HomeNewsBreaking Newsతయారీ రంగంలో ప్రపంచానికిజపాన్‌ ఆదర్శం

తయారీ రంగంలో ప్రపంచానికిజపాన్‌ ఆదర్శం

రాష్ట్ర ఐటిశాఖమంత్రి కెటి రామారావు
రూ.500 కోట్లతో నూతన పరిశ్రమలకు శంకుస్థాపన

ప్రజాపక్షం/షాబాద్‌ తయారీ రంగంలో ప్రపంచానికి జపాన్‌ ఆదర్శమని రాష్ట్ర ఐటిశాఖమంత్రి కెటి రామారావు అన్నారు. ఆ దేశానికి వెళ్లిన ప్రతిసారీ కొత్త అంశాలను నేర్చుకుంటామని చెప్పారు. అక్కడ వనరులు తక్కువగా ఉంటాయని, అయినప్పటికీ కొద్దిపాటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలోని చందన్‌వల్లి ఇండస్ట్రియల్‌ పార్కులో జపాన్‌కు చెందిన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్‌ యూనిట్‌కు, నికోమాక్‌ తైకిషా క్లీన్‌ రూమ్స్‌ కంపెనీల ఏర్పాటుకు మంత్రి కెటిఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అణుబాంబు దాడిని ఎదుర్కొని కూడా తిరిగి లేచి నిలిచి జపాన్‌ సత్తా చాటిందన్నారు. మన దేశంలో ప్రతి ఇంట్లో ఆ దేశానికి చెందిన వస్తువు ఏదో ఒకటి ఉంటుందని చెప్పారు. భవిష్యత్‌లో ఆ దేశానికి చెందిన మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి వస్తాయని ఆశిస్తున్నామన్నారు. డైఫుకు కంపెనీ దేశంలో అగ్రగామిగా నిలుస్తుందని భావిస్తున్నానని చెప్పారు. షాబాద్‌ మండలంలోని చందన్‌పల్లిలో సంస్థ రూ.575 కోట్లు పెట్టుబడి పెడుతున్నదని, మూడు నెలల్లోనే పరిశ్రమ ప్రారంభం కానుందని వెల్లడించారు. చందన్‌వల్లికి వెల్‌స్పన్‌, మైక్రోసాఫ్ట్‌ సహా అనేక సంస్థలు వస్తున్నాయన్నారు.
షాబాద్‌ మండలంలోని సీతారాంపూర్‌, మాచన్‌పల్లి, హైతాబాద్‌ , చందనవెళ్లి పారిశ్రామిక వాడగా అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందజేస్తామన్నారు. స్థానిక యువతి, యువకులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించి ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, భూములు కోల్పోయిన వారికి ఇంటికో ఉద్యోగం, ప్లాట్‌ ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌కు వినతి పత్రం అందజేశారు. దీంతో సానుకులంగా స్పందించిన కేటీఆర్‌ రైతులకు న్యాయం జరిగేవిధంగా చూస్తామని హమీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపి రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నం, జిల్లా చైర్‌పర్సన్‌ తీగల అనితా రెడ్డి, సీనియర్‌ నాయకులు పట్లోళ్ల కార్తీక్‌ రెడ్డి, షాబాద్‌ జడ్పిటిసి పట్నం అవినాష్‌ రెడ్డి, చందనవెల్లి సర్పంచ్‌ ప్రభాకర్‌ రెడ్డి, విదేశాలకు చెందిన వ్యాపార వేత్తలు తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments