‘బుల్డోజర్’ బృందాలపై రాళ్ళు రువ్విన జనం
పలువురికి గాయాలు… అరెస్టులు
సక్రమ నిర్మాణాలూ కూల్చివేత?
న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీ నగర పాలక సంస్థ (ఎస్‌డిఎంసి) అక్రమణల పేరిట పేదల ఆవాసాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దక్షిణ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ ప్రాంతాలలో పేదలపైనే గురిపెట్టి ఈ కూల్చివేతలు కొనసాగాయి. దక్షిణ ఢిల్లీ మదన్‌పూర్ ఖాదర్, ధిర్‌సెన్ మార్గ్ ప్రాంతం నినాదాలు, నిర్బంధాలు, అరెస్టులు, ఆప్ పార్టీ మద్దతుదారుల ధర్నాలతో దద్దరిల్లింది. బుల్డోజర్లు, పోలీసుబలగాల సహాయంతో ఆక్రమణల నిర్మూలనా దళాలు గురువారంనాడు కూడా ఉధృతంగా నిర్మూలన చేపట్టడంతో స్థానిక ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిరసనలు, అరెస్టులతో నిబంధనల ప్రకారం సక్రమంగా ఉన్న నిర్మాణాలను కూడా కూల్చివేస్తున్నారని కొందరు స్థానికులు అరుపులు కేకలతో నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది హెలెట్లు, లాఠీలు ధరించి వచ్చి స్థానికులను భయభ్రాంతుల్ని చేశారు. ఉత్తర ఢిల్లీలోని రోహిణి, కరోల్ బాగ్ జోన్లలో కూడా కూల్చివేతలు కొనసాగాయి. ఆయా ప్రాంతాలలో స్థానిక నివాసితుల నిరసనలు పెల్లుబుకుతున్నాయి. కాంచన్ కుంజ్, మదన్‌పూర్ ఖాదర్ లలో పేదల ఆవాసాలు కూల్చివేశారు. దక్షిణ ఢిల్లీ మదన్‌పూర్ ఖాదర్, ధిర్‌సెన్ మార్గ్ ప్రాంతంలో పోలీసు బలగాలకు, స్థానికులకు మధ్య జరిగిన ప్రతిఘటనలో పలువురు స్థానికులు గాయపడ్డారు. బాధితులు నగరపాలక సంస్థపై కన్నెర్రచేశారు. బుల్డోజర్లను అడ్డుకుంటూ తమ శక్తానుసారం అధికారులకు తమ దైన్య పరస్థితిని ఒకవైపు వివరిస్తూనే మరోవైపు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారుల ఆదేశాలతో సిబ్బంది జులు చేయడంతో సహనం చచ్చిపోయిన స్థానిక ప్రజలు ఆగ్ర అణచుకోలేక రాళ్ళు రువ్వారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది సహా పలువురు గాయపడ్డారని పోలీసులు చెప్పారు.
భద్రతా దళాలు హెల్మట్లు ధరించి వచ్చి స్థానిక ప్రజలను అడ్డుకుంటూ వారి సహనాన్ని పరీక్షించారు. దక్షిణ ఢిల్లీ నగర పాలక సంస్థ దుందుడుకుతనంతో భారీ ఎత్తున బుల్డోజర్లను సమీకరించి ‘అక్రమ ఆక్రమణల నిర్మూలన’ పేరిట పేదల తాత్కాలిక ఆవాసాలుకూల్చివేసి వారిని వెళ్ళగొడుతున్నారు. ఎస్‌డిఎంసి మదన్‌పూర్ ఖాదర్ ప్రాంతంలోకి ప్రవేశించగానే కూల్చివేతలను అడ్డుకునేందుకు స్థానిక ప్రజల నిరసనలు ప్రారంభమయ్యాయి. అయినా వారిని లెక్కచేయకుండా అధికారులు బలవంతంగా కూల్చివేతలు చేపట్టారు. తమ నిర్మాణాలు అక్రమం కాదని, సక్రమ నిర్మాణాలేనని గొంతెత్తి అరుస్తున్నాగానీ సిబ్బంది వాటిని కూల్చివేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారం నుండీ ఢిల్లీలో నాలుగు జోన్ల నగర పాలక సంస్థలు అక్రమ నిర్మాణాల పేరిట పేదలపైన, పేదరికంలో ఉంటే వీధివ్యాపారాలు