చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షల సాయం
తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల మెట్ల మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక మృతి చెందింది. బాలిక మృతి తీరు ప్రతీఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఇలాంటి మరణం ఏ చిన్నారికీ రాకూడదని ప్రజలు కోరుకున్నారు. అలిపిరి నడకదారిలో నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన లక్షిత అదృశ్యం కలకలం రేపింది. గత రాత్రి లక్షిత కుటుంబం నడక మార్గంలో తిరుమల కొండపైకి బయలు దేరింది. కాలినడకన తిరుమలకు వస్తున్న క్రమంలో రాత్రి 7:30 గంటల సమయంలో లక్షిత తప్పిపోయింది. 10 గంటల వరకూ పాప కోసం వెదికిన కుటుంబ సభ్యులు ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారి కోసం పోలీసులు గాలించగా.. ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చెట్ల పొదల్లో చిన్నారి మృతదేహం లభించింది. వెంటనే పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాపపై దాడి చేసింది చిరుత
చిరుత పులేనని పోస్టుమార్టంలో స్పష్టమైంది. ఎస్‌వి మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగం లక్షితను చంపేసింది చిరుతేనని తేల్చింది. రాత్రి చంపి శరీరంలోని భాగాలను చిరుత తిని వెళ్లిపోయిందని పోస్టుమార్టంలో తేలింది. ఆ తర్వాత రాత్రంతా ఉన్న శవాన్ని మరేదైనా జంతువు తిని ఉండొచ్చని ఫోరెన్సిక్ నిపుణులు భావిస్తున్నారు. పాప ప్రాణం పోవడానికి మాత్రం చిరుతే కారణమని స్పష్టం చేశారు. పోస్ట్ మార్టం పూర్తి కావడంతో పాపను తల్లిదండ్రులు స్వగ్రామం తీసుకెళ్లిపోయారు.
10 లక్షల ఎక్స్‌గ్రేషియా
తిరుమల నడక దారిలో శుక్రవారం రాత్రి చిరుత దాడికి గురై మరణించినట్టు భావిస్తున్న చిన్నారి లక్షిత కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. చిన్నారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. టిటిడి రూ.5లక్షలు, అటవీశాఖ రూ.5లక్షలు కలిపి మొత్తం రూ.10లక్షలు లక్షిత కుటుంబానికి అందజేస్తామన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులపై శనివారం సాయంత్రం అధికారులతో ఆయన మాట్లాడారు. లక్షిత మృతదేహం లభించిన ప్రాంతాన్ని అధికారులతో భూమన పరిశీలించారు. జూన్ 22న ఇలాంటి ఘటనే జరిగిన నేపథ్యంలో భక్తుల భద్రత విషయంపై టిటిడి ఇప్పటికే అనేక జాగ్రత్తలు తీసుకుందన్నారు. అటవీ, పోలీస్, టిటిడి అధికారులతో చర్చించి భద్రతా పరమైన ప్రతిపాదనలు చేస్తే టిటిడి ఖర్చుతో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
తిరుమలలో చిరుత దాడి..
RELATED ARTICLES