ఆ తర్వాత తదుపరి నిర్ణయం
రైతుల ఆందోళనలపై ఎస్‌కెఎం నేతల ప్రకటన
వెనుకడుగు వేసేదిలేదన్న తికాయత్
అలహాబాద్: వ్యవసాయ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు సాగు చట్టాలను రద్దు చేసే వరకూ ఆందోళనను కొనసాగించేందుకు రైతులు కృతనిశ్చయంతో ఉన్నారు. డిసెంబర్ వర కూ పోరు ఆగదని, ఆ తర్వాత తదుపరి నిర్ణ యం తీసుకుంటామని 40కిపైగా ఉన్న రైతు సంఘాలకు నేతృత్వం వహిస్తున్న సం యుక్త్ కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) నేతలు ప్రకటించారు. మూడున్నర నెలలుగా జరుగుతున్న ఈ రైతు ఉద్యమం మరో తొమ్మిదినెలలపాటు కొనసాగుతాయని మోర్చా నేతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహాపంచాయత్‌లు నిర్వహించి, బిజెపికి ఓటు వేయవద్దంటూ ప్రచారం చేసిన వారు ఇక్కడికి చేరుకున్న తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ రైతుల ఆందోళన నవంబరు లేదా డిసెంబరు వరకూ కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్నదని అన్నారు. సాగు చట్టాల రద్దునే తాము కోరుతున్నామని, వాయిదాను కాదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆ మూడు చట్టాలను కేంద్రం రద్దు చేయకపోతే, తదుపరి కార్యాచరణను ఖరారు చేసుకుంటామని తెలిపారు. బెంగాల్ పర్యటన గురించి చెబుతూ, విందు భోజనాలకు వీలుగా మంచి రుచికరమైన బియ్యాన్ని తమకు సరఫరా చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నవారు కోరారని నవులమధ్య చెప్పారు. ఆహార ధాన్యాలు కొనేవారికి ధాన్యం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) క్వింటాలుకు 1,850 రూపాయలుగా నిర్దేశించాల్సిందిగా బెంగాల్ రైతులకు తాము సలహా ఇచ్చామన్నారు. కాగా, దేశవ్యాప్తంగా పండించే వివిధ పంటలకు కనీస మద్దతు ధరలు లభించేలా ఒక చట్టాన్ని సాధించేందుకు దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ తాము పర్యటించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ (బికెఎం) నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. బీహార్‌లో ధాన్యం కొనుగోలు చేస్తున్న రైతులు అత్యంత కనిష్టంగా క్వింటాలుకు 750 రూపాయలనుండి 800 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆహార ధాన్యాల కనీస మద్దతు ధరకుచట్టపరమైన రక్షణ ఉండాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తాము ఢిల్లీలో కూర్చోబోమని, దేశవ్యాప్తంగా రైతుల పంటల కనీసం మద్దతు ధరల గురించి పర్యటించేందుకు ప్రణాళిక చేస్తున్నామని అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 17వ తేదీ వరకు, ఘాజీపూర్ వద్ద సరిహద్దుల్లో 18న, ఒడిశాలో 19న, కర్ణాటకలో 21,22 తేదీల్లో పర్యటిస్తానన్నారు. కాగా అలహాబాద్ సమీపంలో ఉన్న ఝాల్వాలోని తికాయత్ పార్కులో ఉన్న తన తండ్రి మహేంద్ర తికాయత్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
డిసెంబరు వరకూ పోరు
RELATED ARTICLES