సికింద్రాబాద్‌లో మరో బాలుడు మృతి
రోగులతో ఆసుపత్రులు కిటకిట
సిటీబ్యూరో : హైదరాబాద్ నగరాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. గత నెల రోజులుగా డెంగీ బారినపడి నగర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ దాదాపు 40 మంది మృత్యువాత పడినట్లు సమాచారం. మృతి చెందిన వారిలో చిన్నారుల సంఖ్య అధికంగా ఉంది. గ్రేటర్ పరిధిలో చూస్తే డెంగీ బాధితుల సంఖ్య మరి ఎక్కువగా ఉంది. తాజాగా సికింద్రాబాద్, బాలంరాయిలోని గీతాంజలి పాఠశాలలో దాదాపు 20 మంది డెంగీ బారిన పడినట్లు తెలిసింది. అందులో 13ఏళ్ల విద్యార్థి బిన్‌సిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాఠశాల ఆవరణలో అపరిశుభ్రత కారణంగా దోమ లు అధికమై విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని పాఠశాల ముందు విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే కుత్భుల్లాపూర్, రోడామేస్త్రీనగర్‌కు చెందిన 9 నెలల బాలుడు షేక్ మహ్మద్ ముజ్తబా డెంగీ బారినపడి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఇటీవలే శంభీపూర్‌కు చెందిన బి.నందిక, రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని పంచశీల కాలనీకి చెందిన దర్శిని, మధీనగూడలో ఐదోతరగతి చదువుతున్న 10ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డారు. కాలనీల్లో అపరిశుభ్రత కారణంగా డెంగీ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వెయ్యికి పైగా డెంగీ,మలేరియా లక్షణాలతో చికిత్స పొం దుతున్నట్లు అధికారవర్గాల నుంచి తెలిసింది. రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు : వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారితో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. చికిత్స పొందుతున్న వారిలో ప్రధానంగా మలేరియా, డెంగీ లక్షణాలు ఉన్న వారే అధికంగా ఉన్నారు. ఫీవర్, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌లతో పాటు తదితర ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ కేసులు అధికమయ్యాయి. గత నెలరోజులుగా గ్రేటర్ పరిధిలో దాదాపు 400 మందికిపైగా డెంగీ బారినపడినట్లు తెలిసింది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలు రోగాల బారినపడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
డెంగీతో వణుకుతున్న మహా నగరం
RELATED ARTICLES