చెన్నై: తమిళనాడులో అధికార ఎఐడిఎంకెపై ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) ఆధిపత్యాన్ని కనబరచి, అధికారంలోకి వచ్చింది. పది సంవత్సరాలు విపక్షంలో ఉన్న డిఎంకెను ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ విజయపథంలో నడిపించా రు. 234 సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి అవసరమైన 117 సంఖ్యను డిఎంకె సులభంగానే అధిగమించింది. ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలో మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఎఐఎడిఎంకె కొంత వరకూ పోటీనిచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ పార్టీతో జత కట్టడం ద్వారా తమిళనాడులో పాగా వేయాలనుకున్న బిజెపి పూర్తిగా విఫలమైంది. మొత్తం మీద స్టాలిన్ కారణంగా డిఎంకె హవా కొనసాగింది. ఆయన ఒంటిచేత్తో పార్టీని విజయాన్ని సాధించిపెట్టాడనే అనుకోవాలి. తదుపరి ముఖ్యమంత్రిగా స్టాలిన్ కొలువుదీరడం ఖాయమైన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద సందడి నెలకొంది. స్టాలిన్ సోదరి కనిమొళి సహా పార్టీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రులు, తమిళనాడు ముఖచిత్రంగా మారి పాలనపై తమదైన ముద్ర వేసిన కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలు లేకుండానే జరిగిన అసెంబ్లీ పోరు సహజంగానే అందరి దృష్టినీ ఆకర్షించింది. తండ్రి మరణం తర్వాత పూర్తిస్థాయిలో డిఎంకే పగ్గాలు చేపట్టిన స్టాలిన్ అధికార అన్నాడిఎంకె, బిజెపి కూటమిని ఎలా ఢీకొడతారన్న అంశం ప్రజల్లో ఆసక్తిని పెంచింది. అయితే, స్టాలిన్ అందరూ ఊహించిన దాని కంటే ఎక్కువగా ప్రజల మద్దతును పొందగలిగారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి తమ మేనిఫెస్టోలో ప్రాధాన్యం కల్పించి ఓటర్లను ఆకట్టుకున్నారు. నూతన వ్యవసాయ చట్టాలు, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్పిసి, నీట్ వివాదం, కరోనా వ్యాప్తి వంటి అంశాలను లేవనెత్తుతూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, బిజెపితో కూటమిగా ఏర్పడిన అన్నాడిఎంకె విధానాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రజలకు చేరువయ్యారు. అన్నాడిఎంకె కూడా భారీగానే హామీలు గుప్పించినప్పటికీ, అంతర్గత పోరు కారణంగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. డిఎంకెకు అధికార పగ్గాలను అప్పగించి నిష్క్రమించింది. కాగా, డిఎంకె విజయాన్ని స్టాలిన్ విజయంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తమిళనాడులో డిఎంకె హవా
RELATED ARTICLES