రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం
ఆజాది.. ఆజాది నినాదాల హోరు
షాహీన్‌బాగ్ వద్ద నూతన సంవత్సర వేళ జాతీయ గీతం ఆలపిస్తూ ఆందోళన
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సిఎఎ) వ్యతిరేకంగా మంగళవారం అర్ధరాత్రి 12గంటలకు 2020 సంవత్సరంలోకి అడుగిడుతున్న వేళ యువత పార్టీలకు, పెద్దవారు ఇంట్లో టివి చూస్తే విశ్రాంతి తీసుకోవడం మానేసి వేలాదిమంది ఢిల్లీలోని షాహీన్‌బాగ్ వద్దకు చేరుకొని జాతీయగీతం ఆలపిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా వేదిక వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. కొంతమంది జాతీయ జెండాలను ఎగురవేయగా, మరికొందరు కొత్త చట్టానికి వ్యతిరేకంగా సృజనాత్మకమైన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ‘ఆజాది, ఆజాది’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గడియారంలో సమయం 12 గంటలు కాగానే ఆందోళనకారులు బాణాసంచా కాల్చి ఒకరికొకరు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం ముక్తకంఠంతో ‘విప్లవం వర్థిల్లాలి’ అంటూ నినదించారు. 2020 సంవత్సర వేడుకలను కూడా లెక్కచేయకుండా ఢిల్లీలోని పలు ప్రాంతాల నుంచి వివిధ వృత్తులను నిర్వహిస్తున్న వేలాది మంది యువకులు షాహీన్‌బాగ్‌కు చేరుకున్నారు. పరిస్థితులు సాధారణస్థితికి చేరుకున్ననాడు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తాము కూడా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటామని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న 30 ఏళ్ల యువకుడు చెప్పారు. మతపరమైన గుర్తింపు పొందేందుకు తాను ఇక్కడికి రాలేదని, అంతకంటే పెద్ద కారణమైన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితాను వ్యతిరేకించేందుకు వచ్చానని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. ఆందోళనలో పాల్గొని నగర నివాసి ఫూల్‌కుమారి మాట్లాడుతూ ఇటీవల సిఎఎకు వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలో ముగ్గులు వేసిన కళాకారులను పోలీసులు అరెస్టు చేయడంపై నిరసన తెలియజేస్తుందుకు తాను వేదిక వద్దని వచ్చానన్నారు. కాగా, రాత్రి 12 గంటలు దాటిన తరువాత కూడా స్థానికులు షహీన్‌బాగ్ వద్దే ఉండి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఇప్పుడు ఇదే అత్యంత ప్రాధాన్యమైన అంశమని పేర్కొన్నారు. జామియా మిలియా ఇస్లామియా సమీపంలో ఉన్న షహీన్‌బాగ్ డిసెంబర్ 15వ తేదీ నుంచి సిఎఎకు, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు కొన్ని వర్గాల ప్రజలకు వేదికగా మారింది. ఒక్క ఢిల్లీలోనే కాకుండా ఈ వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.
రాజ్యాంగ పరిరక్షణకు ఇండియా గేట్ వద్ద ప్రతిజ్ఞ
‘పత్రాలు చూపం.. ఏం చేస్తారో చూస్తాం’ అంటూ వందలాదిమంది నిరసనకారులు బుధవారం చేసిన నినాదాలు ఇండియా గేట్ వద్ద ప్రతిధ్వనించాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ‘రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం’ అంటూ సామూహిక ప్రతిజ్ఞ చేశారు. కొత్త సంవత్సర వేడుకుల జరుపుకునేందుకు వచ్చిన సందర్శకులు, పెద్ద ఎత్తున విచ్చేసిన నిరసనకారులతో ఐకానిక్ స్మారక చిహ్నం వద్ద పెద్దఎత్తున జనసందడి నెలకొంది. దీంతో వాహనరాకపోకలకు తీవ్రం అంతరాయం ఏర్పడింది. వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు సహా నిరసనకారులు రాజ్యాంగ పీఠికను చదువుతూ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. తరువాత వివాదాస్పద జాతీయ పౌరుల జాబితా, జాతీయ జనాభా జాబితాను ప్రస్తావిస్తూ తాము ఎలాంటి పత్రాలు చూపం అంటూ ప్రతిజ్ఞ చేశారు. అనేకమంది ఆందోళనకారులు జాతీయ పతాకాన్ని ఎగురవేయగా, కొంతమంది ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసులను మోహరింపజేశారు.
సిఎఎకు వ్యతిరేకంగా కొచ్చిలో ముస్లింల ర్యాలీ
వివాదాస్పద పౌరసత్వ చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ముస్లింలు బుధవారం కేరళ పోర్టుసిటీ అయిన కొచ్చి వీధుల్లో కదంతొక్కారు. జాతీయ పతాకాన్ని ఊపుతూ ‘భారత్‌లో పుట్టాం, భారత్‌లోనే నివసిస్తాం. భారత్‌లోనే చస్తాం’ అంటూ ప్లకార్డులను ప్రదర్శిసూ భారీ ర్యాలీ నిర్వహించారు. జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ స్టేడియం నుంచి ఆందోళనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. సిఎఎ అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినదించారు. మొదటి నుంచి చివరి వరకు తాము భారతీయులమేనంటూ తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. ర్యాలీ సందర్భంగా మహాత్మాగాంధీ, బిఆర్ అంబేద్కర్, మౌలా నా అబ్దుల్ కలాం ఆజాద్ ఫొటోలను కూడా ప్రదర్శించారు. పలు ముస్లిం సంఘాలు సంయుక్తంగా ర్యాలీల్లో పాల్గొన్నాయి.
ఢిల్లీలో వినూత్న నిరసనలు
RELATED ARTICLES