నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ రెండోదశ సమావేశాలు
అమిత్ షా రాజీనామాకు ప్రతిపక్షాల ఒత్తిడి
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం కానున్నాయి. అప్పుడు ఢిల్లీ అల్లర్ల అంశాన్ని విపక్షాలు సభలో తీవ్రంగా లేవనెత్తనున్నా యి. అంతేకాక పోలీసుల విధుల వైఫల్యంపై హోంమంత్రి అమిత్ షా రాజీనామాను కోరనున్నాయి. ఢిల్లీ హింసాకాండపై చర్చను కోరుతూ పార్లమెంటు ఉభయ సభలలో సోమవారం కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని సమర్పించనున్నది. సిపిఐ, సిపిఐ(ఎం), తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కూడా లోక్‌సభ, రాజ్యసభలో ఢిల్లీ అల్లర్ల అంశాన్ని లేవనెత్తనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ‘ఢిల్లీ పోలీసుల ‘నిష్క్రియ’పై అమిత్ షా నుంచి జవాబు కోరనున్నామని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా తెలిపారు. ఢిల్లీ పోలీసులు హోం మంత్రిత్వ శాఖ కిందికే వస్తుందన్నారు. ‘వామపక్షాలు పార్లమెంటులో విపక్ష గళానికి బలాన్ని ఇవ్వనున్నాయి. ఢిల్లీ అల్లర్ల అంశాన్ని ఉభయ సభలో లేవనెత్తనున్నాయి. సభలో ఈ అంశాన్ని చర్చించేందుకుగాను నేను రాజ్యసభ చైర్మన్‌కు రూల్ 267 కింద నోటీసును ఇచ్చాను’ అని సిపిఐ(ఎం) ఎంపి కెకె రాగేశ్ చెప్పారు. ‘పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తేప్పుడు మేము ఇతర పార్టీలతో కలిసిమెలిసి వ్యవహరిస్తాం. బిజెపి నాయకుల విద్వేష ప్రసంగాల విషయాన్ని కూడా మేము లేవనెత్తుతాం. వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తాం. అమిత్ షాను జవాబుదారీగా నిలుపుతాం’ అని కూడా ఆయన చెప్పారు. పార్లమెంటులో ఢిల్లీ అల్లర్ల అంశాన్ని తీవ్రంగా లేవనెత్తుతామని, అమిత్ షా జవాబును కోరుతామని పార్లమెంటులో ఢిల్లీ అల్లర్ల అంశాన్ని టిఎంసి ఎంపిలు తీవ్రంగా లేవనెత్తనున్నారని, హోం మంత్రి అమిత్ షా నుంచి జవాబు కోరనున్నామని టిఎంసి సీనియర్ నాయకుడొకరు చెప్పారు. హింసాకాండ ఎందుకు జరిగిందని ప్రశ్నించనున్నామని లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. ‘శాంతిభద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అల్లరిమూకతో పోలీసులోన్ని ఓ వర్గం కుమ్మకు అయినందునే ఘోరమైన చంపివేతలు, దహనకాండ వంటివి జరిగి ఉండవచ్చు. ఇది ప్రపంచంలో మన ఇమేజ్‌ను దెబ్బతీసింది. దీని గురించి మనమంతా తీవ్రంగా ఆలోచించాలి’ అని ఆయన పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ‘లోక్‌సభలో మేము హోం మంత్రి అమిత్ షా రాజీనామాను డిమాండ్ చేస్తాం’ అని కూడా అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. రాజ్యసభ ఎంపి, కాంగ్రెస్ సీనియర్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ కూడా తాము పార్లమెంటులో ఈ అంశాన్ని తీవ్రంగానే లేవనెత్తనున్నామని అన్నారు. ‘దేశంలో ప్రజాస్వామ్య విలువలను ప్రభుత్వం కావాలనే కాలరాస్తున్నది. దీనికి అనుమతి… పదేపదే, ఎంపిక చేసుకుని… చూసిచూడనట్లు (నెల్సన్ బ్లయిండ్ ఐ) వ్యవహరించడం’ వంటిది చేస్తోంది అని సింఘ్వీ అభిప్రాయపడ్డారు. ‘పార్లమెంటు లోపల, బయట నిరసనలు వ్యూహాత్మక సహకారానికి సంబంధించిందే కానీ పబ్లిసిటీ కోసం చేస్తున్నది కాదు. వేధింపులు వంటి ఉన్నప్పటికీ ఎలాంటి భయాలు లేకుండా మా బాధ్యతలను నెరవేరుస్తామని దేశానికి హామీ ఇస్తున్నాం’ అని ఆయన పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ఢిల్లీ అల్లర్లను నివారించడంలో విఫలమైనందుకు హోం మంత్రి రాజీనామాను ఎన్‌సిపి, సిపిఎం, సిపిఐ, ఆర్‌జెడి, ఎల్‌జెడి, డిఎంకె, ఆప్ వంటి వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ అల్లర్ల కారణంగా సోమవారం వరకు కనీసం 42 మంది చనిపోగా, 200కు పైగా గాయపడ్డారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశం జనవరి 31న ఆరంభమై ఫిబ్రవరి 11 వరకు జరిగింది. విరామం తర్వాత మళ్లీ మార్చి 2న ఆరంభమై ఏప్రిల్ 3 వరకు కొనసాగనున్నది.
ఢిల్లీ అల్లర్లే టార్గెట్!
RELATED ARTICLES