HomeNewsNationalఢిల్లీ లిక్కర్‌ కేసు కక్షపూరితమేనా?

ఢిల్లీ లిక్కర్‌ కేసు కక్షపూరితమేనా?

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కేసులు, అరెస్టులు సక్రమమేనా లేక ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టి, వేధించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కక్షపూరిత విధానామా? అన్నది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణ ఎమ్మెల్సీ, భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) నాయకురాలు కల్వకుంట్ల కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు తర్వాత ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ‘ది వైర్‌’ పత్రిక ప్రచురించిన వార్తా కథనాన్ని అనుసరించి, ఈ కేసులో అప్రూవర్‌గా మారిన సంస్థ బిజెపికి రూ. 30 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో చెల్లించింది. లిక్కర్‌ కేసులో నిందితుడైన అరబిందో ఫార్మా డైరెక్టర్‌ పి. శరత్‌చంద్రా రెడ్డిని అదుపులోకి తీసుకున్న వెంటనే ఆ కంపెనీ 5 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసింది. ఆ మొత్తాన్ని బిజెపి వెంటనే ఎన్‌క్యాష్‌ చేసుకుంది. ఆ తర్వాత, 2023 జూన్‌లో శరత్‌చంద్రా రెడ్డి అప్రూవరల్‌గా మారారు. అదే ఏడాది నవంబర్‌లో అరబిందో ఫార్మా బిజెపి కోసం మరో 25 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొనింది. వాటిని కూడా బిజెపి రీడీమ్‌ చేసుకుంది. మొత్తం మీద ఆ కంపెనీ 52 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేయగా, అందులవో 34.5 కోట్లు బిజెపికే
వెళ్లాయి. ఈ కంపెనీ బిఆర్‌ఎస్‌కు 2.5 కోట్ల రూపాయల విరాళాలిచ్చింది. కాగా, 2021 ఆప్‌ ప్రభుత్వం ఢిల్లీలో కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. మద్యం దుకాణాల లైసెన్సులు దక్కించుకోవడానికి కొంత మంది వ్యక్తులు, సంస్థలు అక్రమాలకు పాల్పడగా, కనీసం 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని తొలుత సిబిఐ ఆరోపించింది. మనీలాండరింగ్‌ కోణంలో విచారణను ప్రారంభించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) కేజ్రీవాల్‌, కవితసహా ఇప్పటి వరకూ 16 మందిని అరెస్టు చేసింది. ఇలావుంటే, శరత్‌చంద్రా రెడ్డి అప్రూవర్‌గా మారిన వెంటనే, అరబిందో ఫార్మా నుంచి బిజెపికి కోట్లాది రూపాయలు విరాళంగా అందడం ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని కలిగిస్తున్నది. ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినట్టు చెప్తున్న ‘సౌత్‌ గ్రూప్‌’తో సంబంధాలున్న వారిలో శరత్‌చంద్రా రెడ్డి ఒకరు. వీరంతా ఆప్‌ కమ్యూనికేషన్స్‌ ఇన్‌చార్జిగా వ్యవహరించిన విజయ్‌ నాయర్‌ ద్వారా ఆ పార్టీకి వంద కోట్ల రూపాయల ముడుపులు చెల్లించారని ఇడి ఆరోపణ. ఈ మొత్తాన్ని 2022 గోవా ఎన్నికల్లో ఆప్‌ వాడుకుందనేది ఇడి ఆరోపణల్లో ఒకటి. విమర్శలు వెల్లువెత్తడంతో ఈ లిక్కర్‌ పాలసీని ఆప్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఇలావుంటే, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, ఆప్‌ సీనియర్‌ నాయకుడు సంజయ్‌ సింగ్‌ తదితరులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, ఇంత