తిరుపతిలో కుండపోత
తమిళనాడు, ఎపి అప్రమత్తం
తెలంగాణకూ వర్ష సూచన
చెన్నై : బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. శుక్రవారం తెల్లవారుఝాము సమయంలో తమిళనాడు మధ్య వాయుగుండం తీరం దాటుతుంది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోని కోస్తా ప్రాంతాలను అధికారులు భారత వాతావరణ కేంద్రం (ఐఎండి) అప్రమత్తం చేశారు. వాయుగుండం ప్రభావంతో తిరుపతిలో కుండపోతగా వర్షం కురిసింది. దీనితో పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. అదే విధంగా చెన్నై, చుట్టుపక్కల జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండి ఒక ప్రకటనలో పేర్కొంది. భారీ వర్షాలతో తిరుమల దారిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. కనుమదారిలో రోడ్డుపైకి బండరాళ్లు దొర్లిపడడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు అప్రమత్తయ్యారు. రాళ్లను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలను రెండు రోజులపాటు మూసివేశారు. పాపవినాశానికి వెళ్లే దారిని మూశారు. వర్షాల వల్ల రేణిగుంట విమానాశ్రయంలో పలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో, విమానాశ్రయ అధికారులు కొన్ని విమానాలను హైదరాబాద్,బెంగళూరు నగరాలకు మళ్లిస్తున్నారు. తిరుపతిలోని పలు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. రైల్వే అండర్ బ్రిడ్జిలు మునిగిపోయాయి. భారీగా నీరు చేరడంతో, కరకంబాడి మార్గంలో రాకపోకలు స్తంభించాయి. వాయిగుండం కారణంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. చెన్నైకి 300 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఐఎండి తెలిపింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 8.30 గంటలకు నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఈ సందర్భంగా కురిసే అవకాశాలున్నాయని ఐఎండి పేర్కొంది. ఉత్తర తమిళనాడులో, దక్షిణ తమిళనాడు జిల్లాల్లో రాగల 24 గంటల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇదిలాఉండగా, దీనితో చెన్నై నగరంలో, పొరుగున కాంచీపురం, తిరువళ్ళూర్, చెంగల్పట్టు జిల్లాలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు గురువారం సెలవుదినంగా ప్రకటించారు. పురపాలక సంఘాలు ప్రత్యేక బృందాలతో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాయి. తిరునల్వేలి, పుదుక్కోట్టు లలో కకూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. పాండిచ్చేరిలో సాధారణ జనజీవనానికి గురువారం విఘాతం కలిగింది. స్కూళ్ళు, కాలేజీలు మూసివేశారు. ఇలావుంటే, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు ఐఎండి ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తిరుపతిలో కుండపోత
RELATED ARTICLES