పెరుగుతున్న మృతుల సంఖ్య
న్యూఢిల్లీ: ఆక్సిజన్ కొరత ఢిల్లీ ఆసుపత్రులను వెంటాడుతునే ఉంది. ప్రధాన హాస్పిటల్స్‌లో మరణాల సంఖ్య పెరుగుతునే ఉంది. సర్ గంగారామ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో 25 మంది మృతి చెందిన సంఘటన మరువక ముందే మరో ఆసుపత్రిలో 20 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకా రం, ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోయాయి. శుక్రవారం సాయం త్రం 5 గంటల వరకే 3,600 లీటర్ల ఆక్సిజన్ ఆసుపత్రికి చేరాల్సి ఉంది. కానీ అర్ధరాత్రి 12 గం టలకు కేవలం 1500 లీటర్ల ఆక్సిజన్ మాత్రమే ఆసుపత్రికి చేరింది. ప్రాణవాయువు 7 గంటలు ఆలస్యంగా రావడంతో రోగులు ప్రాణాలు కోల్పోయారు. అత్యవసర చికిత్స పొందుతున్న రోగుల అవసరాలకు సరిపడా సరఫరా లేకపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ డికె బలుజా తెలిపారు. ప్రస్తుతం 215 మంది అత్యవసర చికిత్సలు పొందుతున్నారని, వారి ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ సరఫరా వేగంగా జరిగేలా చూడమని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. కాగా, గంగారామ్, జైపూర్ గోల్డెన్ ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో రోగులు
మరణించడంతో సమస్య తీవ్రత వెల్లడైంది. అయితే, ఢిల్లీలో ఉన్న మిగతా ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంభవిస్తున్న మరణాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ లెక్కలను కూడా తీసుకుంటే, మృతుల ప్రతి రోజూ వందకుపైగానే ఉంటుందని అంచనా. ఆక్సిజన్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించకుంటే, అత్యవసర వైద్య సేవలు పొందుతున్న రోగుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉండదని రోహిణి ప్రాంతంలోని సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ పికె భరద్వాజ్ శనివారం పిటిఐతో మాట్లాడుతూ అన్నారు. తమ ఆసుపత్రిలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొందని తుగ్లకాబాద్ ప్రాంతంలోని బాత్రా హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాంశు బన్కటా తెలిపారు. ఆక్సిజన్ సిలిండర్లను వెంటనే సరఫరా చేయాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మూల్‌చంద్ హాస్పిటల్ (దక్షిణ ఢిల్లీ), ఫోర్టిస్ హాస్పిటల్ (షాలిమార్ బాగ్), మాక్స్ హాస్పిటల్ (గుర్‌గావ్), లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్ (మౌలానా అబుల్ కలాం ఆజాద్ మెడికల్ కాలేజ్ క్యాంపస్)లోనూ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. సకాలంలో ప్రాణవాయువు సరఫరా జరగకపోతే, ఎంత మంది ప్రాణాలు పోతాయన్నది ఊహించడానికే భయం ఉందని పలువురు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ మహమ్మారి తీవ్రతరమవుతున్న తరుణంలో ముందస్తు చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలావుంటే, ఆక్సిజన్ సిలిండర్లు శనివారం ఢిల్లీ చేరుకున్నాయి. అయితే, ఎన్ని ఆసుపత్రులకు, ఎంత మొత్తం ఆక్సిజన్ అందుతుందనేది ప్రశ్న.
ఢిల్లీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత
RELATED ARTICLES