రిజర్వేషన్లు తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలి
రాజ్యాంగ సవరణకు ప్రధానిపై ఒత్తిడి తేవాలి
అందుకు ఢిల్లీకి తీసుకెళ్లాలని అఖిలపక్షం డిమాండ్
ప్రజాపక్షం / హైదరాబాద్ : స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశ పెట్టేందుకు ప్రధానిపై వత్తిడి తేవడానికి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలని సమావేశం కోరిం ది. జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో ఆదివారం నాడిక్కడ జరిగిన అఖిలపక్ష సమావేశంలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్‌పి మాజీనేత జానారెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షు డు ప్రొఫెసర్ కోదండరాం, బుచ్చిలింగం (టిడిపి), పాండురంగాచారి (సిపిఐ), సామాల రవీందర్ (ఎన్‌సిపి)లతో పాటు 112 బిసి కుల సంఘాల నాయకులు, హైకోర్టు అడ్వకేట్లు, ప్రొఫెసర్లు, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సుప్రీంతీర్పు 2010లోనే వచ్చిందని, 2013లో గ్రామ పం చాయితీ ఎన్నికలు, 2014లో ఎంపిటిసి, జెడ్‌పిటిసి, మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లతోనే జరిపిందన్నారు. కెసిఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు కూడా 34 శాతం రిజర్వేషన్లతోనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. 34 శాతం రిజర్వేషన్లను కాపాడుకోడానికి బిసిలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో జరిగే పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే బిసి రిజర్వేషన్లు 22 శాతానికి తగ్గిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడం బిసిలకు ఇచ్చే బహుమానమా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసును ఎందుకు ఉపసంహరించుకుందో చెప్పాలన్నారు. హైకోర్టులో బిసి రిజర్వేషన్లపై ఉన్న మధ్యంతర ఉత్తర్వును ఎందుకు వెకెట్ చేయించలేదని ప్రశ్నించారు. బిసి రిజర్వేషన్లను కొనసాగించడం ఇష్టం లేకనే ఇలాంటి బిసి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.