ప్రతిరోజూ మీడియాలో ప్రసారం చేయాలి
కరోనా వ్యాప్తిపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నిర్ధారణ పరీక్షలు తక్కువగా ఎందుకు ఉన్నాయని ప్రశ్న
ప్రజాపక్షం / హైదరాబాద్ తెలంగాణలో కరోనా పరీక్షలు, బాధితులకు అందిస్తున్న ఏర్పాట్లపై హైకోర్టులో మంగళవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. వీడియో కాన్ఫరెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సిఎస్ నుంచి హైకోర్టు పలు వివరాలను అడిగి తెలుసుకుంది. విచారణ సందర్భంగా ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చిం ది. కరోనాపై జారీ చేసే హెల్త్ బులెటిన్‌ను తప్పులు లేకుండా ప్రతి రోజూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఐసిఎంఆర్, ప్రపంచ ఆరో గ్య సంస్థ జారీచేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని తెలిపింది. తెలుగులో కూడా బులెటిన్ ఉండాలని పేర్కొంది. పేద వాళ్ళ కోసం ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ సెంటర్స్, వెల్ఫేర్ అసోసియేషన్ సెంటర్స్‌ను వాడుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. కమ్యూనిటీ హాళ్ల ను ఐసోలేషన్ కేంద్రాలు గా మారిస్తే పేదలకు సత్వరమే మేలు జరుగుతుందని సూచన చేసింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య తక్కువగా ఎందుకు ఉందని ప్రశ్నించింది. ప్రైమరీ కాంటాక్ట్‌లకు ఎన్ని పరీక్షలు చేశారని ప్రశ్నించింది. గాంధీలో కరోనా పరీక్షలు ఎందు కు చేయడం లేదని అడిగింది. గాంధీ వంటి ప్రతిష్టాత్మక ఆస్పత్రిని టెస్ట్‌లు చేసేందుకు కూడా వినియోగించుకుంటే బాధితులకు మేలు జరుగుతుందని చెప్పింది. హైకోర్టు ఆదేశాలన్నీ అమలు చేయడానికి ప్రభుత్వానికి ఎన్ని రోజుల సమయం కావాలని అడిగింది. కరోనా వైద్య సేవలపై దాఖలైన సుమారు 15 పిల్స్‌ను మంగళవారం చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌బెంచ్ విచారించింది. కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చేరే ప్రక్రియను సులభతరం చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) సోమేశ్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. మరో 4 లక్షల రాపిడ్ యాంటీజెన్ కిట్లకు ఆర్డర్ ఇచ్చామన్నారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేసేందుకు రెండు వారాలు గడువు కావాలని సిఎస్ కోరారు. రాష్ట్రంలో తగినన్ని కరోనా పరీక్షలు జరుగుతున్నాయని, క్రమంగా పరీక్షల సంఖ్య పెంచుతున్నామని చెప్పారు. హైకోర్టు ఆదేశాలను అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తామని చెప్పారు. రోజూ ప్రకటించే హెల్త్‌బులెటిన్‌ను హైకోర్టు సూచనలకు అనుగుణంగా మరిన్ని వివరాలు ఉండేలా చేస్తామన్నారు.అధికారుల పరిస్థితిని హైకోర్టు కూడా అర్థం చేసుకోవాలని సిఎస్ అభ్యర్థించారు. కొందరు ఐఎఎస్ అధికారులు కూడా కరోనా బారిన పడ్డారని, అయితే ప్రజల్లో భయం పెరుగుతుందని వాళ్లు వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఉద్యోగ ప్రకటన వెల్లడించినా చాలా మంది చేరేందుకు ముందుకు రావడం లేదని, పాలనలో సిబ్బంది, అధికారుల సమస్యలను కూడా హైకోర్టు చూడాలని, ఉన్నంతలో హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేస్తూనే ఉన్నామని, కావాలని ఏ ఉత్తర్వుల్ని అమలు చేయకుండా లేమని, రెండు వారాల సమయం ఇస్తే వీలైనంతగా హైకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని సిఎస్ చెప్పారు. కరోనా బాధితులు పెరుగుతున్న దృష్ట్యా పది హోటళ్లలో 857 గదులను ఐసోలేషన్ సెంటర్లుగా ఏర్పాటు చేశామని సిఎస్ తెలిపారు. కరోనా బారిన పడిన 248 మంది ప్రస్తుతం ఆ హోటల్ గదుల్లో ఉన్నారని చెప్పారు. కరోనా బాధితులను ఆస్పత్రుల్లో చేర్చుకునే పద్ధతిని మరింత సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షల రాపిడ్ కిట్లు వాడకంలో ఉన్నాయని, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మరో 4 లక్షల కిట్లు ఆర్డర్ చేశామన్నారు. ఎంఆర్‌ఐ, సిటి స్కాన్‌లపై ప్రైవేట్ హాస్పిటల్‌లో చార్జీల విషయంపై ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నామని, ఇప్పటి వరకు ప్రైవేట్ ఆస్పత్రులపై 726 ఫిర్యాదులు వచ్చాయని, ఈ ఫిర్యాదులపై తీసుకున్న చర్యల గురించి వచ్చే విచారణ సమయంలో చెబుతామని సిఎస్ హామీ ఇచ్చారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణ కోరామన్నారు. ప్రతి రోజు కరోనాపై పూర్తి సమాచారాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు తప్పనిసరిగా అందిస్తామని, పూర్తి వివరాలు బులెటిన్‌లో ఉండేలా చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి హాస్పిటల్ వద్ద బెడ్స్ ఖాళీల సమాచారాన్ని తెలియజేసే డిస్‌ప్టే బోర్డ్లను ఏర్పాటు చేయాలన్న హైకోర్టు సూచనను అమలుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కువగా 21 ఏళ్ల వయస్సు గల వారే కరోనా బారిన పడుతున్నారని, దీని గురించి ఎక్కువ ప్రచారం చేయాలన్న హైకోర్టు సూచనను కచ్చితంగా అమలు చేస్తామని సిఎస్ హామీ ఇచ్చారు. రాపిడ్‌కిట్ల వాడకం వల్ల ఉపయోగం ఎంతవరకు ఉంటుందో మరోసారి నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. వచ్చే విచారణకు సిఎస్ సహా ఇతర అధికారులు కూడా హాజరుకావాలని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. కమ్యూనిటీ హాల్స్‌ను ఐసోలేషన్ కేంద్రాలుగా చేస్తే పేదలకు ఉపయోగకరంగా ఉంటుందని న్యాయవాది వసుధా నాగరాజ్ చేసిన వినతిని అమలు చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తమ ఉత్తర్వులు అమలు చేసి నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఐఎఎస్ అధికారుల నుంచి అటెండర్ స్థాయి వరకూ అందరూ శ్రమిస్తున్నారని, కొందరు ఐఎఎస్‌లు కరోనా బారిన పడినా ప్రజల్లో భయాందోళలు పెరుగుతాయనే వాటిని బయటపెట్టడం లేదన్నారు. కరోనా క్లిష్ట సమయంలో మా పరిస్థితులను కూడా హైకోర్టు అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు పనిచేయడం లేదనే ప్రచారం వల్ల సిబ్బందిలో నైతిక స్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. హైకోర్టు ఆదేశాలకు అత్యంతర ప్రాధాన్యత ఇస్తున్నామని, సాంకేతిక సమస్యల వల్ల కొన్నింటిని అమలు చేయలేకపోయామని వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3.80 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. 4 లక్షల ర్యాపిడ్ కిట్ల కోసం ఆర్డర్ ఇచ్చామన్నారు. వీటి పనితీరుపై అనుమానాలు ఉన్నందున కొనసాగింపుపై నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. రాజస్తాన్‌లో ర్యాపిడ్ టెస్ట్‌లు నిర్వహించడాన్ని ఆపేసిందని గుర్తు చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి ప్రాంతాల్లో ఆక్సిజన్ పడకలు తక్కువగా ఉన్నాయని చెప్పగా, పడకలన్నింటికీ ఆక్సిజన్ సౌకర్యం ఉండేలా ప్రభుత్వం చేస్తుందని సిఎస్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 1165 ఐసోలేషన్, 18 వేల క్వారంటైన్ పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇంట్లో చికిత్స పొందుతున్న వారికి హితం మొబైల్ యాప్‌ను రూపకల్పన చేశామన్నారు.
తప్పుల్లేకుండా హెల్త్ బులెటిన్
RELATED ARTICLES