HomeNewsBreaking Newsతప్పుడు భాష్యం వల్ల తీవ్ర పరిణామాలు

తప్పుడు భాష్యం వల్ల తీవ్ర పరిణామాలు

వారణాసి కోర్టు తీర్పు 1991 చట్టాన్ని ఉల్లంఘించినట్టే
వామపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ :
జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును వామపక్షాలు తప్పుపట్టాయి. 1991 ఆరాధనా స్థలాల చట్టాన్ని ఇది ఉల్లంఘించడమేనని విమర్శించాయి. ఈ చట్టం కింద న్యాయస్థానం తప్పుడు భాష్యం చెప్పడంవల్ల భారతదేశ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి పునర్నిర్వచనంతో సహా ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని భారత కమ్యూనిస్టుపార్టీ (సిపిఐ) ఆందోళన వ్యక్తం చేసింది. బిజెపి, దాని అనుబంధ సంఘపరివార్‌ సంస్థలు చేసిన పలు ప్రకటనలను ప్రస్తావిస్తూ జ్ఞానవాపి కేసులో తీర్పు దేశంలోని ఇతర చారిత్రక కట్టడాల విషయంలో మార్గం సుగ మంచేస్తాయనడంపట్ల సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆందోళన వ్యక్తం చేశారు. “ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని సవాలు చేయడం, దేశ లౌకిక సిద్ధాంతాలకు పునర్నివచనం ఇవ్వడంకోసం ప్రయత్నాలు చేయడం, 1991 నాటి ఆరాధనా చట్టాన్ని పలుచన చేసి చూడటం వంటి చర్యల ద్వారా మనం ఈ దేశాన్ని కాళ్ళు ఆన్చడానికి ఏ మాత్రం నేల దొరకని ఘోరమైన అగాధంలోకి నెట్టేస్తున్నాం, దేశంలో ఉన్న ప్రతి చారిత్ర కట్టడాల విషయంలోనూ నిరంతర పోరాటం కొనసాగించడానికి సిద్ధపడుతున్నాం,ఈ పరిణామాలు చాలా ప్రమాదకరమైన ధోరణి” అని డి.రాజా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి తీవ్రతను అంచనా వేయడంలో ప్రధానప్రతిపక్షం కాంగ్రెస్‌పార్టీ విఫలమైందని రాజా మండిపడ్డారు. “ఇది ఒక నూతన పరిస్థితి, కాంగ్రెస్‌పార్టీ
మాట్లాడకుండా మౌనం వహించడం ఏ మాత్రం మంచిదికాదు, అది ఒక గొప్ప ప్రత్యామాయం ఏమీ కాదు” అని ఆయన విమర్శించారు. జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్‌పార్టీ మౌనం వహించడాన్ని కూడా వామపక్షాలు నిశితంగా విమర్శించాయి.1947 ఆగస్టు 15వ తేదీ నాటికి ఆరాధనా ప్రదేశాలలో ఉన్న యథాస్థితులే ఆ తర్వాత కూడా కొనసాగుతాయని 1991 నాటి ఆరాధనా ప్రదేశాల చట్టంలో మౌలికమైన నిబంధనలను సర్వోన్నత చట్టసభ తీర్మానం ద్వారా నిర్దేశించింది. అయితే ఇందుకు అయోధ్యలోని రామాలయాన్ని ఒక్కదాన్నీ మినహాయించారు. సోమవారంనాడు వారణాసి జిల్లా కోర్టు తీర్పు ఇస్తూ, జ్ఞానవాపి మసీదులో ఐదుగురు మహిళలు పూజలు చేసుకోవడానికి తమకూ హక్కు ఉందని, అందుకు అనుతించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు తీసుకోవడానికి అనుమతించింది. దీనిని తిరస్కరించలేమని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వును, వ్యాఖ్యలను సిపిఐ(ఎం) కూడా తప్పుపట్టింది. 1947 ఆగస్టు 15వ తేదీ నాటికి ఆరాధనా స్థలాల్లో ఉన్న యథాస్థితిని స్పష్టంగా ఉల్లంఘించినట్లు కాగలదని సిపిఐ(ఎం) పొలిట్‌ బ్యూరో ఒక ప్రకటనలో విమర్శించింది. ఒక వర్గం న్యాయవ్యవస్థ చట్టానికి తప్పుడు భాష్యం చెప్పడంవల్ల తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని విమర్శించింది. కేంద్రంలోని అధికారపార్టీ మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని చరిత్రకు వక్రభాష్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తోందన్నడంలో ఎలాంటి రహస్యమూ లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న మసీదులను గతంలో ఆలయాలను ధ్వంసం చేసి నిర్మించారని బిజెపి వాదన లేవదీసి దీర్ఘకాలంగా ఉన్న మతపరమైన భావోద్వేగాలను తన మతోన్మాద ఎజెండాకోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తోందని విమర్శించింది. 1991 చట్టం ఆధునిక భారతదేశ ప్రయోజనాలను పరిరక్షిస్తుందని, మతసామరస్యానికి తలుపులు తెరుస్తుందని, కానీ బిజెపి దాని అనుంధ మతోన్మాద సంస్థలు మాత్రం మధుర, వారణాసి వంటి చోట కూడా వివాదాలు సృష్టించే విధంగా అనేక పిటిషన్లు కోర్టుల్లోకి వ్యాజ్యాలుగా తీసుకురాకుండా 1991 నాటి చట్టం దోహదం చేస్తుందని సిపిఐ(ఎం) పొలిట్‌ బ్యూరో తన ప్రకటనలో పేర్కొంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments