HomeNewsBreaking Newsడెడ్‌లైన్‌ 60 రోజులు

డెడ్‌లైన్‌ 60 రోజులు


కొత్త ఉద్యోగంలో చేరకుంటే స్వదేశానికి వెళ్లాల్సిందే

అమెరికాలో భారీగా ఐటి కొలువుల కోతలు
రెండుమూడు నెలల్లో రెండు లక్షల ఉద్యోగుల తొలగింపు
అందులో 40 శాతం మంది భారతీయులే

న్యూఢిల్లీ : గడచిన ఆరునెలలుగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం సహా వివిధ కంపెనీల్లో కొనసాగుతున్న తొలిగింపు చర్యల కారణంగా అమెరికాలో వేలాదిమంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటివరకూ సుమారు రెండు లక్షలమందిని ఉద్యోగాల్లోంచి తొలగించగా, వీరిలో 40 శాతంమంది భారతీయులే ఉన్నారు. వీరంతా ప్రస్తుతం అగమ్యగోచర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వీరందరూ అమెరికాలో తమ జీవనం కొనసాగించాలంటే కేవలం 60 రోజులు మాత్రమే డెడ్‌లైన్‌ ఉంది. ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ నిపుణులు తిరిగి 60 రోజుల వ్యవధిలో కొత్త ఉద్యోగాలు వెతుక్కుని సెటిల్‌ అవ్వకపోతే అమెరికాలో ఉండే అర్హత కోల్పోతారు. అలాంటి వారంతా తిరిగి సదేశాలకు వెళ్ళిపోవాల్సిందే. ఈ పరిస్థితుల్లో తీవ్ర మానసిక సంఘర్షణలో నలిగిపోతున్న భారతీయులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. ఇప్పటికే ఓ మోస్తరుగా అమెరికాలో స్థిరపడి ఐటీ ఉద్యోగులు, సరికొత్త ఆశలు నింపుకుని ఇటీవలి నెలల్లో ఆమెరికా వెళ్ళి ఉద్యోగాల్లో చేరినయువతీ యువకులు సందిగ్ధంలో పడిపోయారు. వారి బిడ్డల కెరీర్‌, వారి చదువులు అర్థాంతరంగా సంక్షోభంలో పడిపోవడంతో భారతీయులకు ఊరట కలిగించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భారత్‌ అనుకూల పారిశ్రామిక వర్గాలు విజ్ఞప్తులు చేస్తున్నాయి. వాషింగ్టన్‌ పోస్ట్‌ ప్రచురించిన కథనం ప్రకారం, ఈ విధంగా ఉద్యోగాలు కోల్పోయిన రెండు లక్షలమందిలో భారతీయులే గణనీయంగా ఉన్నారు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ సంస్థలు ఇటీవలికాలంలో భారీగా లే ఆఫ్‌లు ప్రకటించాయి. ఈ సంక్షోభంలో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో హెచ్‌ 1 బి, ఎల్‌ 1 వీసాలపై అమెరికా వెళ్ళినవారే ఎకువమంది ఉన్నారు. హెచ్‌ 1 బి అనేది వలస యేతర వీసా. ఈ వీసా ద్వారా కంపెనీలు విదేశీ ఉద్యోగులను ప్రత్యేక కేటగిరీ కింద ఉద్యోగాల్లో నియమిస్తాయి. వీరందరికీ సైద్ధాంతికపరమైన, సాంకేతిక పరమైన నైపుణ్యం ఉండటమే దీనికి కారణం. టెక్నాలజీ కంపెనీలు దీనిపై ఆధారపడే ముఖ్యంగా భారత్‌, చైనాల నుండి వేలాదిమందిని ప్రతి ఏడాదీ రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. ఎల్‌ 1 ఎల్‌ 1 బి వీసాలు తాత్కాలికంగా కంపెనీల మధ్య బదిలీలకు దోహదం చేసస్తాయి. ఇలాంటివారంతా మేనేజీరియల్‌ స్థాయిలో ప్రత్యేక విజ్ఞానంతో బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే చాలా భారీ సంఖ్యలో అమెరికాలో నాన్‌ ఇమ్మ్గిగ్రెంట్‌ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వారంతా ఇప్పుడు కొత్త అవకాశాలకోసం వెతుక్కుంటున్నారు. కొత్త ఉద్యోగాల కోసం భారతీయులమధ్యే భారీ పోటీ ఏర్పడింది. నిర్దేశిత గడువులో వారు కొత్త ఉద్యోగాల్లోకి వెళ్ళాలి. ఉద్యోగాలు కోల్పోయాక వారు తమ వీసాలను నిర్దేశిత గడుపులోపు మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు అమెజాన్‌లో పనిచేసే గీత (పేరు మార్చారు) మూడు నెలల క్రితం అమెరికా వెళ్ళి ఉద్యోగంలో చేరింది. ఈ వారంలో ఆమెకు పింక్‌ స్లిప్పు ఇచ్చారు. “మార్చి 20 వ తేదీ మీ చివరి పనిదినం” అని కంపెనీ వెల్లడించింది. కేవలం మూడే మూడు నెలల్లో అమెరికాలో ఐటీ ఉద్యోగుల పరిస్థితి చాలా దుర్భరంగా మారిపోయింది. కొత్త ఉద్యోగాలు వెతుక్కోకపోతే ఇంటి అద్దె కూడా కట్టుకోలేరు. ఉన్న గడువు కూడా చాలా తక్కువ. పైగా విపరీతమైన పోటీ ఉంది. చాలామంది భారతదేశానికి తిరిగి రాక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అన్ని ఐటీ కంపెనీలూ ఉద్యోగులను తొలగిస్తున్నాయే తప్ప రిక్రూట్‌మెంట్లు చేసుకోవడం లేదు.వడ్డీరేట్ల పెరుగుదల వల్ల బ్యాంకుల్లో చేసిన అప్పులు ఐటీ కంపెనీలకు పెనుభారంగా మారిపోవడంతో ఖర్చులు తగ్గించుకునే సాకుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీత (పేరు మార్పు) ఉద్యోగం కూడా పోయింది. ఆమె హెచ్‌ 1 బి వీసాపై అమెరికా వెళ్ళిన ఐటీ నిపుణురాలు. ఆమె మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నారు. జనవరి 18న ఆమె ఉద్యోగం కోల్పోయారు. ఆమె ఒంటరి తల్లి. ఆమె కుమారుడు హైస్కూలు చదువుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆమె ఉద్యోగం కోల్పోయారు. “ఇది మాకు మనుగడ సమస్యగా మారింది, పరాయిదేశంలో ఏ చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది” అని ఆమె ఆవేదన చెందుతున్నారు. “వేలాదిమంది ఈ విధంగా ఒకేసారి భారతీయ నిపుణులు ఉద్యోగాలు కోల్పోవడం విచారకరం, ప్రత్యేకించి హెచ్‌ 1 బి వీసా వారికి ఇలా జరిగింది, వారు సవాళ్ళు తట్టుకుని నిలబడాలంటే వారికి ఏదైనా అదనపు అవకాశాలు ఇవ్వాలి, కొత్త ఉద్యోగాలు సంపాదించుకునే వరకూ రిస్కు నుండి బయట పడేవరకూ ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి” అని సిలికాన్‌ వ్యాలీ కేంద్రంగా పనిచేస్తున్న పారిశ్రామికవేత్త, భారత కమ్యూనిటీ నాయకుడు అజయ్‌ జైన్‌ భుటోరియా అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. “ఇవన్నీ విధ్వంసకరమైన పరిస్థితులు, కుటుంబాలు అతలాకుతలం అయిపోతున్నాయి, భారత్‌లో కూడా మేం పొదుపు చేసిన సొమ్ముతో మా తల్లిదండ్రులను పోషించుకోవాల్సిన అవసరం ఉంది, చాలా ఇఎంఐలు చెల్లించుకోవాల్సిన ఊబిలో ఉన్నారు, నిజంగా ఇది సంక్లిష్ట సమయమే” అని భుటోరియా అన్నారు. అదేవిధంగా గ్లోబల్‌ ఇండియా టెక్నాలజీ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (జిఐటిపిఆర్‌ఓ), ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా, ఇండియన్‌ డయాస్ఫోరా స్టడీస్‌ (ఎఫ్‌ఐఐడిఎస్‌)లు రంగంలోకి దిగి ఐటీ నిపుణులకు న్యాయం చేసేందుకు, వారికి రక్షణ కల్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. లే ఆఫ్‌ల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి సాధ్యమైనంత వరకూ 60 రోజుల్లో తిరిగి ఏదైనా మరో ఉద్యోగం లభించేవిధంగా సహాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments