ప్రజాపక్షం/హైదరాబాద్: ఆర్టిసి కేసులో హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదుల చేత సిఎం కెసిఆర్ అబద్ధాలు, తప్పుడు లెక్కలు చెప్పించడం సిగ్గుచేటని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సమ్మె విషయంలో ప్రభుత్వం మొండివైఖరిని కొనసాగిస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పినట్లుగా ఫిలిప్పీన్స్ తరహా ప్రజా ఉద్యమం వచ్చే అవకాశం ఉంటుందని, దానిని ఎవ్వరూ ఆపలేరన్నారు. అలా జరిగితే శాంతి భద్రతల సమస్య తలెత్తి, కేంద్ర ప్రభుత్వ జోక్యానికి కెసిఆరే తావిచ్చినట్లవుతుందని హెచ్చరించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే పార్టీలో చర్చించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రైవేటు బస్సులను తిరగనీయబోమని చెప్పారు. మఖ్ధూం భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, కార్యవర్గ సభ్యులు డాక్టర్ డి.సుధాకర్, ఇ.టి.నర్సింహతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టిసి సమ్మెకు మద్దతుగా, సిఎం నియతంతృత్వ వైఖరికి నిరసనగా తాను చేపట్టిన ఆరు రోజుల దీక్షకు మద్దతిచ్చిన వారందరికీ కూనంనేని ధన్యవాదాలు తెలియజేశారు. అఖిలపక్ష నేతలు, ఆర్టిసి జెఎసి నేతల సూచనతోనే న్యాయస్థానంపై నమ్మకం ఉంచి తాను దీక్షను విరమించుకున్నానని తెలిపారు. అయితే కేసు నవంబర్ 7వ తేదీకి వాయిదా పడిందని, కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రతి వాయిదాకు ఒక కొత్త లిటిగేషన్ తెరపైకి తెస్తూ కేసును ఆలస్యం చేసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇప్పటికే సమ్మె 28 రోజులకు చేరుకున్నదని, సెప్టెంబర్ నెల జీతం ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. సిఎం కెసిఆర్ కేసు తామే గెలవాలని, కార్మికులు ఓడిపోవాలని భావిస్తూ, అందుకు అనుగుణంగా అధికారులకు తర్ఫీదునిస్తున్నారని చెప్పారు. అవాస్తవాలు, అబద్ధాలు చెప్పిస్తున్నప్పటికీ కోర్టు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తోందన్నారు. ఆర్టిసికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించలేమని జిహెచ్ఎంసితో చెప్పించడం సిగ్గు చేటు అన్నారు. జిహెచ్ఎంసి లేదా ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకుండా ప్రైవేటు యాజమాన్యాలు బస్సులు నడపడం సాధ్యమవుతుందా? అని నిలదీశారు. ఆర్టిసిని పిచ్చికుక్కలా ముద్రవేసి చంపేసేందుకు కుట్ర చేస్తున్నారని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం, విద్య, ఆర్టిసి ప్రజలకు సేవ చేసే రంగాలని, వాటిపై లాభాలను ఎలా ఆశిస్తారన్నారు. ప్రైవేటు రంగంలో ఆసుపత్రులు, పాఠశాలలు ఉన్నా ఫీజులు తగ్గాయా? పెరిగాయా? అని ప్రశ్నించారు.
తప్పుడు లెక్కలు చెప్పించడం సిగ్గుచేటు
RELATED ARTICLES