HomeNewsBreaking Newsఢిల్లీ పలుప్రాంతాల్లో బలగాలు

ఢిల్లీ పలుప్రాంతాల్లో బలగాలు

రైతు నాయకులపై లుక్‌ ఔట్‌ నోటీసులు
న్యూఢిల్లీ: సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో సాగుతున్న రైతుల ఆందోళనను అణచివేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌, హర్యానా ప్రభుత్వాలు అదనపు బలగాలను రంగంలోకి దించి, రైతులను ప్రదర్శన స్థలాల నుంచి బలవంతంగా తరిమివేయడం మొదలు పెట్టడంతో, ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. ఘాజీపూర్‌, సింఘుతోపాటు పలు రహదారుల్లోనూ భారీగా భద్రతా దళాలు మోహరించా యి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, భాగంగానే గణతంత్ర దినోత్సవం నాడు ట్రాక్టర్‌ పరేడ్‌ సమయంలో తలెత్తిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న రైతు నాయకులపై ఢిల్లీ పోలీస్‌లు గురువారం లుక్‌ ఔట్‌ నోటీసులు జారీచేశారు. వేలాది మంది ఆ పరేడ్‌లో పాల్గొనగా, కొద్ది మంది మాత్రమే ఎర్రకోట వద్ద హింసాత్మక సంఘటనలకు కారకులయ్యారన్నది వాస్తవం. అయితే, దోషులను విడిచిపెట్టి, రైతు సంఘాల నేతలపై పోలీస్‌ అధికారులు దృష్టి కేంద్రీకరించడం ఉద్యమాన్ని నీరుగార్చడానికే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎర్రకోట ఘటనకు సంబంధించిన కేసు విషయంలో విచారణను తీవ్రం చేస్తూ విద్రోహ నేరం మోపారు. పరేడ్‌కు నిర్దేశించిన నియమాలను అనుసరించనందుకు చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో మూడు రోజుల్లో జవాబు ఇవ్వాలని ఢిల్లీ పోలీస్‌లు రైతు నాయకులను అడిగారు. పోలీస్‌ల నుంచి అధికారిక సమాచారం లేనప్పటికీ నేరస్థులను గుర్తించేందుకు 9 బృందాల వరకు ఏర్పాటైనట్లు తెలుస్తోంది. నేరస్థులను ఎవ్వరినీ ఉపేక్షించబోమని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ ఎస్‌ఎన్‌ శ్రీవాస్తవ స్పష్టంచేశారు. ఇదిలా ఉంటే హింస వెనక కుట్ర దాగి ఉందని, ఫలితంగా 394 మంది పోలీస్‌లు గాయపడ్డారని, ఒక నిరసనకారుడు మరణించారని నిరసన చేస్తున్న రైతు సంఘాలు ఆరోపించాయి. ట్రాక్టర్‌ పరేడ్‌లో భాగంగా వేలాది నిరసనకారులు ఘాజీపుర్‌ సరిహద్దు నుంచి ఐటిఒకు చేరుకున్నారు. అక్కడ వారు భద్రతా బలగాలతో ఘర్షణపడ్డారు. వారిలో చాలామంది ట్రాక్టర్లతో ఎర్రకోటకు చేరుకొన్నారు. కోటలోకి ప్రవేశించి కొంతమంది నిరసనకారులు గుమ్మటాలపై జెండాలు ఎగరవేశారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి జాతీయ జెండా ఎగరవేసిన దగ్గర జెండా స్తంభాన్ని తొలగించారు. ఇక ట్రాక్టర్‌ పరేడ్‌ సమయంలో తలెత్తిన హింసకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో నమోదుచేసిన రైతు నాయకులపై ఢిల్లీ పోలీస్‌లు లుక్‌ ఔట్‌ నోటీసులు జారీచేశారని శ్రీవాస్తవ పేర్కొన్నారు. హత్యాయత్నం, కొట్లాటలు, నేరపూరిత కుట్ర ఆరోపణలపై రైతు నాయకులు రాకేశ్‌ తికాయత్‌, యోగేంద్ర యాదవ్‌, మేధా పట్కర్‌తోపాటు మొత్తం 37 మంది పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. దర్శన్‌ పాల్‌, గుర్‌నామ్‌ సింగ్‌ చడూనీ, కుల్వంత్‌ సింగ్‌ సంధు, సత్నామ్‌ సింగ్‌ పన్ను, జోగీందర్‌ సింగ్‌ ఉగ్రాహ, సూర్జీత్‌ సింగ్‌ ఫూల్‌, జగ్‌జీత్‌ సింగ్‌ దలేవాల్‌, బల్‌బీర్‌ సింగ్‌ రాజేవాల్‌, హరీందర్‌ సింగ్‌ లఖేవాల్‌ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఇతర ప్రముఖ రైతు నాయకులు.
బాగ్‌పత్‌లో ముగిసిన రైతు నిరసన
బాగ్‌పత్‌: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో బాగ్‌పత్‌ దగ్గర గతేడాది డిసెంబర్‌ 19 నుంచి సాగుతున్న నిరసన ముగిసిపోయింది. చర్చల ద్వారా ఈ అంశాన్ని పరిష్కరించి, బుధవారం రాత్రి నిరసనకారులను ఇళ్లకు పంపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, బుధవారం రాత్రి పోలీసులు టెంట్లలోకి ప్రవేశించి నిద్రిస్తున్న వారిపై లాఠీచార్జి చేశారని, తమను అక్కడినుంచి వెళ్లగొట్టారని నిరసనకారులు తెలిపారు. అయితే గురువారం నిరసనలో పాల్గొన్న కొంతమంది రైతులు మాత్రం చట్టాలపై తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేయడం గమనార్హం. ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఇదిలా ఉంటే ఢిల్లీ షాహారణ్‌పుర్‌ జాతీయ రహదారిపై పనులకు అరాచక శక్తుల వల్ల ఆటంకం ఏర్పడుతోందని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఎఐ) డైరెక్టర్‌ సంజయ్‌ మిశ్రా తమకు లేఖ రాశారని బాఘ్‌పత్‌ అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ (ఎడిఎం) తెలిపారు. దీనికి స్పందనగానే జాతీయ రహదారిపై టెంట్లను తొలగించి, రైతులను ఇళ్లకు పంపించామని ఎడిఎం వెల్లడించారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments