భవనం పదో అంతస్తు పైనుంచి పడి ఐదుగురు కార్మికుల దుర్మరణం
మేడ్చల్ జిల్లా రాంపల్లిలో ఘటన
ప్రజాపక్షం/మేడ్చల్ జిల్లా ప్రతినిధి : బతుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చి కూలీ పని చేసుకుంటూ జీవ నం సాగిద్దామనుకున్న వారిని మృత్యువు కబళించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ బహుళ సముదాయం వద్ద 10వ అంతస్తుపై పనిచేస్తుండగా గోవా బేస్ విరిగిపోవడంతో ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామ శివారులో గల ఇన్ఫోసిస్ వెనకాల ఉన్న ప్రభుత్వ స్థ లంలో డిఇసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మొ త్తం 52 బ్లాక్‌లలో 6,240 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. మొత్తం జీ ప్లస్ టెన్ చేపట్టగా అ న్ని కూడా నిర్మాణం మొదలై తుది దశలో ఉ న్నాయి. ఇక్కడ బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమా రు 2 వేల మంది కూలీలు షిఫ్టుల వారీగా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బ్లాక్ నెంబర్ 12లో 10వ అంతస్థులో ఆరుగురు పని చేస్తుండగా ప్రమాదవశాత్తు గోవా బేస్ విరిగిపోయి కిం దపడిపోయింది. అందులో ఐదుగురు చనిపోగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృ తిచెందిన వారు సైఫుల్ హక్ (26), అభిజిత్ రాయ్ (18), సైఫల్ రాయ్ (32), షేక్ మిలన్ (22), యష్‌కుమార్ చౌదరి (30)లుగా గుర్తించారు. తోటి కార్మికులు మృతిచెందడంతో మిగతా కార్మికులు కాంట్రాక్టు సంస్థ ఆఫీసుపై కార్మికుల దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఫ్లాట్‌ఫాం కిందపడి తోటి కూలీలు మృతి చెందారని ఆగ్రహంతో కార్యాలయం అద్దాలను ధ్వంసం చేశారు. కంప్యూటర్లు, కుర్చీలు, ఇతర సామాగ్రిని విరగ్గొట్టారు. అందులో పనిచేస్తున్న ఉద్యోగులపై దాడికి దిగారు. దీంతో కొద్ది సేపు సంఘటనా స్థలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆఫీసు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డిసిపి ఉమా మహేశ్వర శర్మ, ఏసీపీ శివకుమార్, కుషాయిగూడ, కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.