ఎన్నో సందేహాలు మిగిల్చిన ఇసి పనితీరు : సురవరం సుధాకరరెడ్డి
న్యూఢిల్లీ: భారత ఎన్నికల కమిషన్ భ్రష్టుపట్టిపోయిందని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి విమర్శించారు. ఇది డెమోక్రసీనా? మోడీక్రసీనా అని ట్విటర్ వేదికగా నిలదీశారు. “2019 ఎన్నికలు ప్రజాస్వామ్య ఎన్నికలకు మాత్రమే కాకుండా భారత ప్రజాస్వామ్యానికి ముగింపును ఇవ్వవచ్చు. ప్రస్తుతమున్న ఒక ఎన్నికల కమిషనర్‌తోపాటు మాజీ ఎన్నికల కమిషనర్లు ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నో సందేహాలు లేవనెత్తారు. అయినప్పటికీ, ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలో మెజారిటీ సభ్యులు డెమోక్రసీ (ప్రజాస్వామ్యం) కన్నా మోడీక్రసీకే అండగా నిలిచారు” అని సురవరం ట్వీట్ చేశారు. అలాగే ఎగ్జిట్ పోల్స్ బూటకమని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. “ఎగ్జిట్ పోల్స్ ప్రజల మనోభావాలకు ప్రతిబింబిస్తున్నాయా? లేక ఇవిఎంల కోసం రూపొందించబడ్డాయా? ఉత్తరాఖండ్‌లో ఆప్‌కు 2.9 శాతం ఓటింగ్ వాటా వస్తుందని టైమ్స్‌నౌ పేర్కొంది. కానీ ఆప్ అసలక్కడ పోటీనే చేయలేదు. ఇంకో విచిత్రమేమిటంటే, పంజాబ్‌లో బిజెపికి నాలుగు స్థానాలు వస్తాయని ఆజ్‌తక్ తన ఎగ్జిట్ పోల్స్‌లో పేర్కొంది. కానీ బిజెపి పంజాబ్‌లో కేవలం మూడు స్థానాల్లోనే పోటీచేసింది. బీహార్‌లో ఎల్‌జెపికి 5 నుంచి 7 స్థానాలు లభిస్తాయని న్యూస్18 పేర్కొంది. కానీ ఎల్‌జెపి అక్కడ 6 స్థానాల్లోనే పోటీచేసింది. ఈ ఎగ్జిట్ పోల్స్ దేన్ని ప్రతిబింబిస్తున్నట్లు?” అని సురవరం ట్వీట్ చేశారు.