HomeNewsNationalడ్రోన్లతో రైతులపై బాష్పవాయు ప్రయోగం

డ్రోన్లతో రైతులపై బాష్పవాయు ప్రయోగం

కశ్మీరు లోయా? హర్యానా సరిహద్దా?
వేలాది భద్రతాదళాలను చూసి రైతుల దిగ్భ్రాంతి
హర్యానా రహదారిపై ఇనుప కంచెలు, సంచార కాంక్రీట్‌ గోడలు
ప్రదర్శకుల నిర్బంధం
అన్నింటికీ సిద్ధపడే సకల సామాగ్రితో కర్షక జనం ‘ఢిల్లీ చలో’
చండీగఢ్‌/న్యూఢిల్లీ :
పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ను చట్టబద్ధం చేయాలని, మూడేళ్ళనాటి ఉద్యమంలో రైతులపై బనాయించిన వేలాది కేసులు ఎత్తివేయాలని, పంట రుణాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కర్షకదండు మంగళవారం ట్రాక్టర్లపై ఢిల్లీకి బయలుదేరింది. ప్రభుత్వంతో ఈసారి తాడోపేడో తేల్చుకోవాలని రైతులు గట్టిపట్టుదలతో ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా దీనిని రైతుల సమస్యగా, దేశ సమస్యగా చూడకుండా మొండితనంతో ప్రవర్తిస్తున్నది. చండీగఢ్‌లో రైతు ప్రతినిధులతో ముగ్గురు కేంద్రమంత్రుల బృందం ఒక ఒప్పందం కోసం జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతులు ఢిల్లీ బయలుదేరారు. ఇటు హర్యానా సరిహద్దు, అటు సెంట్రల్‌ ఢిల్లీ భారీ భదత్రా దళాలమధ్య ఉన్నాయి. బహుముఖ భద్రతా వలయాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రులు అమిత్‌ షా, అర్జున్‌ ముండా నివాసాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. పార్లమెంటుకు ఉన్న అన్నిగేట్ల వద్దా అదనపు భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ట్రాఫిక్‌ దారి మళ్ళించారు. ఎర్రకోటనుతాత్కాలికంగా మూసివేశారు. పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌ల నుండి వేలాదిమంది రైతులు ప్రదర్శనగా ఢిల్లీ బయలుదేరారు. పంజాబ్‌, హర్యానా సరిహద్దుల్లోనే రైతులను అడ్డుకునేందుకు అంబాలా, జింద్‌, ఫతేబాద్‌, కురుక్షేత్ర, సిర్సా తదితర ప్రాంతాలలో వేలాదిమంది భద్రతా దళాలను మోహరించింది. అనేక ప్రాంతాలలో రైతులను వెనక్కు నెట్టేందుకు వీలుగా సంచార ఫోర్స్‌బుల్‌ వాటర్‌ పంపు వాహనాలను సిద్ధంగా ఉంచారు. “ఇది పంజాబ్‌, హర్యానా సరిహద్దులా కనిపించడంలేదు, ఇది అంతర్జాతీయ సరిహద్దులా ఉంది! ఇన్నివేలమందా?” అని ఫతేగర్‌ సాహిబ్‌ వద్ద రైతు ప్రదర్శన ప్రారంభానికి ముందుగా కిసాన్‌ మజూర్దర్‌ సంఘర్ష్‌ కమిటీ నాయకుడు శర్వణ్‌ సింగ్‌ పాంధేర్‌ విలేకరులవద్ద ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “మేం ప్రభుత్వంతో ఘర్షణ పడటానికి ఢిల్లీ వెళ్ళడంలేదు, మా న్యాయమైన డిమాండ్లపై ప్రశ్నించడానికి వెళుతున్నాం, పోలీసులు మాపై బుల్లెట్ల వర్షం కురిపించవచ్చు, కానీ ఆ జవాన్లు కూడా మా సోదరులే అని ఆయన అన్నారు. హర్యానాలో బిజెపి పాలిత ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రభుత్వం ఈ రాష్ట్రానన్ని కశ్శీరు లోయగా మార్చేశారని విమర్శించారు. హర్యానా ప్రభుత్వం 64 కంపెనీల పారామిలిటరీ సిబ్బందిని, పోలీసులను మోహరించింది. డ్రోన్ల ద్వారా రైతులపై బాష్పవాయు ప్రయోగం చేసింది. ఢిల్లీకి వచ్చే రహదారులన్నీ బారికేడ్లతో నిండిపోయాయి. ఢిల్లీకి వెళ్ళే హర్యానా జాతీయ రహదారి మొత్తం బ్యారికేడ్లతో నిండిపోయింది. ఢిల్లీలోకి ప్రవేశించే ప్రధాన ప్రాంతంవద్ద ఇనుక కంచెలతో పోలీసులు బ్యారికేట్లు నిర్మించారు. 