24 మందికి యావజ్జీవ కారాగార శిక్ష
తెలుగు పోలీస్ ఉన్నతాధికారి దర్యాప్తుతో అసోంకోర్టు సంచలన తీర్పు
గువహటి : అసోం రాష్ట్రం జోర్‌హట్ జిల్లా సెషన్స్ కోర్టు అక్టోబర్ 20న వెలువరించిన ఒక తీర్పు దేశంలోనే సంచలనం కలిగించింది. ఒక డాక్టరును మూక హత్య చేసిన కేసులో ప్రధాన ముద్దాయికి ఉరి శిక్ష వేయగా, మరో 24 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దేశ న్యాయ చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో నిందితులకు యావజ్జీవ శిక్షలు పడటం ఇదే ప్రథమం చెబుతున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారి జోర్హట్ రేంజ్ డిఐజిగా పని చేస్తుస్తున్న డా. జివి శివ ప్రసాద్ ఒక తెలుగు వ్యక్తి కావడం గమనార్హం. కేవలం 22 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయడం కూడా విశేషం. కేసు వివరాల్లోకి వెళితే… త్యోక్ టీ ఎస్టేట్‌లో డా. దేబెన్ దత్తా (73) మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. 2019, ఆగస్ట్ 31న ఒక ఎస్టేట్ వర్కర్‌కు చికిత్స అందించడంలో జాప్యం జరిగిందంటూ ఎస్టేట్‌లోని తేయాకు కార్మికు లు ఆరోపించారు. మూకుమ్మడిగా మారణాయుధాలతో దేబెన్ దత్తాపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన దత్తాను మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మరణించారు. దత్తా గత 40 ఏళ్లుగా అదే టీ ఎస్టేట్‌లో వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్యునిపై జరిగిన మూక హత్యపై అసోం సమాజంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చెలరేగాయి. మూక హత్య కేసు పై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కూడా జరిగింది. హత్యకు నిరసనగా ఇతర టీ ఎస్టేట్ లలో పని చేసే కొందరు వైద్యులు తమ ఉద్యోగాలకు రాజీనామా కూడా చేశారు. ఇదో పెద్ద సమస్యగా మారింది. దాంతో జోర్హట్ డిఐజి శివ ప్రసాద్ స్వయంగా రంగంలోకి దిగి కేసు దర్యాప్తును చేపట్టారు. తన పర్యవేక్షణలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. తొలి మూడు రోజుల దర్యాప్తులోనే 22 మంది సబ్ ఇన్స్పెక్టర్‌లు భాగస్తులయ్యారు. 60 మంది ప్రత్యక్ష సాక్షుల నుండి వాంగ్ములాలను వీడియో రికార్డింగ్ చేశారు. సాక్ష్యాలన్నిటినీ మేజస్ట్రెట్ ఎదుట నమోదు చేయించారు. సి.సి.కెమెరాల ఫుటేజీను సేకరించారు. ఘటన జరిగిన కేవలం 22 రోజుల్లోనే 602 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 32 మందిని కేసులో నిందితులుగా పేర్కొన్నారు. అందులో ఒకరు మృతి చెందగా మిగిలిన 31 మంది పై విచారణ కొనసాగింది. ఏడాది వ్యవధిలో విచారణ పూర్తి చేసిన కోర్టు 2020, అక్టోబర్ 20న తీర్పు వెలువరించింది. ఒకరికి ఉరి శిక్ష, 24 మందికి యావజ్జీవ శిక్ష పడింది. ఆరుగురిని నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. శివ ప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన వారు. ఆయన తండ్రి నారాయణ పురం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేశారు. అగ్రికల్చరల్ ఎమ్మెస్సీ చేసిన శివ ప్రసాద్ న్యూఢిల్లీ లో పిహెచ్‌డి చేస్తూ సివిల్స్ రాశారు. ఐపిఎస్‌కు ఎంపికై అసోం మేఘాలయ కేడర్‌లో జాయిన్ అయ్యారు. అసోంలోని బార్‌పెట్, దరాంగ్, నార్త్ కచార్, కర్బి అంగ్ లాంగ్, వంటి జిల్లాలో ఎస్‌పిగా పని చేశారు. అసోంలో పెరుగుతున్న నేరాల సంఖ్యను అదుపు చేయడంలో కొన్ని ప్రత్యేక పద్ధతులను రూపొందించిన శివ ప్రసాద్‌కు ప్రభుత్వంలో మంచి గుర్తింపు వచ్చింది. తాను పని చేసిన జిల్లాల్లో నమోదైన కేసులో శిక్షలు పడే శాతాన్ని పెంచడంలో డా.శివ ప్రసాద్ విశేష కృషి చేస్తున్నారు. మూక హత్యలకు సంబంధించిన ఒక కేసులో గతంలో 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడేటట్లుగా ఆయన కృషి చేశారు. మరో మూక హత్య కేసులో విచారణ ముగింపు దశలో ఉంది. మతోన్మాదుల గుండెల్లో ఆయన రైళ్లు పరిగెట్టించారు. మత ఘర్షణల సందర్భాలలో నేరస్తులకు శిక్షలు పడేవిధంగా పకడ్బందీగా సాక్ష్యాధారాలను సేకరించే పద్ధతులను ఆయన ప్రవేశ పెట్టారు. ఆయన ఎస్‌పిగా పని చేసిన ఒక జిల్లాలో మత ఘర్షణల కేసుల్లో వెయ్యి మందికి పైగా శిక్షలు పడ్డాయి. డా.శివ ప్రసాద్ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని, నిర్భీతి, నిజాయితీతో పని చేస్తారన్న పేరు పొందారు. ఒక తెలుగు వ్యక్తి అసోంలో పోలీస్ శాఖలో తన కృషితో సంచలన విజయాలు సాధించడం విశేషం.
డి.సోమ సుందర్ (సీనియర్ జర్నలిస్ట్)
డాక్టరు మూక హత్య కేసులో ఒకరికి ఉరి
RELATED ARTICLES