న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు సహా రాజకీయ నిర్బంధం లో మగ్గుతున్న రాజకీయ నాయకులందరినీ తక్షణమే విడుదల చేయాలని సోమవారం ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన చేశాయి. నరేంద్ర మోడీ పాలనలో ప్రజాస్వామ్యయుతంగా వెలిబుచ్చే నిరసనలపై ఉక్కుపాదం మోపుతున్నారని, రాజ్యాంగ హక్కులైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వ హక్కులను కాలరాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాయి. సంయుక్త ప్రకటనను జారీ చేసిన వారిలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డి దేవగౌడ, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సిపిఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్‌జెడి నేత మనోజ్ కుమార్ ఝా, అటల్ బిహారీ ప్రభుత్వ హయాంలో మంత్రలుగా పనిచేసిన యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలు ఉన్నా రు. పూర్వపు జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదాను రద్దు చేస్తూ గత ఏడాది ఆగస్టు 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నాటి నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) నేత ఒమర్ అబ్దుల్లా, పిడిపి చీఫ్ ముఫ్తీలను గృహ నిర్బంధం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరిపై కఠినమైన ప్రజా భద్రతా చట్టాన్ని (పిఎస్‌ఎ) ప్రయోగించారు. అదే విధంగా గృహ నిర్బంధంలో ఉన్న మరో నేత ఎన్‌సి అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లాను సెప్టెంబర్‌లో పిఎస్‌ఎ కింద అదుపులోకి తీసుకున్నారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో ఈ ముగ్గురు నాయకులు ముప్పుగా ఉన్నారని మోడీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తూ వారిపై పిఎస్‌ఎను విధించిందని, అయితే వారిపై మోపిన ఆరోపణలను విశ్వసించేందుకు గత రికార్డులు ఏవీ లేవని ప్రతిపక్ష పార్టీల నాయకులు పేర్కొన్నారు. కశ్మీర్‌లో నిర్బంధంలో ఉన్న రాజకీయ నాయకులను ప్రత్యేకించి ముగ్గురు జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులను తక్షణమే విడుదల చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. భారత రాజ్యాంగం భిన్నత్వలంలో ఏకత్వంగా ఉంటుందని, దాని ప్రకారం ప్రతి ఒక్కరి అభిప్రాయాలు గౌరవించబడుతాయన్నారు. ముగ్గురు మాజీ సిఎంలను, ఇతర రాజకీయ నాయకులను నిరవధికంగా నిర్బంధించడం భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కఠోరంగా ఉల్లంఘించడమేనని వారు పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు పూర్తిగా సాధారణస్థితికి వచ్చాయని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు బద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
తక్షణమే రాజకీయ బందీల విడుదల
RELATED ARTICLES