HomeNewsBreaking Newsడ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు

డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు

నిబంధనలు ఉల్లంఘించారో డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు

ట్రాఫిక్‌ నిబంధనలు కఠినతరం
‘నూతన స్క్రాపింగ్‌ పాలసీ’ అమలు
రూ.296 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్స్‌
రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
ప్రజాపక్షం/హైదరాబాద్‌
ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌ నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు చట్టాలను పకడ్బందీగా అమలు చేయనున్నామని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లఘించినవారు తిరిగి డ్రైవింగ్‌ లైసెన్సులు పొందే అవకాశం ఉండబోదని, నూతన వాహనాలు వారి పేరు మీద కొనుగోలు చేసుకునే వెసులుబాటు కూడా ఉండబోదని హెచ్చరించారు. రాష్ట్రంలో ‘నూతన స్క్రాపింగ్‌ పాలసీ’ని అమలు చేస్తున్నామని, వాహనాల స్క్రాపింగ్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు రాయితీలు ఇస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘సారథి వాహన్‌ పోర్టల్‌’లో చేరబోతున్నామని వివరించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌, రవాణ శాఖ కమిషనర్‌ ఇలంబర్తి తదితరులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రాఫిక్‌ నిబంధనల పట్ల విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పిస్తామని, దీనికి సంబంధించి మ్యాథ్స్‌ సబ్జెక్ట్‌లో నిబంధనలను పొందుపర్చాలని కోరారు. ఎవరినో వేధించాలన్నదే తమ ఉద్దేశం కాదని, ప్రమాదాల భారి నుంచి ప్రజలను కాపాడడమే తమ లక్ష్యమన్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా సంవత్సరానికి ఒక లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక నిబంధనలు తీసుకొస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటి వరకు 8 వేల లైసెన్స్‌లను రద్దు చేసినట్టు వివరించారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయకుండా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ వాహనాలు, ఆర్‌టిసి బస్సులు, టూ వీలర్స్‌, ఫోర్‌ వీలర్స్‌ వాహనాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు. త్వరలోనే కొత్తగా 113 మంది వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ల భర్తీ చేయబోతున్నామన్నారు. జిహెచ్‌ఎంసి ఉన్న వాహనాలు ఏదైనా నిబంధనలు పాటించాల్సిందేనని, ప్రభుత్వ వాహనాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయని వివరిచంఆరు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన రవాణా శాఖ అంశాలు ఇరు రాష్ట్రాల అధికారులు చర్చిస్తారన్నారు. కర్నాటక,మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీలు అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేసేలా జిఒ 28ను జారీ చేశామని పొన్నం వివరించారు.
రూ.296 కోట్లతో ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్స్‌
వాహనాల ఫిట్‌నెస్‌ చెకింగ్‌ నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాకు ఒక్కటి, హైదరాబాద్‌ జిల్లాకు నాలుగు చొప్పున మొత్తం 37 ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్టు పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. ఒక్క స్టేషన్‌కు రూ.8 కోట్ల చొప్పున మొత్తం రూ.296 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. వచ్చే నెలలో రహదారులభద్రత వారోతస్సవాలను ఈ సారి నెల రోజుల పాటు నిర్వహించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు.
స్వచ్ఛందగా స్క్రాపింగ్‌ చేస్తే జీవిత ట్యాక్స్‌లో రాయితీ: ఇలంబర్తి
రవాణ శాఖ కమిషనర్‌ ఇలంబర్తి మాట్లాడుతూ 15 సంవత్సరాలు నిండిన వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాపింగ్‌ చేస్తే జీవిత ట్యాక్స్‌లో ఫీజు రాయితీ ఉంటుందని వెల్లడించారు. స్క్రాపింగ్‌ జరిగిన రెండు సంవత్సరాల వరకు ఎప్పుడు కొత్త వాహనం కొనుగోలు చేసినా, అందులో జీవిత ట్యాక్స్‌లో ఫీజు రాయితీ ఉంటుందన్నారు. పాత బకాయిలు ఉన్నా వాహనం స్క్రాప్‌కు వెళ్తే, వన్‌ టైమ్‌సెటిల్‌మెంట్‌ చేసేలా అవకాశం కల్పించామని వివరించారు. ప్రభుత్వ వాహనాల ప్రకారం సెక్షన్‌ 52ఎ ప్రకారం రెన్యువల్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ చేయమన్నారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాప్‌కు పంపించకుండా మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే అదనంగా టాక్స్‌ కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలకు 8 సంవత్సరాల లోపు ప్రతి సంవత్సరం/త్రైమాసిక పన్నుపై పది శాతం రాయితీ ఇస్తామన్నారు.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments