ఐఎఎస్‌లే మోసం చేస్తారని ఊహించలేదు
మంత్రిని మోసం చేశారు… కోర్టునూ మోసం చేస్తారా?
ప్రభుత్వ నివేదికపై హైకోర్టు ఆగ్రహం
తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక
ప్రజాపక్షం/హైదరాబాద్: కోర్టులను మోసం చేయాలని అనుకుంటున్నారా? లేక శాసనసభలోనే మంత్రిని మోసం చేయాలని అనుకుంటున్నారా? ఆర్‌టిసికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాకాయిలు లేవని హైకోర్టులోనూ, భారీగా బకాయిలు ఉన్నాయని రవాణామంత్రికి పరస్పర విరుద్ధంగా ఆర్‌టిసి అధికారులు ఎలా నివేదికలు ఇస్తారని ఆర్‌టిసి ఎండి (ఇన్‌చార్జి), సీనియర్ ఐఎఎస్ అధికారి సునీల్ శర్మను హైకోర్టు ప్రశ్నించింది. మంత్రిని మోసం చేస్తున్నారా, హైకోర్టును మోసం చేస్తున్నారా.. అసలు మీ ఉద్దేశం ఏమిటో చెప్పండింటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్‌టిసి సర్కార్ నుంచి బకాయిలు చెల్లింపులు జరిగితే ఇబ్బందులు ఉండవని, రూ.1492 కోట్ల మేరకు సర్కార్ బకాయిలు ఇవ్వాలని ట్రాన్స్‌పోర్టు మినిష్టర్ అసెంబ్లీలో చెప్పారని, ఆ వివరాల్ని ఆర్‌టిసి అధికారులే లిఖితపూర్వంగా మంత్రికి ఇచ్చారని ఆర్‌టిసి యూనియన్ తరఫు సీనియర్ లాయర్ డి.ప్రకాష్‌రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో హైకోర్టు ఆర్‌టిసి ఇన్‌చార్జి ఎంపి సునీల్‌శర్మపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అంతర్గత సమావేశం నిమిత్తం మంత్రికి అలా చెప్పామని, వాస్తవానికి సర్కార్ నుంచి ఆర్‌టిసికి ఏమీ బకాయిలు లేవని శర్మ చెప్పడంతో హైకోర్టు విస్మయాన్ని వెలిబుచ్చింది. ఆర్‌టిసి సమ్మె చట్ట విరుద్ధమని వెల్లడించాలని కోరుతూ ఒయు రీసెర్చ్ స్కాలర్ దాఖలు చేసిన పిల్‌ను చీఫ్ జడ్జి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డిల డివిజన్ బెంచ్ శుక్రవారం రెండు గంటలపాటు కిటకిటలాడిన కోర్టు హాలులో విచారణ జరిపింది. డివిజిన్ బెంచ్ ఆదేశాలకు అనుగుణంగా శర్మ కోర్టు వచ్చి స్వయంగా న్యాయమూర్తులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. హైకోర్టు అంటే తమాషా కాదని, అఫిడవిట్‌లో నిజాలే చెబుతామని ప్రమాణం చేసి తమ ముందే మంత్రికి తప్పుడు సమాచారం ఇచ్చామని చెప్పడానికి ఎంత ధైర్యమని ప్రశ్నించింది. కోర్టుల్లో తమ ఇష్టానుసారంగా చేస్తే తీవ్రంగా పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అసెంబ్లీలో బకాయిలు ఉన్నాయని చెప్పిన మంత్రిని మోసం చేసినట్లా లేక హైకోర్టునే మోసం చేస్తున్నారా అని నిలదీసింది. ఐఎఎస్‌లపై ఎంతో నమ్మకంతో ఉన్నామని, వాస్తవాలు చెబుతారని ఆశించామని, తీరా అధికారలు వేసిన కౌంటర్ పిటిషన్లు చూస్తే విశ్వసనీయత దెబ్బతినేలా వివరాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ముక్కల్ని పేర్చితే బొమ్మ అయ్యేలా అంతా పజిల్‌లా కౌంటర్లు ఉన్నాయని, గందరగోళానికి చిరునామాగా ఉన్నాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఐఎఎస్‌లు మోస పూరితంగా కౌంటర్ వేస్తారని అనుకోలేదని, కావాలని ఉద్దేశపూర్వకంగా మంత్రికి ఒకలా, హైకోర్టుకు మరోలా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మీకు తెలుసునని సునీల్ శర్మను ఉద్దేశించి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.