ఎన్నికల సంఘానికి సిపిఐ సహా 9 పార్టీల వినతి
ప్రజాపక్షం/న్యూఢిల్లీ : రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో డిజిటల్ ఎన్నికల ప్రచారానికి అనుమితివ్వాలని భారత ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని 9 పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ మేరకు సిపిఐతో సహా ఆ పార్టీలు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి)కి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. డిజిటల్ ఎన్నికల ప్రచారాన్ని వ్యతిరేకించిన పార్టీల్లో సిపిఐ, సిపిఐ(ఎం), కాంగ్రెస్, ఆర్‌జెడి, సిపిఐ(ఎంఎల్), ఆర్‌ఎల్‌ఎస్‌పి, విఐపి, హెచ్‌ఎఎం, ఎల్‌జెడిలు ఉన్నాయి. బీహార్‌లో తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం నెలకొన్నదని, ఇది పరిస్థితి మరింత విషమించే ప్రమాదముందని ఆ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. అదే సమయంలో భౌతిక ప్రచారాన్ని నిషేధించి, డిజిటల్ ఎన్నికల ప్రచారానికి మాత్రమే అవకాశం ఇస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ అవుతుందని పేర్కొన్నాయి. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నివేదిక ప్రకారం, సగం మంది ప్రజల వద్ద మొబైల్ ఫోన్లు లేవని, అలాగే కేవలం 34 శాతం మంది వద్దనే స్మార్ట్‌ఫోన్లు వున్నాయని తెలిపాయి. ఇంటర్నెట్ కనెక్షన్ అందరికీ లేదన్న విషయాన్ని గమనించాలని సూచించాయి. డిజిటల్ ఎన్నికల ప్రచారానికి మాత్రమే అనుమతినిస్తే, మూడింట్ రెండువంతుల మంది ఓటర్లు ఈ ఎన్నికల ప్రక్రియకు దూరంగా వుండిపోయే ప్రమాదం వుందని ఆ పార్టీలు అభిప్రాయపడ్డాయి. పైగా ఈ విధానం పాలక పార్టీకి అనుకూలంగా వుందని తెలిపాయి. అంతేగాకుండా వర్చువల్ రాజకీయ ప్రచారానికి వ్యయపరిమితిని నిర్ధారించడం సాధ్యమా అని ప్రశ్నించాయి. ఓటర్లంతా ఎన్నికల్లో పాల్గొనే విధంగా చేయడం, ఎన్నికలు న్యాయబద్ధంగా, సజావుగా, స్వేచ్ఛగా నిర్వహించడం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత అని, కానీ కొత్త ప్రతిపాదన పౌరుల హక్కులపై ప్రభావం చూపుతుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులందరి మధ్య సమాన పోటీకి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రజల ఆరోగ్యంతోపాటు ప్రజాస్వామ్య పవిత్రను కాపాడటంలో ఏ మాత్రం రాజీపడవద్దని సిఇసికి తొమ్మిది పార్టీలు కోరాయి.
డిజిటల్ ఎన్నికల ప్రచారమొద్దు!
RELATED ARTICLES