4132 పంచాయతీల్లో హోరాహోరీ
2వ విడతలో ఏకగ్రీవాలకు విముఖత
కేవలం 3 చోట్ల సింగిల్ నామినేషన్లు
బరిలో నిలిచిన 20,575 మంది సర్పంచ్ అభ్యర్థులు
వార్డులకు 86,855 మంది అభ్యర్థులు పోటీ
హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల పర్వంలో ఒకటి రెండు వార్డులున్న చిన్న తండాలు తప్ప ఏ పల్లె కూడా బడా రాజకీయ నేతల ప్రలోభాలకు తలవంచడం లేదు. బుజ్జగించినా, బెదిరించినా, భారీ మొత్తం ‘ఎర’గా చూపి నా సరే గ్రామీణ నాయకత్వం ససేమిరా అంటోంది. దీనికి ఉదహరణే తాజాగా ముగిసిన రెండో విడత నామినేషన్ల పర్వం. రెండో విడతకు నామినేషన్ల స్వీకరణ, వాటి పరిశీలన మంగళవారం ముగిసింది. ఈ విడతలో మొత్తం 4135 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా వీటిలో కేవలం మూడు పంచాయతీలకు మాత్రమే సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవి కూడా ఆదిలాబాద్ జిల్లాలోని ఒక తండా, ఆసిఫాబాద్ జిల్లాలోని రెండు తండాలు. ఇవన్నీ ఇటీవల కొత్తగా పంచాయతీలుగా మారినవే, పట్టుమని పది గుడిసెలు ఉన్నవే. మిగిలిన చోట్ల ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ వారు ఎంతగా ప్రయత్నించినా.. గ్రామీణ నాయకత్వం తలవంచలేదు. ఎన్నికల బరిలో నిలిచి ప్రజామోదం పొందిన నేతగా గ్రామానికి ప్రతినిధిగా ఎన్నికయ్యేందుకే మొగ్గుచూపారు. రెండో విడతలో ఎన్నికలు జరగనున్న మొత్తం 4135 పం చాయతీలకు గాను 4132 పంచాయతీల్లో హోరాహోరి పోరుకే రంగం సిద్ధమైంది. రెండో విడతలో మొత్తం 36,602 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలోనూ బలవంతపు ఏకగ్రీవాలకు ఎవరు తలవంచకపోవడం గమనార్హం. 36,602 వార్డుల్లో కేవలం 75 వార్డులకు మాత్రమే సింగిల్ నామినేషన్లు దాఖలు కాగా మిగిలిన వాటిలో తీవ్రమైన పోటి నెలకొంది. తొలి విడతలోనూ బలవంతపు ఏకగ్రీవాలకు గ్రామీణ నాయకత్వం తలవంచలేదు. మొత్తం 4479 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా వీటిలో 769 పంచాయతీలలో మాత్రమే సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మరో 3701 పంచాయతీల్లో హోరాహోరి పోరు నెలకొంది. అలాగే తొలి విడతలో మొత్తం 39,822 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో 10,654 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మరో 28,976 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా సరే పోటీయే లేకుండా దాదాపు 90శాతం సర్పంచ్ స్థానాలను, వార్డు సభ్యులను తమ ఖాతాలో వేసుకోవాలని భావించిన అధికారపార్టీకి తెలంగాణ గ్రామీణం తలవంచలేదని దీంతో రుజువైంది. అసెంబ్లీలో ఏకపక్ష విజయం సొంతం చేసుకున్నప్పటికీ పల్లెల్లో ఆ పరిస్థితి లేదని అధికారపార్టీకి చాటి చెప్పింది. ఏకగ్రీవమైన వాటిలో దాదాపు 90 శాతానికి పైగా ఇటీవల కొత్తగా పంచాయతీలుగా మారిన తండాలు, చిన్న చిన్న గ్రామాలు ఉండడం గమనార్హం. వంద అంత కంటే తక్కువ జనాభా ఉన్న తండాలు, నాయకత్వం అంటేనే తెలియని గిరిజన ప్రాంతాలు కావడంతో పెద్ద లీడర్ వచ్చి చెప్పడం, ప్రభుత్వం ఇచ్చే పారితోషికంతో పాటు నియోజకవర్గ నిధులను కూడా కేటాయిస్తామనడం వంటి వాటితో ఇక్కడ ఏకగ్రీవాలు ఈజీ అయ్యాయి. మైదాన ప్రాంతాలు, నగర, మేజర్ గ్రామ పంచాయతీల నుంచి విడిపోయి కొత్తగా పంచాయతీలు ఏర్పడిన చోట ఏకగ్రీవాలకు అంగీకరించని పరిస్థితులు నెలకొన్నాయి. కారణం గతంలో వాటిలో ఉండి చిన్న గ్రామాలు కావడంతో నాయకులుగా ఎదగలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు తమ గ్రామమే విడిగా పంచాయతీ కావడంతో వారికి రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం వచ్చింది. దీంతో పాటు జనరల్ క్యాటగిరికి పంచాయతీల సంఖ్య పెరగడంతో వచ్చిన అవకాశాన్ని వారు వదులుకోదలుచుకోకపోవడం కూడా ఏకగ్రీవాలకు అవరోధంగా మారింది. వీటన్నింటికి తోడు ఈ సారి సర్పంచ్‌కు గ్రామీణాభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల విషయంలో స్వయం నిర్ణయాధికారం, నిధుల విడుదలలోనూ స్వయం అధికారం ఉండడం, ఉపసర్పంచ్‌కు కూడా చెక్‌పవర్‌లో భాగస్వామ్యం ఉండడం వంటివి ‘పంచాయతీ’పోరులో పోటీ పెరగడానికి కారణాలయ్యాయి. రెండో విడతలో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యే సరికి ఎన్నికలు జరగనున్న పంచాయతీలు, బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది.
తండాల్లో తప్ప తలవంచని గ్రామీణం
RELATED ARTICLES