ప్రజాపక్షం/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మొద టి సారిగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగం, ప్రలోభాలకు పాల్పడినా వాటిని అరికట్టడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలమయ్యిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మఖ్దూంభవన్‌లో సోమవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఓటుకు వేల రూపాయలు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని, ఓటరు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారని పేర్కొన్నారు. ఇతర పార్టీల నుండి గెలుపొందిన కౌన్సిలర్లను, కార్పోరేటర్లను సైతం అధికార పార్టీ తమ అంగబలం, ఆర్థిక బలం, ఎంఎల్ఎ, ఎంపిల ఎక్స్అఫిషియో పేరుతో అధికార బలాన్ని పూర్తిగా వినియోగించుకొని తమ వైపు మళ్ళించుకొని హంగ్ ఏర్పడ్డ చోట ఛైర్మన్, మేయర్ పదవులను కైవసం చేసుకున్నారని ఇది ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమేనని విమర్శించారు. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి ధనస్వామ్యం గెలవడం అప్రజాస్వామ్య ప్రక్రియకు పరాకాష్ట అని అన్నారు. పెన్ష న్ దారులకు గత రెండు నెలల నుండి పెన్షన్లు రావడం లేదని, రబీ సీజన్ అయిపోతున్నా రైతులకు రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్లో వేయడం లేదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పౌరహక్కులు, నిర్బంధాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయని విమర్శించారు. బిజెపి నెతృత్వం లో సిఎఎ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ తెచ్చి పౌరహక్కులు కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాడాలన్నారు.
సిఎఎపై కెసిఆర్ అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నాం : బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టా న్ని వ్యతిరేకిస్తామని, అసెంబ్లీలో ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తామని, ఈ చట్టానికి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను సిపిఐ స్వాగతిస్తోందని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
22 నుండి సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర నిర్మాణ మహాసభలు ఫిబ్రవరి 22 నుండి 25 వరకు మంచిర్యాలలో జరుగుతాయని చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర నిర్మాణ మహాసభలకు ముందు మిగిలి ఉన్న జిల్లా నిర్మాణ మహాసభలను పూర్తి చేయాలని ఆయా జిల్లా నాయకత్వానికి సూచించారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక నిర్మాణ బలోపేతానికి ప్రత్యేకంగా కృషి చేయాలని, అన్ని జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడానికి సిపిఐ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీ జ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ, టి. శ్రీనివాస్ రావు, ఎన్ బాలమల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
డబ్బు, మద్యం ప్రలోభాలను నివారించడంలో ఎన్నికల కమిషన్ విఫలం
RELATED ARTICLES