న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలతో ఈశాన్య ఢిల్లీ అట్టుడుకుతోంది. పలుచోట్ల చెలరేగిన హింసాత్మక ఘటనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ హింసలో ఇప్పటివరకు ఓ హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 186 మందికి పైగా గాయపడటంతో వారిని జిటిబి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 130 మంది పౌరులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై ఢిల్లీ పోలీసులు మొత్తం 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఎనిమిది మంది వ్యక్తులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించారని, మరో 35 మంది క్షతగాత్రులు కూడా వచ్చిచేరారని జిటిబి వర్గాలు తెలిపాయి. ఘర్షణలో గాయపడిన 50 శాతం మందికి బుల్లెట్ గాయాలైనట్లు ఆసుపత్రి డాక్టర్ చెప్పారు. కాగా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంగళవారం మధ్యాహ్నం జిటిబి ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మరోవైపు ఢిల్లీలోని మౌజ్‌పూర్, బాబర్‌పూర్, గోకుల్‌పురి తదితర ప్రాంతాల్లో తాజాగా అల్లర్లు చెలరేగడంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి రాళ్లదాడులకు పాల్పడ్డారు. దుకాణాలను ధ్వంసం చేశారు. స్థానికులను బెదిరించారు. గోకుల్‌పురిలో అల్లరిమూకలు రెండు అగ్నిమాపక శకటాలను దగ్ధం చేశారు. ఆందోళనలకు కేంద్ర బిందివుగా మారిన మౌజ్‌పూర్‌లో నినాదాలు చేస్తూ ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న అనేక ప్రదేశాల్లోని వీధుల్లో రాళ్లు, ఇటుకలతో నిండిపోయాయి. రోడ్లపై టైర్లను దగ్ధం చేశారు. ఒకవైపు హింస కొనసాగుతుండగా మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బాయజల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ పోలీస్ చీఫ్ అమూల్య పట్నాయక్ ఇతరులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిపై సమీక్షించారు. శాంతిని నెలకొల్పేందుకు రాజకీయ పార్టీల కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని, అన్ని ప్రాంతాల్లోనూ శాంతి కమిటీని పునరుద్ధరించాలని సమావేశంలో నిర్ణయించారు. కాగా, శతాబ్దాల కాలంగా దేశ రాజధానిలో ఇలాంటి దృశ్యాలు ఎప్పుడూ కనిపించలేదు. మౌజ్‌పూర్‌లో అల్లరిమూకులు ఆయుధాలు, కర్రలు, రాళ్లతో రోడ్లపైకి రావడంతో పాటు ప్రజలపై దాడి చేశారు. ఘర్షణల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలోని పది ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. హింస చెలరేగిన క్రమంలో 35 కంపెనీల పారామిలటరీ బలగాలతో పాటు స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సహా ఆర్థిక నేరాల విభాగం అధికారులు సైతం రంగంలోకి దిగారు. ఢిల్లీ పరిసర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పించి ఈశాన్య ఢిల్లీలో మోహరించారు.
ఢిల్లీ హింసాకాండలో 13మంది మృతి
RELATED ARTICLES