తల్లిని వేధించిన కొడుకు,కోడలుకు రెండేళ్లు జైలు
ప్రజాపక్షం/ హైదరాబాద్: తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తే ఇక జైలు శిక్ష పడడం ఖాయం. ప్రేమ కుమారి అనే 70 ఏళ్ల తల్లిని ఆస్తికోసం వేధించిన కొడుకు అమిత్, కోడలు లావణ్యలకు రెండు ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ మల్కాజ్‌గిరి కోర్టు సోమవారం సంచలన తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో కుమారుల వేధింపులకు గురైన తల్లిదండ్రులకు ఊరట లభించినట్లయింది. పిల్లలు ఎక్కువగా ఆస్తి కోసం తల్లిదండ్రులను ఇంట్లో వేధింపులకు గురిచేస్తుంటారు. మానసికంగా, శారీరకంగా నానారకాలుగా వేధిస్తుంటారు. అయితే వృద్ధాప్యంలో వారు బయటికి వచ్చి తమకు జరిగే అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకోలేక లోలోనే కుమిలిపోతుంటారు. బయటి వారికి చెబితే పరువుపోతుందనే భయం, మరోపక్క ఎంత వేధించిన తమ పిల్లలే కదా అని వారిపై ఉన్న మమకారం వారిని కేసు పెట్టకుండా చేస్తుంది. ఇదే పద్ధతిలో నేరేడ్‌మెట్‌కు చెందిన వృద్ధురాలు ప్రేమకుమారిని కొడుకు, కోడలు వేధించారు. అయితే ఆమె ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించి కొడుకు,కోడలుపై కేసు పెట్టింది. అంతటితో ఆగకుండా న్యాయం కోసం ఐదేళ్లు కోర్టు చుట్టూ తిరిగింది. ఆమె కోర్టుకు తిరుగుతున్న ఒపికను చూసి అక్కడి జడ్జి చల్లించిపోయి కొడుకు,కోడలుకు జైలు శిక్ష విధించారు. ఈ తీర్పు తల్లిదండ్రులను వేధిస్తున్న కొడుకులకు చెంపపెట్టుగా ఉంది. తల్లిదండ్రులను మానసికంగా, శారీరకంగా వేధిస్తే జైలు పాలు తప్పదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు బాధిత తల్లిదండ్రులకు కొంత ఊరటగా నిలిచింది. ఎవరైనా తమ కొడుకులు, కోడళ్లు వృద్ధ తల్లిదండ్రులను వేధిస్తే ఇక వారికి కూడా జైలు శిక్ష పడడం ఖాయమని ఈ తీర్పు రుజువు చేస్తుంది. ఈ తీర్పు ద్వారా బాధిత తల్లిదండ్రుల్లో ఒకరకమైన ధైర్యం నింపినట్లయింది. ఇక నుంచి తమ పిల్లలు వేధింపులకు పాల్పడితే వారిపై కేసులు పెడితే తమకు కోర్టులో న్యాయం జరుగుతున్నదన్న నమ్మకం వారిలో పెరిగింది. తద్వారా పిల్లలు తల్లిదండ్రులను వేధించే పద్ధతికి స్వస్తి పలుకుతారని పోలీసు అధికారులు అంటున్నారు. వేధింపులకు గురవుతున్న తల్లిదండ్రులు ధైర్యంగా బయటికి వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా పిల్లలో భయం ఉంటుందని, తద్వారా వేధింపులు ఉండవని అంటున్నారు. మల్కాజ్‌గిరి కోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధ బాధిత తల్లిదండ్రులకు కొండత బలం చేకూర్చినట్లయింది. ఎవరైనా వేధింపులకు పాల్పడితే పోలీసు కేసు పెడుతామని తల్లిదండ్రుల భయపెడితే చాలు వారి ఆగడాలకు పులిస్టాప్ పడుతుందని పలువురు అంటున్నారు. ఇలాంటి తీర్పుల వల్ల పిల్లల్లో మార్పు వస్తుందని భావిస్తున్నారు. వృద్ధ దంపతులకు ఎవరి ఆసరా లేకున్నా తామున్నామంటున్నారు పోలీసులు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కంటికి రెప్ప లా చూసుకోవాల్సిన కొడుకులు భార్యల మాటలు విని ఆస్తిని తమపేరుపై మార్చుకునేందుకు వేధింపులకు పాల్పడుతున్న ఉదంతాలు కూడా ఉన్నా యి. కొన్ని సందర్భాల్లో ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కాటికి కాలు చాపిన తల్లిదండ్రులకు కనీసం భోజనం పెట్టని కొంత మంది కొడుకులు వారి పేరుపై ఉన్న ఆస్తి కోసం వేధింపులకు పాల్పడుతుంటారు.