పల్లె ఫలితాన్ని శాసిస్తున్న నగదు పంపిణీ
ఓటు కోసం వెండి గిన్నెలు, ప్రెషర్ కుక్కర్లు
3వ విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు ధర రూ.3వేల పైమాటే
మచ్చుకైనా కానరాని పరిశీలకులు, నిఘా సిబ్బంది
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో: పూర్వం ఎవరన్నారో కానీ ఇప్పుడు అది అక్షర సత్యమైంది. డబ్బున్నోడికే పల్లె పట్టం కడుతుంది. ‘డబ్బు లేని వాడు డుబ్బుకు కొరగాడు’ అన్న సామే త లాగా డబ్బులు లేని వారు వార్డు సభ్యునిగా కూడా గెలిచే పరిస్థితి లేదు. ప్రజాసేవ, మంచితనం, సామాజిక ధృక్ప థం ఇవన్నీ ఎప్పుడో నోట్ల గాలికి కొట్టుకుపోయా యి. ప్రజాసేవలో తలపండిన వారు నిస్వార్థపరులుగా వాసికెక్కిన వారు ఇప్పుడు డబ్బులున్న పిల్ల కాకుల ముందు పరాజయం పాలవుతున్నారు. నోటు ఫలితాన్ని శాసిస్తుంది. నోటే గెలుపును సాధించిపెడుతుంది. డబ్బుల పంపిణీ పల్లె ఫలితాలను ఏకపక్షం చేస్తుంది. ఒక కవి చెప్పినట్లుగా డబ్బు నోరు లేకుండానే పలికిస్తుంది. కళ్లు లేకుండానే శాసిస్తుంది. కాళ్లు లేకుండానే నడిపిస్తుంది. చేతులు లేకుండానే ఆడిస్తుంది. పల్లెలకు దూ రంగా పట్టణాల్లో వ్యాపారాలు ఇతరత్రా పనులు చేసుకుంటూ బాగా డబ్బు సంపాదించిన వారు పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని పల్లె ముఖం చూడడం మొదలు పెట్టారు. సంపాదించుకున్న దానిని ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. సర్పంచ్ గిరి తగిలించుకుని తిరిగి పట్టణాలకు చేరుతున్నారు. ఖమ్మం జిల్లాలో మొదటి రెండు దశల ఎన్నికల్లో డబ్బు పంపిణీ ఎవరు ఎక్కువ చేస్తే వారే గెలుపొందడంతో మూడవ దశకు సంబంధించి పంపిణీ మరింత తారాస్థాయికి చేరింది. ఇక మద్యానికి పరిమితి లేదు. ఎంత తాగితే అంత తాగినోడికి తాగినంత ప్రత్యర్థిని బట్టి ఓటర్లకు తాయిలాలు అందుతున్నాయి. వెండి గిన్నెలు, ప్రెషర్ కుక్కర్లు, చీరెలు, పంచెలు ఇప్పుడు పరిపాటయ్యాయి. బిర్యానీ బియ్యం, ఓటుకు రూ.3వేల నగదు ఇచ్చిన అభ్యర్థులు కూడా ఉన్నారు. 380 ఓట్లు ఉన్న ఓ పంచాయతీలో ఇద్దరు ప్రధాన అభ్యర్థులు పెట్టిన ఖర్చు రూ.60 లక్షల పైమాటే అంటే పంచాయతీలో ఖర్చు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.