మిల్లర్లకు మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరిక
ప్రజాపక్షం/హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో ఎవరైనా మిల్లర్లు తరుగు తీస్తే మిల్లుల లైసెన్సులు నిర్మొహమాటంగా రద్దు చేయాలని వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను అదేశించారు. తూకం వేసిన తరువాత మళ్లీ తరుగు తీస్తే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై మంత్రుల నివాస సముదాయం నుండి టెలీకన్ఫారెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న అన్ని రైతువేదికలు, ఇతర గోదాములన్ని వినియోగించుకోవాలన్నారు. మిల్లర్లు అధికారులు చెప్పింది వినాలని, మిల్లర్లు చెప్పింది అధికారులు వినొద్దన్నారు. మిల్లర్ల విషయంలో ఎట్టి పరిస్థితులలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవద్దన్నారు. ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో జాప్యం జరగకుండా చూడాలన్నారు. దేశంలో ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కరోనా నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు కొనుగోళ్ల విషయంలో చేతులెత్తేశాయని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు మేలు చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా వస్తున్న దిగుబడిలో సగానికిపైగా ధాన్యం తెలంగాణ నుండి వస్తుందన్నారు. రవాణా సరఫరా కోసం కాంట్రాక్టు తీసుకున్న వాళ్లు దానికి తగినట్లు వాహనాలు ఏర్పాటు చేయాలని, లేకుంటే వారి వైఫల్యమే అవుతుందన్నారు. అందుబాటులో ఉన్న వాహనాలతో రవాణా చేసి, దాని బిల్లులు ఏజెన్సీల నుండి చెల్లించాలని అదేశించారు. ప్రతి పంటకూ రూ.7 వేల కోట్లపై చిలుకు రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా లాంటి పథకాలతో రైతులను వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంట అమ్ముకునే విషయంలో ఇబ్బందిపెట్టటం మంచిపద్దతి కాదన్నారు. ఈ సమావేశంలో జెడ్‌పి చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ , జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి , పౌరసరఫరాలు శాఖ డిఎఓ, డిసిఓ, ఇతర జిల్లా ఉన్నతాధికారులు, ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, పిఎసిఎస్ అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, మిల్లర్లు, ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
తరుగు తీస్తే లైసెన్సులు రద్దు
RELATED ARTICLES