HomeNewsAndhra pradeshతహసీల్దార్‌ సజీవ దహనం

తహసీల్దార్‌ సజీవ దహనం

పెట్రోల్‌ పోసి నిప్పంటించి దారుణ హత్యకు పాల్పడిన దుండగుడు
తీవ్ర గాయాలతో కార్యాలయంలోనే మృతి చెందిన విజయారెడ్డి
కాపాడే యత్నంలో మరో ఇద్దరు సిబ్బందికి గాయాలు
వీరిలో ఒకరి పరిస్థితి విషమం
భూ వివాదంలో ప్రత్యర్థులకు మ్యుటేషన్‌ చేసినందుకేనా..?
నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన రెవెన్యూ ఉద్యోగులు
హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన తహసీల్దార్‌ అక్కడికక్కడే మృతి చెందగా, తరువాత దుండగుడు కూడా తనకు తాను నిప్పంటించుకున్నాడు. తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. వీరి లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా యి. భోజన విరామ సమయంలో కార్యాలయం లో జనం తక్కువగా ఉన్నప్పుడు దుండగుడు తహసీల్దార్‌ ఛాంబర్‌లోకి వెళ్లి దాడికి పాల్పడ్డాడు. దుం డగుడుని హయత్‌నగర్‌ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్‌గా పోలీసులు గుర్తించారు. తహసీల్దార్‌ హత్యకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి.
మేడం ఫోన్‌ చేసి రమ్మన్నారు…
మధ్యాహ్నం 1.20 గంటలకు అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి ఒక సంచితో సురేష్‌ చేరుకున్నాడు. మొదటి అంతస్తులో ఉన్న ఆమె ఛాంబర్‌లోకి వెళ్తున్న సురేష్‌ను అటెండర్‌ అడ్డుకున్నాడు. “విజయా మేడం నాకు ఫోన్‌ చేశారు. భూ విషయంలో కలవాలని సూచించారు” అని నిందితుడు చెప్పారు. ఇది నమ్మిన అటెండర్‌ సురేష్‌ను తహసీల్దార్‌ కార్యాలయం ఛాంబర్‌లోకి పంపించాడు. అదును కోసం అక్కడే అరగంట పాటు వేచి ఉన్నాడు. అప్పటి వరకు తహసీల్దార్‌తో మాట్లాడిన అధికారి సునిత అక్కడి నుంచి వెళ్లిపోయారు. తహసీల్దార్‌ ఒక్కరే ఉండడంతో ఇదే మంచి అదునుగా భావించిన సురేష్‌ తన వెంట సంచిలో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై చల్లి లైటర్‌తో నిప్పంటించాడు. ఆ తరువాత తన పై తాను పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నా డు. కాలిన గాయాలతో సురేష్‌ తహసీల్దార్‌ ఛాంబర్‌లోంచి బయటికి పరుగు తీశాడు. ఈ విషయం గమనించిన తహసీల్దార్‌ డ్రైవర్‌ గుర్నాథం, అటెండర్‌లు తహసీల్దార్‌ను కాపాడేందుకు ఛాంబర్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే అప్పటికే యాధృచ్ఛికంగా ఛాంబర్‌ డోర్‌ లాక్‌ పడింది. డోర్‌ను బద్దలు కొట్టి లోపలికి వెళ్లి కాపాడేందుకు విఫలయత్నం చేశారు. అప్పటికే పూర్తిగా కాలిపోవడంతో తహసీల్దార్‌ అక్కడికక్కడే మృతి చెందా రు. కాపాడే క్రమంలో కాలిన గాయాలకు గురైన డ్రైవర్‌, అటెండర్‌లతో పాటు నిందితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి కలెక్టర్‌తో పాటు పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌, డిసిపి సన్‌ప్రీత్‌సింగ్‌లు చేరుకున్నారు. ఈ దాడి నేపథ్యంలో తోటి ఉద్యోగులు ఆందోళనకు బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడిని ఉరి తీయాలని తహసీల్దార్‌ కార్యాలయ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఏర్పడిన తర్వాత విజయారెడ్డి తొలి తహసీల్దార్‌గా నియమితులయ్యారు.
ప్రత్యర్థులకు మ్యుటేషన్‌ చేయడమే దాడికి కారణమా..?
అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తుర్కయంజాల్‌ గ్రామంలో సర్వేనెంబర్లు 90 నుండి 102లో 110 ఎకరాల భూమి ఉంది. ఇందులో 7 ఎకరాల భూమి సురేష్‌ కుటుంబ సభ్యులకు ఉంది. ఈ భూమిపై టెనెంట్‌ కేసుతో పాటు ప్రభుత్వ భూమి అని వివాదం ఉంది. ప్రస్తుతం ఈ భూమికి సంబంధించి హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. కాగా, ఈ ఏడెకరాల భూమిపై సురేష్‌ పెదనాన్న దుర్గయ్య స్టే తెచ్చుకున్నాడు. సురేష్‌ ప్రత్యర్థులకు తహసీల్దార్‌ విజయారెడ్డి మ్యుటేష్‌ చేసి వారికి పట్టాపాస్‌పుస్తకాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సురేష్‌ ఆవేశానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. అయితే సురేష్‌ నాలుగు నెలల నుంచి మతిస్థిమిత వ్యాధితో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. భూ విషయంలో తహసీల్దార్‌ వద్దకు ఏ రోజు కూడా వెళ్లని సురేష్‌ మొదటి సారిగా పోయి ఈ దారుణానికి ఒడిగట్టడం కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు.
ఎల్‌బినగర్‌లో విషాద ఛాయలు..
విజయారెడ్డి హత్యతో ఆమె నివాసం ఉంటున్న ఎల్‌బినగర్‌లో విషాదఛాయలు నెలకొన్నాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన విజయారెడ్డికి భర్త సుభాష్‌రెడ్డి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుభాష్‌రెడ్డి హయత్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. హత్య ఉదంతం తెలియగానే విజయారెడ్డి బంధువులు, స్నేహితులు ఎల్‌బినగర్‌లోని ఆమె ఇంటికి చేరుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
మ్యుటేషన్‌ వివాదమే దాడికి కారణం: సురేష్‌ పెదనాన్న
సురేష్‌ కుటుంబానికి జరగాల్సిన మ్యుటేషన్‌ వివాదమే తహసీల్దార్‌పై దాడికి కారణమని అతని నిందితుని పెదనాన్ని దుర్గయ్య తెలిపారు. భూ వివాదం ఇప్పటిది కాదని, ఆ వివాదంతో సురేష్‌కు అసలు సంబంధం లేదన్నారు. 90 నుంచి 102లో 110 ఎకరాల భూమి ఉంది. మొత్తం భూమి వివాదంపై కోర్టులో కేసు ఉంది. ఇందులో తమకు ఏడెకరాలు ఉందన్నారు. దానిపై తమకు స్టే వచ్చిందన్నారు. స్టే ఉన్నప్పటికీ తహసీల్దార్‌ తమ ప్రత్యర్థులకు మ్యుటేషన్‌ చేసిందన్నారు. ఈ విషయాలు సురేష్‌తో ఎప్పుడు చర్చించలేదన్నారు. సురేష్‌కు మతిస్థిమితం సరిగ్గా ఉండదన్నారు. ఇలాంటి పని చేస్తాడని అస్సలు ఊహించలేదన్నారు.
తండ్రితో కలిసి కట్టెలు కొట్టాడు.. అంతలోనే.. : తల్లి
ఉదయం 11 గంటల వరకు ఇంట్లోనే ఉన్నాడు. తండ్రి క్రిష్ణతో కలిసి ఉద యం కట్టెలు కొట్టాడు. మధ్యాహ్నం భోజనానికి రాకపోయేసరికి ఫోన్‌ చేసా ను. స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. కొద్ది సేపటికే తహసీల్దార్‌పై దాడి చేశాడని తెలిసింది.
నేడు రాష్ట్ర బంద్‌ పిలుపునిచ్చిన రెవెన్యూ సంఘాలు
తహసీల్దార్‌ విజయారెడ్డి దారుణ హత్యపై రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అన్ని జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెవెన్యూ అధికారులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని నేతలు పేర్కొన్నారు. ధరణి వెబ్‌సైట్‌ పనిచేయకపోవడం వల్లనే తమకు రైతులకు పనులు చేయలేక పోతున్నామన్నారు. విజయారెడ్డి హత్యకు నిరసనగా మంగళవారం రాష్ట్ర బంద్‌కు రెవెన్యూ సంఘాలు పిలుపు నిచ్చాయి. నిరసనలో భాగంగా మరో మూడు రోజులు విధులు బహిష్కరించాలని ఉద్యోగులు, అధికారులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ తప్పిదాల వల్లనే బాధితులు అధికారులపై దాడులకు పాల్పడుతున్నారని నేతలు పేర్కొన్నారు.
మంత్రి గంగులకు పరాభవం
తహసీల్దార్‌ హత్యకు నిరసనగా కరీంనగర్‌లో ఆందోళకు దిగిన రెవెన్యూ ఉద్యోగులకు మద్దతు ఇచ్చేందుకు మంత్రి గంగుల ప్రభాకర్‌ అక్కడికి చేరుకున్నారు. అతను రాగానే రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి, సిఎంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీన్ని జీర్ణించుకోలేని గంగుల రెవెన్యూ ఉద్యోగులతో కొద్ది సేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. రెవెన్యూ ఉద్యోగులు గంగులను నిలదీయడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయరు.
అధికారులకు ప్రభుత్వం సరైన రక్షణ కల్పించాలి: రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
విధుల్లో ఉన్న తహసీల్దార్‌ విజయపై పట్టపగలు ఓ వ్యక్తి సజీవ దహనం చేయడం సంచనం సృష్టించింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ ఎంపిలు రేవంత్‌రెడి,్డ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో స్పందించిన ఆయన, తహశీల్దార్‌ విజయారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తిం చేశారు. విధుల్లో ఉన్న అధికారులకు ప్రభుత్వం సరైన రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.
ఇది సబబు కాదు: మంత్రి సబితా
ఎంఆర్‌ఒ తీరు నచ్చకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప ప్రాణాలు తీసేంత దారుణాలకు ఒడిగట్టడం సబబు కాదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. దీని వెనుక ఏం జరిగిందన్న విషయం పూర్తిగా తెలుసుకోవాలని చెప్పారు.
కఠిన శిక్ష పడేలా చేస్తాం:డిజిపి
విజయారెడ్డి హత్య దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది అత్యంత దారుణం. నిందితుడికి శిక్ష పడేలా చార్జిషీట్‌ను తయారు చేస్తాం. నిందితుల వెనుక ఎవరిదైనా హస్తం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments