చర్చలకు పిలిస్తే…సిద్ధమే
26 డిమాండ్ల సాధ్యాసాధ్యాలపై చర్చించాలి
సిఎం బెదిరింపులకు చేరింది 11 మందే : మళ్లీ ఆరుగురు సమ్మెలోకి వచ్చారు.
మొక్కవోని దీక్షతో ఉన్న కార్మికులకు ధన్యవాదాలు
నేడు మానవహారాలు, రేపు డిపోల ఎదుట కుటుంబ సభ్యులతో నిరసనలు
మీడియా సమావేశంలో జెఎసి నేతలు
హైదరాబాద్ : “చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. 50 వేల మంది కార్మికుల కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లటానికి సిద్ధంగా ఉన్నాం. 26 డిమాండ్ల పరిష్కారంపై సాధ్యాసాధ్యాలపై కూర్చుని మాట్లాడుకుందాం” అని ఆర్‌టిసి జెఎసి కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి (టిఎమ్‌యు), కోకన్వీనర్ కె.రాజిరెడ్డి (ఎంప్లాయీస్ యూనియన్), సుధ (సూపర్‌వైజర్ల సంఘం), నేతలు లింగమూర్తి(ఎస్‌డబ్ల్యుఎఫ్) అన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వారు మీడియాతో సోమవారం మాట్లాడారు. కార్మికులందరూ మొక్కవోని దీక్షతో ఐక్యగా సమ్మెలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సిఎం డెడ్‌లైన్‌కు భయపడేటోళ్లు ఎవ్వరూ లేరనీ, బెదిరింపులకు భయపడి బలవంతంగా 11 మంది విధుల్లో చేరితే మళ్లీ ఆరుగురు సమ్మెలోకి తిరిగి వచ్చారని వారు తెలిపారు. ఆర్‌టిసి కార్మికులంతా తన కుటుంబ సభ్యుల్లాంటి వారు అంటున్న సిఎం.. చర్చలకు ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. తమ సమ్మెకు రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయే తప్ప తమ వెనుక ఏ పార్టీ లేవని స్పష్టం చేశారు. షరతుల మధ్య చర్చలు ఉండొద్దని అభిప్రాయపడ్డారు. అశ్వద్ధామరెడ్డి మాట్లాడుతూ మానసిక ఒత్తిళ్లతో, మనోవేదనతో రోజూ కార్మికులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులెవ్వరూ మనోధైర్యం కోల్పోవద్దని, హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. మంగళవారం నాడు అన్ని డిపోల ఎదుట మానవహారాలు నిర్వహించనున్నామని, విధుల్లోకి వచ్చి తమ పొట్టకొట్టవద్దని తాత్కాలిక డ్రైవర్లకు, కండక్టర్లకు విన్నపాలు చేస్తామని తెలిపారు. బుధవారం నాడు అన్ని డిపోల ఎదుట ఆర్‌టిసి కార్మికులు తమ కుటుంబ సభ్యులతో ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. ఏడో తేదీన అన్ని మండల కేంద్రాల్లోనూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాజిరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన, 9న చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంపై చర్చించేందుకు మంగళవారం ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో జెఎసి భేటీ అవుతుందని, దీనికి రాజకీయ పార్టీలను కూడా పిలిచామని వివరించారు. తెలంగాణలోని ఆర్‌టిసి ఆస్తులపై తమకూ హక్కు ఉంటుందంటూ ఎపిలో ఆర్‌టిసి నేతలు ఆశలుపెట్టుకోవద్దనీ, ఇక్కడి ఆస్తులు తెలంగాణకే చెందుతాయని స్పష్టం చేశారు. బస్‌భవవన్ ఒక్కటే ఉమ్మడి ఆస్తి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు పిలుపు రాలేదనీ, వస్తే తప్పకుండా వెళ్తామని రాజిరెడ్డి, అశ్వద్ధామరెడ్డి తెలిపారు.
డెడ్‌లైన్లకు భయపడం
RELATED ARTICLES