2021లో రైతులు వ్యవసాయ బిల్లులనను ఉపసంహరించాలని కోరుతూ 16నెలలు ఉద్యమించినప్పుడు పోలీసులు ఏ విధంగా రహదార్లపై భారీ ఆటంకాలు సృష్టించారో అదేతరహాలో ఇప్పుడు కూడా బ్యారికేడ్లు, ఇనుప కంచెలు పెట్టారు. ప్రభుత్వం జెసిబి యంత్రాలతో సంచార సిమెంట్‌ గోడలను తరలించి ఢిల్లీకి వచ్చే రహదారులకు అడ్డంగా పెట్టి రెడీమిక్స్‌ వేసి వాటిని కదలకుండా బలమైన గోడల్లా మార్చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లో నెలరోజులపాటు 144వ సెక్షన్‌ విధించి రైతులపై అన్నివిధాలుగా అణచివేత కార్యక్రమాలకు సన్నద్ధమైంది. రైతుల సమస్యలు పరిష్కరించే ఆలోచన ప్రభుత్వానికి లేకపోగా పోలీసు బలగాలను మోహరించి యుద్ధం తరహాలో రైతులపై ఎదురుదాడికి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఐతే రైతులు కూడా ట్రాక్టర్లలో తమకు కావాల్సిన సామాగ్రినంతటినీ వెంట తెచ్చుకున్నారన్నది ప్రాథమిక సమాచారం. మంగళవారం ఉదయం పది గంటలకే రైతులు,మహిళలు పంజాబ్‌లోని ఫతేగర్‌ సాహిబ్‌ నుండి ట్రాక్టర్లపై బయలుదేరారు. సింఘు సరిహద్దుల్లో ర్యాపిడ్‌ యాక్షన్‌ఫోర్స్‌ను ఢిల్లీ పోలీసులు మోహరించారు. రైతులు చిన్న తప్పిదం చేసినాగానీ సహించేదిలేదని, వారికి ఎలాంటి అవకాశం ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. కాగా హర్యానాలోని అంబాలా సమీపంలో శంభు సరిహద్దులవద్ద నిరసన ప్రదర్శకులు రాళ్ళు రువ్వారన్న నెపంతో పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేశారు. హర్యానాలోని ఉభయరాష్ట్రాల సరిహద్దు జింద్‌ జిల్లాలో కూడా నిరసన ప్రదర్శకులపై బాష్పవాయు ప్రయోగం చేశారు. శంభు సమీపంలో అనేక గంటలుగా భద్రతా దళాలు, నిరసన ప్రదర్శకులమధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్నది. కొందరు నిరసన ప్రదర్శకులను నిర్బంధంలోకి తీసుకున్నట్లు హర్యానా పోలీసు వర్గాలు వెల్లడించాయి. రైతుల ట్రాక్టర్లతోపాటే మట్టితవ్వే భారీ తవ్వోడ ఎగ్జవేటర్స్‌)లు కూడా ఢిల్లీకి వస్తున్నాయి. బ్యారికేడ్లను ధ్వంసం చేసి ముందుకు ప్రయాణించడానికి వీలుగా ఈ ఎగ్జవేటర్లను వెంట తెస్తున్నట్లు అమృత్‌సర్‌కు చెందిన రైతు ఒకరు చెప్పారు. రైతులు రాళ్ళు విసిరితే బాష్పయు ప్రయోగం చేస్తామని పోలీసులు చెప్పారు. రైతులు సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే సహించబోమని భద్రతా దళాలు పేర్కొన్నాయి. ఐతే రైతు ప్రతినిధులతో చర్చల్లో పాల్గొన్న కేంద్ర వ్యవసాయమంత్రి అర్జున్‌ ముండా, ఆహార, వినియోగ వ్యవ పీయూశ్‌ గోయల్‌ పాల్గొన్నారు. చాలా విషయాల్లో ఏకాభిప్రాయం వచ్చిందని అర్జున్‌ ముండా చెప్పారు. ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇతర సమస్యలను పరిష్కరించేందుకు ఒక ఫార్ముళా ప్రతిపాదిస్తామని అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments