- నేడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
- 60.54 శాతం ఓట్లు పోలైనట్లు ఇసి స్పష్టీకరణ
- కౌంటింగ్ 5వేల మంది సిబ్బంది మోహరింపు
న్యూఢిల్లీ : ఢిల్లీ పాలనాధికారం ఎవరిదో మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈనెల 5వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు శనివారం వెల్లడి కానున్నాయి. ఫలితాల అనంతరం అధికార పార్టీ అయిన ఆప్ నాలుగోసారి అధికారంలోకి వస్తుందా లేదా 27 సంవత్సరాల తర్వాత దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని బిజెపి ఏర్పాటు చేస్తుందా అనేది తేలనుంది. అయితే గత రెండుసార్లు నుంచి కాంగ్రెస్ కూడా అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2015 నుండి ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ కంటే బిజెపికి అనేక ఎగ్జిట్ పోల్స్ ఆధిక్యాన్ని ఇచ్చాయి. కాగా, ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రారంభం నుంచే ముందస్తు ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ ప్రకారం, బుధవారం 60.54 శాతం ఓట్లు పోలయ్యాయి. ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్ తమ పార్టీ దాదాపు 50 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొన్నారు. ఆప్ ఎగ్జిట్ పోల్ అంచనాలను తిరస్కరించింది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతారని, తాము మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (ఇసిఒ) అలిస్ వాజ్ మాట్లాడుతూ కౌంటింగ్ సూపర్ కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో-అబ్జర్వర్లు, ఈ ప్రక్రియ కోసం శిక్షణ పొందిన సహాయక సిబ్బందితో సహా మొత్తం 5,000 మంది సిబ్బందిని శనివారం నాటి ఓట్ల లెక్కింపులో మోహరించామని చెప్పారు. ఇదిలా ఉండగా, ఎగ్జిట్ పోల్స్ అంచనాల ఆధారంగా బిజెపి తమకు అనుకూలంగా భ్రమను సృష్టించడానికి ప్రయత్నిస్తోందని, కానీ విజయావకాశాలతో ఆప్ అభ్యర్థులను వేటాడేందుకు ప్రయత్నిస్తోందని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఆప్ తన ఆరోపణలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్ చేసింది. ఢిల్లీ బిజెపి ప్రధాన కార్యదర్శి విష్ణు మిట్టల్ కూడా ఆప్ ఆరోపణలపై ఎసిబి దర్యాప్తు కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం వెలువడిన వెంటనే, ఈ విషయంపై ఎసిబి బృందం కేజ్రీవాల్ సందర్శించింది. శుక్రవారం ముందుగా, కేజ్రీవాల్ అన్ని పార్టీల అభ్యర్థులతో సమావేశం నిర్వహించి, ఆప్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నొక్కిచెప్పారు, ప్రతిపక్షాలు ‘మానసిక ఒత్తిడి‘ సృష్టించడానికి ఎగ్జిట్ పోల్స్ ఉపయోగిస్తున్నాయని, ‘ఆపరేషన్ లోటస్‘ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. సమావేశం తర్వాత విలేకరులతో ఆప్ సీనియర్ నాయకుడు గోపాల్ రాయ్ మాట్లాడుతూ, కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో, అన్ని అభ్యర్థులు తమ గ్రౌండ్ రిపోర్టులను సమర్పించారని, ఇది ఆప్ 7-8 సీట్లపై గట్టి పోటీతో నిర్ణయాత్మకంగా 50 సీట్లను గెలుచుకుంటుందని సూచించిందని అన్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ రెండింటినీ ఓడించి, 70 అసెంబ్లీ సీట్లలో 67 సీట్లను గెలుచుకుని ఢిల్లీ రాజకీయ పటంలో ఆప్ తన ఆధిపత్యాన్ని స్థాపించింది. 2020లో పార్టీ మళ్ళీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, 62 సీట్లను గెలుచుకుని, ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ మట్టికరిపించింది. ఆప్ విజయం ఢిల్లీలో కేజ్రీవాల్ ఆధిపత్యాన్ని ప్రదర్శించడంతో పాటు జాతీయ స్థాయిలో ఆయన రాజకీయ ప్రతిష్టను పెంచింది. అయితే, బిజెపి ఎన్నికల్లో గెలిస్తే, 27 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి రావడమే కాకుండా, దశాబ్ద కాలంగా పోటీ పడుతున్న ఆప్, కేజ్రీవాల్ మంత్రాన్ని బద్దలు కొట్టడంలో కూడా విజయం సాధిస్తుంది. 2013 వరకు వరుసగా 15 సంవత్సరాలు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్, గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది.