తప్పు మాది కాదంటూ తప్పుకుంటున్న అధికారులు
కోర్టు ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌లో అన్ని వివరాలు
పంచాయతీ కార్యదర్శుల నియామకాల్లో నష్టపోయిన అభ్యర్థులు, కోర్టుపైనే ఆశలు
ప్రజాపక్షం / హైదరాబాద్ : పరీక్షలు రాశారు… కానీ వారి ఫలితాలు రాలేదు. జవాబులు కరెక్టె, మార్కులు మాత్రం నిల్. అభ్యర్థి మహిళ, ఆమెకు వచ్చిన మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చిన మరో మహిళకు ఉద్యోగం దక్కింది, ఇదేంటని ఆరా తీస్తే… మహిళను కాస్తా పురుషుడిగా పేర్కొంటూ ఎంపిక చేయలేదు. ఒ ఎంఆర్ షీట్ ఉంది, దానిలో బబుల్ చేసిన సమాధానాలు కనిపిస్తున్నాయి, మార్కుల జాబితాలో మార్కులు లేవు… ఇలా ఒకటి కాదు, రెండు కాదు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియమకాల్లో లెక్కకు మించిన తప్పులు జరిగాయి, తర్వాతేంటి అంటే మాత్రం తప్పు మాది కాదంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. ఇప్పుడేం చేయ లేం, ఇప్పుడు ఇచ్చిన పోస్టింగ్‌లతోనే సరిపెట్టుకోవాలి, మరో మార్గం లేదన్న సమాధానం అధికారుల నుంచి వినిపిస్తోంది. కోర్టు మాత్రం మెరిట్ లిస్ట్, కటాఫ్ మార్కులు ఇతరాత్ర నియామకపు ప్రక్రియలో పాటించాల్సిన మేరకు అన్నింటిని ఆన్‌లైన్‌లో పెట్టాలని ఆదేశించింది. అధికారులు కూడా రెండు రోజులుగా అదే పనిలో ఉన్నారు. కటాఫ్ మార్కులు, పోస్టులకు ఎంపికైన వారివే కాకుండా పరీక్షలకు హాజరైన వారందరి మార్కుల జాబితా, ఒఎంఆర్ షీట్లు, పాటించిన రిజర్వేషన్ విధానం, రోస్టర్ క్రమం ఇలా అన్నింటిని పంచాయతీరాజ్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నియామకపు పర్వంలో జరిగిన తప్పులన్నీ పుంకానుపంకాలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇవి తప్పులు అని ఒప్పుకుంటేనే ఇవి మావల్ల జరిగినవి కాదని అధికారులు కొట్టిపారేస్తున్నారు. మహిళ కేటగిరి అభ్యర్థిని పురుషుడి కేటగిరిలో చూపిస్తే ఆమె అభ్యంతరం చెప్పుకోకపోవడం సదరు అభ్యర్థి చేసిన పొరపాటుగానే పరిగణిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇలా బిసి, ఎస్‌సి, ఎస్‌టి కేటగిరీలకు చెందిన చాలా మంది అభ్యర్థులవి కూడా వారి కేటగిరీలు తారుమారై పోస్టింగ్‌లకు అర్హత పొందేంత మార్కులు వచ్చినప్పటికి నష్టపోయారు. నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చిన అనంతరం దరఖాస్తులు చేసుకున్న తర్వాత వారి దరఖాస్థు ఫారాలను ఆన్‌లైన్‌లో ఉంచామని అధికారులు అంటున్నారు.