టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కెటిఆర్
సిఎంగా ప్రమాణం చేసిన రెండో రోజే నియమించిన కెసిఆర్
నేడు కార్యవర్గంతో కెటిఆర్ భేటీ
17న బాధ్యతల స్వీకరణ
ప్రజాపక్షం / హైదరాబాద్ : టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ( కార్యనిర్వాహక అధ్యక్షుడు)గా సిరిసిల్ల ఎంఎల్‌ఎ కెటి. రామారావును శుక్రవారం ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియమించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పరంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తూ.చా. తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యతలు తనపై ఉన్న దృష్ట్యా అత్యంత నమ్మకస్తుడు, సమర్ధుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించిన కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం నాడు ఒక ప్రకటనలో విడుదల చేసింది. తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కెసిఆర్ టిఆర్‌ఎస్ పార్టీని స్థాపించారు. తెలంగాణ ఉద్యమాన్ని గమ్యానికి చేర్చి, ప్రత్యేక రాష్ట్రం సాధించింది. తెలంగాణ రాష్ట్రం లో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిఆర్‌ఎస్ పార్టీ బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా బలమైన అడుగులు వేసింది. తెలంగాణ రాష్ట్రానికి టిఆర్‌ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అని ప్రజలు ఏకోన్ముఖంగా భావించి ఇటీవల ఎన్నికల్లో తిరుగులేని విజయం అందించారు. తెలంగాణ ప్రజలకు టిఆర్‌ఎస్ పార్టీపై అచంచల విశ్వాసం ఉంది. తెలంగాణ భవిష్యత్తుకు టిఆర్‌ఎస్ అత్యంత పటిష్టంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఆ ప్రకటన వెల్లడించింది. నాలుగున్నరేళ్ల పాలన తర్వాతా రెండోసారి అధికార పగ్గాలను చేజిక్కించుకుంది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సి ఉండడంతో కెసిఆర్‌పై పని భారం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే టిఆర్‌ఎస్ పార్టీని తాను అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను, పార్టీలోనే తాను ఎక్కువగా విశ్వసించే కెటిఆర్‌కు కెసిఆర్ అప్పగించారు. టిఆర్‌ఎస్ పార్టీని దేశంలో అతిపెద్ద పార్టీగా రూపుదిద్దాలనే సంకల్పంతో కెసిఆర్ ఉన్నారు. ఇప్పటి వరకు అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ ఇచ్చిన బాధ్యతలన్నీ అత్యంత విజయవంతంగా నిర్వహించిన కెటిఆర్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని కెసిఆర్ నిర్ణయించారు. కెటిఆర్ పనితీరు, నిబద్దత, దార్శనికత, అన్నింటికీ మించి నాయకత్వ లక్షణాలు టిఆర్‌ఎస్ పార్టీని సుస్థిరంగా నిలుపుతాయని కెసిఆర్ విశ్వసిస్తున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కెటిఆర్ శనివారం సమావేశమవుతారు. ఈ నెల 17న వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.
కెటిఆర్‌కు పలువురు శుభాకాంక్షలు : తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కెటిఆర్‌ను శుక్రవారం నాడు బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఎంపిలు, ఎంఎల్‌ఏలు, మాజీ మంత్రులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కెటిఆర్‌ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసిన వారిలో మాజీ మంత్రులు ఈటల రాజేందర్, జి. జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ తదితరులు ఉన్నారు. వీరంతా కలిసిన అనంతరం కెటిఆర్ స్వయంగా పార్టీ సెక్రటరీ జనరల్ కె. కేశవ రావు, హోం మంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి హరీష్ రావుల ఇళ్లకు వెళ్లి కెటిఆర్ వారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఉదయం పలువురిని కలుసుకున్న అనంతరం తెలంగాణ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు.
కలిసి పని చేస్తాం : హరీశ్‌రావు
టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కెటిఆర్ నియమితులైన వెంటనే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మాజీ మంత్రి, టిఆర్‌ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు ట్వీట్ చేశారు. దానికి కెటిఆర్ స్పందిస్తూ “థాంక్స్ బావ” అని రిప్లు ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పాల్గొనేందుకు ముందు టిఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ డాక్టర్ కె.కేశవరావు నివాసానికి కెటిఆర్ వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసారు. అనంతరం అక్కడి నుండి హరీశ్‌రావు ఇంటికి వెళ్ళి కలిసారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ కెటిఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు. శుక్రవారం ఉదయాన్నే కెటిఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశానన్నారు. భవిష్యత్‌లో కెటిఆర్ మరింత పేరు తెచ్చుకోవాలని కోరానన్నారు. కెసిఆర్‌కు కెటిఆర్ చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత బాగా పని చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. తాము ఇద్దరం కలిసి పని చేస్తామన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కలిసిపని చేశామని, రేపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకు పోవడంలోనూ కలిసి పని చేస్తామని హరీశ్ అన్నారు.