న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 24కు చేరింది. బుధవారం పరిస్థితి కొంత మేరకు అదుపులో ఉన్నప్పటికీ మరికొన్ని చోట్ల హింస చెలరేగింది. ఆందోళనకారులు దుకాణాలను దగ్ధం చేశారు. ఇంటెలీజెన్స్ బ్యూరో ఉద్యోగి మృతదేహం మురుగుకాలువలో బయటపడింది. పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేశారు. సోమవారం నుంచి చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను అరికట్టేందుకు దేశ రాజధానిలోని ఈశాన్య సరిహద్దుల వ్యాప్తంగా భద్రతా సిబ్బందిని మోహరింపజేశారు. ఘటనలపై ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారిగా స్పందిస్తూ శాంతి, సోదరభావాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని పూర్తిగా సమీక్షించామని, శాంతి..సామరస్య వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసులు, ఇతర ఏజెన్సీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని ప్రధాని ట్వీట్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే బాధ్యతలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు అప్పగించారు. ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో ఆయన బుధవారం సాయంత్రం పర్యటించారు. స్థానికులను కలిసి పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. మంగళవారం రాత్రి కూడా ఆయన ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్, కొత్తగా నియమితులైన ప్రత్యేక కమిషనర్ ఎస్‌ఎన్ శ్రీవాత్సవతో కలిసి సమావేశం నిర్వహించారు. కాగా, ఘర్షణలో మంగళవారం నాటికి 13 మంది చెందగా, ఆ సంఖ్య బుధవారం నాటికి 22కు చేరుకుంది. మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జిటిబి ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ తెలిపారు. 200 మందికిపైగా గాయపడినట్లు అంచనా వేస్తున్నారు. అయితే సాధారణంగా మృతుల సంఖ్య పోలీసులు ధ్రువీకరించాల్సి ఉండగా, ఆసుపత్రి వర్గాలు వెల్లడిస్తుండడం గమనార్హం. ఘర్షణల నియంత్రణకు పోలీసులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపాలని కేంద్రాన్ని కోరారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాల్లో నిషేదాజ్ఞలు విధించాలన్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాయనున్నానని ట్విటర్‌లో వెల్లడించారు. కాగా ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం రాత్రి పర్యటించారు. పరిస్థితిని అంచనా వేసేందుకు స్థానికులను నేరుగా కలిసి వారితో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని స్వాంతన పలికారు. ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఇంటెలీజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ మృతదేహం ఆయన నివాసం ఉంటున్న చాంద్‌బాగ్‌లోని మురుగు కాలువలో లభించింది. రాళ్లదాడిలో శర్మ మృతి చెంది ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఏ ఒక్కరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు ప్రకటించడంతో అనేక వీధులు ఎడారని తలపించాయి. దుకాణాలు, పాఠశాలలను మూసివేశారు. చాంద్‌బాగ్‌లో పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరింపజేశారు. ఇళ్ల నుంచి బయటకి వచ్చేందుకు ఒక్క ఒక్కరిని కూడా అనుమతించడం లేదు. గత రెండు రోజులుగా అల్లరి మూకలు వీధుల్లో తిరిగుతూ దుకాణాలను లూఠీ చేస్తూ, ఆస్తులను ధ్వంసం చేసినప్పటికీ బుధవారం నాడు అలాంటి పరిస్థితిలో కనిపించలేదు. అయితే అంతా ఇలాంటి పరిస్థితే లేదు. మరికొన్ని చోట్ల బుధవారం కూడా హింసాత్మక ఘటనలు జరిగాయి. గోకుల్‌పురిలో అల్లరిమూకలు దుకాణాలకు నిప్పుపెట్టారు. దీంత దట్టమైన పొగతో కూడిన మంటలు ఆకాశాన్నంటాయి. రక్తపాతం అనంతరం ఆ ప్రాంతంలోని దుకాణాలను లూఠీ చేయడంతో అక్కడి ప్రజలు జీవనోపాధిని కోల్పోయారు. వారి పిల్లలు భయంతో వణికిపోయారు. అత్యధిక మంది బయటకి వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యారు. సోమవారం నుంచి ఇప్పటి వరకు మొత్తం 22 మంది ఘర్షణలో గాయపడిన వారి మృతి చెందగా, క్షతగాత్రులైన మరో నలుగురిని ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రి నుంచి జిటిబికి తీసుకువచ్చినట్లు ఆసుపత్రి అధికారులు చెప్పారు. అయితే ఎల్‌ఎన్‌జిపిలో కూడా ఇద్దరు మరణించారు. బాధితులను గుర్తించారా అని ప్రశ్నించగా, అనేకమందిని గుర్తించామని, ఇంకా కొంతమందిని గుర్తించాల్సి ఉందన్నారు. క్షతగాత్రులకు బుల్లెట్ గాయాలు, రాళ్లగాయాలు, ఇతర ఆయుధాలకు సంబంధించిన అనేక రకాల గాయాలయ్యాయని జిటిబి ఆసుపత్రి అధికారులు పేర్కొన్నారు. అల్లరిమూకల నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా ఇళ్లపైకప్పుల నుంచి దూకడంతోనే అనేక మంది గాయపడ్డారన్నారు. కాగా, 1984 తరువాత నగరంలో ఇలాంటి మత ఘర్షణలు చోటు చేసుకోలేదని, అందుకు కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పదవికి రాజనామా చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ డిమాండ్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కుట్ర పన్నారని, బిజెపి నేతలు ద్వేషపూరితమైన ప్రసంగాలు చేసి భయానక వాతావరణాన్ని సృష్టించారని ఆమె ఆరోపించారు. అయితే ఢిల్లీలో చెలరేగుతున్న హింసను సోనియాగాంధీ రాజకీయం చేస్తున్నారని, కేంద్రంపై దాడి చేస్తున్నారని బిజెపి తప్పుబట్టింది. ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న హింసపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, 1984 అల్లర్ల వంటి ఘటనలు పునరావృతం అవ్వడానికి తాము అంగీకరించబోమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ప్రతి పౌరుడికీ జెడ్ కేటగిరి భద్రత కల్పించాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొంది.