంలో మారుమోగుతున్నది. ఇందుకు కారణం అక్కడ మహిళలకు దక్కుతున్న గౌరవం. మహిళలు, ప్రత్యేకించి వితంతువుల పట్ల తరతారుగా సమాజం అనుసరిస్తూ వస్తున్న తిరోగమన విధానాలపై ఈ గ్రామం తిరుగుబాటు చేసింది. మహిళలు గౌరవంగా జీవించే హక్కు కోసం వింతంతువుతో ముడిపడి ఉన్న అన్ని ఆచారాలను నిషేధిస్తూ ఈనెల 4వ తేదీన గ్రామ సభ తీర్మానాన్ని ఆమోదించింది. ఇప్పుడు ఇలాంటి చట్టం కోసం మహారాష్ట్ర సర్కారుపై ఒత్తిడి పెరుగుతున్నది. ఒక గ్రామం ఈ స్థాయిలో చైతన్యం తీసుకురావడం అనినందనీయం. ‘హెర్వాడ్‌ మోడల్‌’ పేరుతో అక్కడ తీరుకున్న నిర్ణయాలు బాగా ప్రచారమవుతున్నాయి. యావత్‌ దేశానికి దిశానిర్దేశనం చేస్తున్నాయి. శిరోల్‌ తాలూకాలోని హెర్వాడ్‌ గ్రామ పంచాయితీ తరతరాలుగా వస్తున్న ఆచారాలను తోసిపుచ్చింది. వితంతు మహిళ మంగళసూత్రం, కాలి మెట్టెలను తీసివేయడాన్ని, నుదటి మీద సింధూరాన్ని చెరిపివేయడాన్ని తృణీకరించింది. గాజులు పగలగొట్టడం వంటి అత్యంత దుర్మార్గమైన ఆచారాలను నిషేధిస్తూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆచారాల ప్రకారం వితంతువులు సామాజిక, మతపరమైన సమావేశాలు, కార్యక్రమాలకు హాజరుకాకూడదన్న ఆంక్షలను కూడా తోసిపుచ్చింది. ఈ మార్పు కోసం నిరంతరం కృషి చేసిన వారంతా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇలాంటి చట్టాలు తీసుకురావాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇది ఆహ్వానించతగ్గ పరిణామం. అనుసరణీయం కూడా. వింతువుల గౌరవాన్ని కాపాడడానికి, హక్కులను పరిరక్షించడానికి హెర్వాడ్‌ పడుతున్న తపనతోనైనా యావత్‌ దేశానికి కనువిప్పుకావాలి. మూఢ విశ్వాసాలతో మహిళలను బానిసలుగా చూసే సంస్కృతికి తెరపడాలి. సమతా వాది, సంస్కర్త మహాత్మా ఫూలే పేరుమీద ఏర్పాటైన ఓ స్వచ్ఛంద సంస్థ ఈ బృహత్‌కార్యాక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నది. ఆ సంస్థ కృషి ఫలితంగానే, దేశంలోనే వితంతువుల విషయంలో అనుసరిస్తున్న తిరోగమన విధానాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన తొలి గ్రామంగా హెర్వాడ్‌ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇలాంటి చట్ట ఆవసరాన్ని మహారాష్ట్ర శాసన మండలి డిపూటీ చైర్‌పర్సన్‌ నీలం గోర్హే కూడా గురించారు. జులై మాసంలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉభయ సభల్లోనూ ఈ అంశాన్ని లేవనెత్తడమేగాక, చర్చ జరుపుతామని ఆమె హామీ ఇస్తున్నారు. హెర్వాడ్‌ గ్రామ పంచాయితీ తరహాలో ఒక చట్టాన్ని తీసుకురావడం అనుకున్నంత సులభం కాకపోవచ్చు. కానీ, ఇప్పుడు పడిన మొదటి అడుగు రేపు అందుకోబోయే లక్ష్యాన్ని దగ్గర చేస్తుందనేది వాస్తవం. వితంతువుల పట్ల సమాజం అనుసరిస్తున్న దారుణ వైఖరిని కూకటివేళ్లతో పెకళించడానికి కొత్త చట్టం లేదా చట్టాలు అవసరమా? లేక ఉన్న చట్టాలను సవరించి, పకడ్బందిగా అమలు చేస్తే సరిపోతుందా? అనే అంశంపైన కూడా జోరుగా చర్చ జరుగుతున్నది. ప్రతిపాదిత చట్టం లేదా చట్టాలలో ఉండాల్సిన నిబంధనలపై కూడా ఫూలే స్వచ్ఛంద సంస్థకు ఒక స్పష్టమై అవగాహన ఉంది. వాటిలో కొన్నింటిని హెర్వాడ్‌ గ్రామం ఇప్పటికే ఆమోదించి, అమలు చేస్తున్నది. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫూలే సంఘం చేస్తున్న సిఫార్సులను అనుసరించి, భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళను వికృత ఆచారాలతో హింసించే ఇతర వితంతువులు, ఈ తతంగం జరగడాన్ని మౌనంగా చూసే బంధువులతోపాటు అంత్యక్రియలు, కర్మకాండల్లో పాల్గొనే గ్రామస్థులను కూడా నేరస్థులుగానే పరిగణించాలి. వితంతువులను ఉద్దేశించి, వారికి మాత్రమే అమలు చేస్తున్న తిరోమన చర్యలకు మద్దతనిస్తున్న మహిళలకు మూడు నెలల నుంచి ఏడాది జైలు శిక్షతోపాటు 5 వేల నుంచి లక్ష రూపాయల వరకూ, వారి పాత్ర తీవ్రతను బట్టి జరిమానా విధించాలి. బంధువులకు 15 రోజుల నుంచి నెల రోజుల జైలు, 5,000 నుంచి 50,000 రూపాయల జరిమానా విధించాలి. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సందర్భాల్లో, అంత్యక్రియలకు హాజరైన వారిని ఒక రోజుపాటు గృహం లేదా గ్రామం దాటి బయటకు వెళ్లకుండా నిరోధించాలి. కింది స్థాయిలో చట్టాన్ని ఉల్లంఘించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ యాతవ్‌ ప్రక్రియ పర్యవేక్షణకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. అందులో కనీసం 50 శాతం మంది మహిళలు ఉండేలా చూడాలి. అంతేగాక, ఆ మహిళల్లో 50 శాతం మంది వితంతువులే ఉండాలా జాగ్రత్త పడాలి. గ్రామ లేదా వార్డు పరిధిలో ఎవరైనా పురుషుడు మృతి చెందితే, అక్కడికి కమిటీ నుంచి కనీసం ఇద్దరు సభ్యులు వెళ్లాలి. భర్తను దూరం చేసుకున్న సదరు మహిళ పట్ల అవమానకరంగా ఎవరూ వ్యవహరించకుండా చూడాలి. అంత్యక్రియల ప్రక్రియను వీడియో తీసే శిక్షణను కమిటీ సభ్యులకు ఇప్పించాలి. సదరు వీడియోను, దానితోపాటు సాక్షులు సంతకం చేసిన ప్రభుత్వం నిర్దేశించిన పత్రాలను తహసీల్దార్‌, పోలీస్‌ అధికారి లేదా మహిళా శిశు సంరక్షణ అధికారికి అందచేయాలి. సామాజిక, మత లేదా మతపరమైన సాంస్కృతిక కార్యక్రమాలలో వితంతువులను గౌరవించని వ్యక్తులను కూడా 15 రోజుల జైలు శిక్షతో శిక్షించాలి. ఇలాంటి చర్యలు తీసుకుంటేనే వితంతువులకు అవమానకరమైన జీవన విధానాల నుంచి విముక్తి లభిస్తుంది. వారి హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుంది. గౌరవంగా జీవించడానికి రాజ్యాంగం కల్పించిన హక్కుకు సార్థకత ఏర్పడుతుంది. మొత్తానికి శతాబ్దాలుగా వితంతువుల పట్ల సమాజం అనుసరిస్తున్న తిరోగమన విధానాలకు తెరదించే ప్రయత్నంలో హెర్వాడ్‌ యావత్‌ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments