లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఖజానాకు రూ.6500 కోట్ల నష్టం
ఉద్యోగుల జీత భత్యాలు, ఆసరా పెన్షన్ల నిధులకూ సంకట స్థితి
వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రోత్సాహక మొత్తాలకూ చిక్కులే
ప్రజాపక్షం / హైదరాబాద్ : లాక్‌డౌన్ విధించి నెల రోజులు పూర్తయింది. ఈ 30 రోజుల్లో రాష్ట ఖజానాకు రాబడి లేకపోగా ఖర్చులు మాత్రం తగ్గడం లేదు. వ్యవసాయ రంగానికి ఇవ్వాల్సిన నిధులు, ఉద్యోగులు, పెన్షనర్లకు జీతభత్యాలు, వృద్ధులు, వితంతులకు ఇచ్చే ఆసరా పెన్షన్లు.. ఒక్కటేమిటి ఎన్నోన్నో ఆర్థిక పరమైన చిక్కులే. ఇప్పటికే బాండ్లను వేలానికి పెట్టిన ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి నాళ్లలోనే నాలుగు వేల కోట్ల అప్పులు తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా నెలకు ఖజానాకు రూ. 6500 కోట్ల మేరకు నష్టం వాటిల్లుతోంది. ఉద్యోగుల జీత భత్యాలు వంటివి సమకూర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత లేదనుకున్నా పది వేల కోట్లు అవసరం అవుతాయి. ఇందు లో ఉద్యోగులు జీతాలు, ప్రజా సంక్షేమంతో పాటు ప్రభుత్వ పరంగా ఖర్చులకూ డబ్బు అవసరమే. తెల్లరంగురేషన్ కార్డు దారులకు నెలకు ఇస్తానన్న రూ. 1500 ఆర్థిక సాయం తదితరాలు ఇందులో ఉంటాయి. కొవిడ్ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖకు భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తోంది. ఏప్రిల్ నెలలో కేంద్ర పన్నుల వాటా రూ. 1400 కోట్లు రావా ల్సి ఉండగా.. 982 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆదాయం 130 కోట్లు కూడా రాలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవ ల మీడియా సమావేశంలో వెల్లడించడం గమనార్హం. ఈ లాక్‌డౌన్ వల్ల ప్రభుత్వానికి రూ. 6500 కోట్ల వరకు ఆగి పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే పన్నులకు వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల ప్రధాని మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగానే కోరినట్లు వెల్లడించడం తెలిసిందే. ఎఫ్‌ఆర్‌బిఎంను వెంటనే పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే నాలుగు వేల కోట్ల అప్పులు ఉన్న నేపథ్యంలో కేంద్రానికి చెల్లించాల్సిన పన్నులకు సంబంధించిన డబ్బులు చెల్లించలేమని కూడా కోరినట్లు తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తాము ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో బాధపడుతున్నట్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. లాక్‌డౌన్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతోందన్నది స్పష్టత లేదు. అర్ధాకలితో ఉన్న ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని మోడీకి వివరించినట్లు తెలుస్తోంది. “అత్యవసర వైద్య సేవలకు నిధులు కేటాయించాలి. వారు వ్యయ ప్రయాసలు, రిస్క్ తీసుకుని పని చేస్తున్నందుకు వారికీ, అలాగే పారిశుద్ధ్య కార్మికులకు ప్రోత్సాహక మొత్తాలు ఇవ్వాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే కష్టంతో కూడుకున్న పని’ అని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం. బాండ్ల విక్రయం ద్వారా ఈ నెలలో ప్రభుత్వానికి నికరంగా వచ్చిన మొత్తం రూ. 4 వేల కోట్లే. ప్రభుత్వ ఖజానాకు ప్రతి నెలా భారీ ఆదాయం సమకూరేది ఎక్సైజ్, రెవెన్యూ, స్టాంపులు , రిజిస్ట్రేషన్ల శాఖ నుండే కాగా ఇప్పుడు ఆ మొత్తాలు రాని దుస్తితి నెలకొని ఉంది. మిగతా నిధులను ఎక్కడి నుండి సమకూర్చుకోవాలా? అన్న దానిపైనే ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది.