కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు డిఎ నిలుపుదల ఏకపక్షం
తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించాలి: అమర్‌జిత్ కౌర్
ప్రజాపక్షం/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన కరవు భత్యం, పెన్షనర్‌లకు డిపిని నిలుపుదల చేస్తూ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాన్ని ప్రకటించడాన్ని ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ తీవ్రంగా ఆక్షేపించారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్‌ల పోరాటానికి ఎఐటియుసి సంపూర్ణ మద్దతినిస్తుందని ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఆర్థిక వ్యవస్థను సవ్యంగా నిర్వహించడంలో కేంద్రం తప్పుడు విధానాల ఫలితాలను శ్రామిక వర్గంపై నెట్టేయడాన్ని తప్పుబట్టారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని సాకుగా చూపించి ప్రభుత్వం తీసుకుంటున్న ఏదో ఒక నిర్ణయం ఫలితంగా లాక్‌డౌన్ కోరల్లో చిక్కుకొని ఇప్పటికే విలవిలలాడుతున్న ప్రజలపైమరింత భారంపడుతోందన్నారు. కేంద్ర కార్మిక సంఘానికి ఎఐటియుసి తరుపున ఎన్ని విజ్ఞప్తులు చేసినా నిష్ప్రయోనంగా మారిందన్నారు. తాజాగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్‌లకు డిఎను నిలిపివేస్తే జారీ చేసిన ఉత్తర్వుల ఫలితంగా మిలటరీలో పని చేసే వారితో సహా 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్‌లపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. డిఎ అనేది ప్రభుత్వం ఇచ్చే బహుమతి కాదని, పెరిగే జీవనవ్యయానికి అనుగుణంగా ద్రవ్యోల్బణం ఆధారంగా దీనిని నిర్దారిస్తారని అన్నారు. డిఎను నిలిపివేసే నైతిక అధికారం ప్రభుత్వానికి లేదని, 18 నెలల పాటు డిఎ చెల్లించకపోవడం ద్వారా ప్రభుత్వానికి మిగిలే రూ.50వేల కోట్లు ఎవరికి వెళ్తాయి? కార్పొరేట్ సంస్థలకా లేదా బాధల్లో ఉన్న కార్మికులకా? అని అమర్‌జిత్ కౌర్ నిలదీశారు.