వరకూ ఏ ఒక్క ఆరోపణనూ కోర్టులో ఇడి రుజువు చేయలేకపోయింది. అప్రూవర్లు ఇచ్చి సమాచారం పేరుతో అరెస్టులను కొనసాగిస్తున్నది. రాబోయ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే బిజెపి ఈ విధంగా ఇడి, సిబిఐని వినియోగించుకుంటున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలను ఏదో ఒక రకంగా ఇరుకున పెట్టి, రాజకీయ ప్రయోజనాలు పొందాలన్నది బిజెపి ప్రయత్నమని పలువురు నాయకులు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. సౌత్‌గ్రూప్‌కే చెందిన ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త దినేష్‌ అరోరా కూడా ఈ కేసులో అప్రూవర్లుగా మారారని ఇడి ప్రకటించింది. అంటే వారు నేరాన్ని అంగీకరించారని పరోక్షంగా చెప్పినట్టే, అలాంటి వ్యక్తుల పర్యవేక్షణలో ఉన్న కంపెనీ నుంచి బిజెపి ఏ విధంగా విరాళాలు తీసుకుందనే ప్రశ్నకు సమాధానం లేదు. ఒకవేళ పార్టీకి తెలియకుండానే అరబిందో ఫార్మా ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసిందని అనుకున్నా, వాటిని బిజెపి ఎన్‌క్యాష్‌ చేసుకోవడంలో అర్థం ఏమిటి? వీరందరినీ అప్రూవర్లుగా పేర్కొంటూ, వారు ఇచ్చిన సమాచారం మేరకే అరెస్టు జరుగుతున్నాయని ఇడి పనిని సమర్థించడానికి ప్రయత్నం చేస్తున్నదే తప్ప, బిజెపి వద్ద బలమైన వాదన అంటూ ఏదీ లేదు. పైగా శరత్‌ చంద్రా రెడ్డి పేరు ఇలాంటి కుంభకోణాలు లేదా ఆరోపణల్లో వినిపించడం ఇదే మొదటిసారి కాదు. 2012లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కేసుకు సంబంధించి సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) చార్జిషీట్‌లో ఆయన పేరు ఉంది. 2006లో ఎపి ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌తో భూమి విక్రయ ఒప్పందానికి సంబంధించి కేసు ఇది. శరత్‌చంద్రా రెడ్డి మేనేజింగ్‌ డైరెకర్‌గా ఉన్నప్పుడు ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌కు ప్రయోజనం చేకూర్చింది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది. ఆయన డైరెక్టర్‌గా ఉన్న అరబిందో ఫార్మా ఎందుకు బిజెపికి కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చిందో ఊహించడం కష్టం కాదు. 2023, మార్చి 9న హైదరాబాద్‌ వ్యాపారవేత్త అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లుని అరెస్టు చేసిన తర్వాత, ఈ కేసులో కవిత ప్రమేయాన్ని ఇడి జోడించింది. కవితకు తాను బినామీగా వ్యవహరించానని పిళ్లు తన వాంగ్మూలంలో పేర్కొన్నారని ఇడి అంటున్నది. నిజానిజాలు ఎలావున్నా, లోక్‌సభ ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ ఈనెల 16వ తేదీ, శనివారం వెలువడనుందని భారత ఎన్నికల కమిషన్‌ (ఇసిఐ) ప్రకటించిన తర్వాత, అంతకు ఒక రోజు ముందు, శుక్రవారం కవితను అరెస్టు చేయడంలోనూ రాజకీయ కోణాలు ఉన్నాయన్నది ప్రతిపక్ష పార్టీల ఆరోపణ. మద్యం కేసు నిజమా? కాదా? అనేది పక్కకుపెడితే, సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కొనసాగుతున్న దాడులు, అరెస్టులు విమర్శలకు కారణమవుతున్నాయి. రాజకీయ కక్షతో బిజెపి ఢిల్లీ మద్యం కేసును భూతద్దంలో చూపిస్తూ, ఇడిని అడ్డం పెట్టుకొని, రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments