ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత
20 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు
49 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం
తేమ శాతం పెరగడంతో భగభగ
ప్రజాపక్షం/ హైదరాబాద్: ఆదిలాబాద్‌లో సోమవారం 45.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. మే నెలకు ముందే రాష్ట్రంలో ఇంతటి అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం కలవరపరుస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను పెను తుపానుగా మారనుండడంతో మంగళవారం రాష్ట్రంలో అక్కడక్క డా ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి, ఓమోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో ఐదు రోజుల పాటు పొడి వాతావరణం నెలకొనడంతో ఎండలు మరింత ముదరనున్నాయి. ఈ సారి వేసవిలో దేశంలోనే తెలంగాణ డేంజర్ జోన్ లో ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఈ సారి ఎండలు జూన్ నెలాఖరు వరకు ఠారెత్తించనున్నాయి. ఆదిలాబాద్, భద్రాచలంలతో పాటు మరి కొన్ని చోట్ల ఈ వేసవిలో 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తాజా గా హెచ్చరించింది. రాజధాని హైదరాబాద్ కూ డా గతంలో కనీవినీ ఎరుగని ఎండ వేడిని ఎదుర్కోబోతోంది. ఇక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత ఈ వేసవిలో 47 డిగ్రీల వరకు చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పు ల కారణంగా వడగాల్పులు వీచే రోజుల సంఖ్య ఈ సారి పెరగనుంది. 2016లో రాష్ట్రంలో మొత్తం వేసవిలో 27 రోజుల పాటు వడగాల్పులు వీచాయి. ఇదే ఇప్పటి వరకు ఉన్న గరిష్ఠ రోజుల సంఖ్య. అయితే ఈసారి ఈ రికార్డు స్థాయికి చేరుకోకపోయినా దాదాపు 20 రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. వడగాల్పుల కారణంగా 2015లో రాష్ట్రంలో అత్యధికంగా 541 మంది చనిపోయారు. ఈసారి ఎండతో పాటు భగభగ మంటలు ఎక్కువయ్యాయి. దీనికి కారణం వాతావరణంలో తేమ శాతం పెరగడమేనని అధికారులు చెబుతున్నారు. గాలిలో తేమ శాతం ఎంత పెరిగితే ఎండ తీవ్రత అంతగా ఉంటుంది. గాలిలో తేమ శాతం 75 ఉంటే నమోదైన ఉష్ణోగ్రత కంటే దాదాపు 15 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైతే ఎంత ఎండ తీవ్రత ఉంటుందో అంత ఉంటుందని అధికారులు తెలిపారు.