చేసుకునేవారి నిర్మాణాలపై విరుచుకుపడటం ప్రారంభించారు. జహంగీర్‌పురిలో శ్రీరామనవమిరోజు మతపరమైన హింస్తాత్మక ఘటనల అనంతరం కూల్చివేతల చర్యలు మరింత ఉధృతరూపం దాల్చియి. ఏప్రిల్ 16వ తేదీన ఈ కార్యక్రమం మొదలై ఇంకా కొనసాగుతోంది. న్యూ ఫ్రెండ్స్ కాలనీ, ద్వారకా, నజఫ్‌గర్, లోధి కాలనీ తదితర ప్రాంతాలలో కూల్చివేతలు ఇప్పటివరకూ కొనసాగించారు. సోమవారం 9వ తేదీన కూడా షాహీన్‌భాగ్‌లో కూల్చివేతలు మొదలెట్టారు. ఈ ప్రాంతంలో ప్రజలు, పలు పార్టీ నాయకులు కూడా భారీ ఎత్తున ప్రతిఘటించి, తమ శరీరాలపై బుల్డోజర్లు పోనివ్వాలని నినాదాలు చేశారు. బుల్డోజర్లకు అడ్డంగా స్థానిక ప్రజలు పడుకుని నిరసన తెలియజేయడంతో ఎటూ పాలుపోని పరిస్థితుల్లో అధికారులు తాత్కాలికంగా వెనక్కు తగ్గారు. ఉత్తరఢిల్లీలోని కెఎన్ కట్జుమార్గ్‌లో,ప్రేమ్‌గాలిలోని పటేల్ నగర్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు అధికారులు చెప్పారు.
ఆప్ ఎంఎల్‌ఎ సహా పలువురు అరెస్టు
ఎస్‌డిఎంసి పరిధిలోని మదన్‌పూర్ ఖాదర్ ప్రాంతంలో పేదల ఆవాసాల కూల్చివేత చర్యలను ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యుడు అమానతుల్లాఖాన్ గురువారంనాడు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో భద్రతా సిబ్బంది ఆయనను అరెస్టు చేశారు. ఆ సమయంలోనే ఆగ్రహం
భరించలేని ప్రజలు మున్సిపల్ సిబ్బందిపై రాళ్ళు రువ్వారు. ఎంఎల్‌ఎ ఖాన్‌ను తాము కేవలం నిర్బంధంలోకి మాత్రమే తీసుకున్నామని పోలీసులు వాదించారు. ఖాన్ మాత్రం తనను పోలీసులు అరెస్టు చేశారని విమర్శించారు. తమ విధులను అడ్డుకుంటున్నారంటూ నగర పాలక సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై ఫిర్యాదు నమోదు చేశారు. ఆయనతోపాటు ఇంకా అనేకమందిని అరెస్టులు చేశారు. ‘ఢిల్లీ పోలీసులు తనను కేవలం అరెస్టు చేయగలరు, జైల్లో మాత్రమే పెట్టగలరు, కానీ ఈ కూల్చివేతలను అడ్డుకునే నా స్ఫూర్తిని మాత్రం అడ్డుకోలేరు’ అని అమానతుల్లా పోలీసులపై మాటలదాడి చేశారు. మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. ‘కాంచన్ కుంజ్, మదన్‌పూర్ ఖాదర్ లలో పేదల ఆవాసాలను నగర పాలక సంస్థ కూల్చివేసింది, పేదలను కాపాడేందుకు నేను అక్కడికి వెళ్ళాను, మీరూ రండి, వారి ఇళ్ళను కాపాడదాం’ అని అమానుతుల్లాఖాన్ తన మద్దతుదారులకు తొలుత సందేశాలు పంపించారు. కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరక్కుండా భారీ భద్రతా ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఈ సందర్భంగా ఆప్ పార్టీ మద్దతుదారులు కూల్చివేతలకు నిరసనగా ధర్నాకు దిగారు.పెద్ద సంఖ్యలో ఉన్న హెల్మెట్లు ధరించి, చేతుల్లో లాఠీలు ధరించి భద్రతా దళాలు స్థానికులను మానసికంగా భయభ్రాంతులకు గురిచేశారు. అయినప్పటికీ బాధితులు వారిని ప్రతిఘటించారు. స్థానిక ప్రజలతో కలిసి ఎంఎల్‌ఎ అమానుతుల్లాఖాన్ కూడా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.